జెరూసలేం: ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు చేశాను. బ్రిటన్‌ను ఎద్దేవా చేస్తూ ఆ దేశాన్ని ‘ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ బ్రిటన్’ అని అభివర్ణించారు. అంతేకాదు అణు ఆయుధాలు కలిగిన మొట్టమొదటి ఇస్లామిక్ రిపబ్లిక్ బహుశా బ్రిటనే కావచ్చని ఆయన వ్యాఖ్యానించారు. ఇజ్రాయెల్ ఆర్మీ రేడియో పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో నెతన్యాహు ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నెతన్యాహు వ్యాఖ్యలపై బ్రిటన్ ఖండించింది.
ఇంటర్వ్యూలో భాగంగా నెతన్యాహు మాట్లాడుతూ, గతంలో బ్రిటన్ మాజీ ప్రధాని విన్‌స్టన్ చర్చిల్ మనవడు జర్నలిస్టుగా ఇజ్రాయెల్‌కు అనుకూలంగా వార్తలు రాశారని గుర్తుచేశారు. కానీ నేటి బ్రిటన్‌లో అటువంటి అనుకూల వాతావరణం ఎక్కడా కనబడట్లేదని, ప్రస్తుతం దాన్ని ‘ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ బ్రిటన్’ అని అనవచ్చని వ్యాఖ్యానించారు. యూరప్ అంతా అలాగే ఉందా అని హోస్ట్ ప్రశ్నించగా, నెతన్యాహు మరింతగా స్పందిస్తూ అణు ఆయుధాలు కలిగిన మొట్టమొదటి ఇస్లామిక్ దేశం బ్రిటనే కావొచ్చని, తాము మాత్రం ఇరాన్ అలా మారకుండా చూసుకుంటున్నామని పేర్కొన్నారు.
బ్రిటన్ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం
ఇజ్రాయెల్ ప్రధాని వ్యాఖ్యలపై బ్రిటన్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. నెతన్యాహు చేసిన ఈ వ్యాఖ్యలు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని బ్రిటన్ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లినట్లు వెలడించింది. గాజా యుద్ధం, విదేశీ విధానాల నేపథ్యంలో బ్రిటన్‌కు, ఇజ్రాయెల్‌కు మధ్య దౌత్యపరమైన సంబంధాలు ఉద్రిక్తంగా మారిన తరుణంలో నెతన్యాహు ఈ వ్యాఖ్యలు చేయడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.


