పశ్చిమాసియాను కుదిపేస్తున్న యుద్ధ మేఘాలు క్రమంగా తొలగిపోతున్నాయా? నెలల తరబడి కొనసాగుతున్న అమెరికా–ఇరాన్ ఘర్షణకు తెరపడే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఓ వైపు ఆయుధ నిల్వలు, యుద్ధ సామర్థ్యంపై చర్చలు సాగుతుండగా.. మరోవైపు కీలక దేశాల మధ్య దౌత్య ప్రయత్నాలు వేగం పుంజుకోవడం ఆసక్తిని రేపుతోంది.
ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధం “చాలా త్వరలోనే ముగుస్తుందని భావిస్తున్నా” అని ఓవల్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ తెలిపారు. ఇరాన్ ఈ యుద్ధాన్ని ఎక్కువ కాలం కొనసాగించే పరిస్థితిలో లేదని ఆయన పేర్కొన్నారు.
క్షిపణుల నిల్వలపై వస్తున్న ప్రశ్నలపైనా ట్రంప్ స్పందించారు. కొన్ని అత్యంత శక్తివంతమైన ఆయుధాలు తమ వద్ద భారీగా ఉన్నాయని, మరికొన్ని ఆయుధాల నిల్వలు పరిమితంగా ఉన్నాయని అంగీకరించారు. అయితే అమెరికా సైన్యం మాత్రం “చాలా మంచి స్థితిలోనే ఉందని” స్పష్టం చేశారు.
ఇటీవల ఇరాన్‌తో నెలల తరబడి సాగిన యుద్ధంలో అమెరికా సైన్యం అత్యంత ఖచ్చితమైన దీర్ఘశ్రేణి క్షిపణుల నిల్వలను భారీగా వినియోగించిందని వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలోనే ఆయుధాల లభ్యతపై చర్చ మొదలైంది. అయితే ఆయుధాల కొరతను అధిగమించేందుకు అమెరికా రక్షణ సంస్థలు కొత్త తయారీ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాయని ట్రంప్ తెలిపారు. ముఖ్యంగా పేట్రియాట్, టామాహాక్ క్షిపణుల ఉత్పత్తిని పెంచుతున్నట్లు వెల్లడించారు.
హర్ముజ్ జలసంధిపై కీలక నిర్ణయం?
మరోవైపు ఇరాన్, అమెరికా, ఒమన్ మధ్య కీలక చర్చలు జరుగుతున్నాయి. ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడానికి తాత్కాలిక ఒప్పందం దిశగా అడుగులు పడుతున్నట్లు సమాచారం. ఈ మార్గంలో ఆంక్షలు, భద్రతా సమస్యలు ప్రపంచ చమురు మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి.
మోదీ–నెతన్యాహు ఫోన్‌కాల్
పశ్చిమాసియాలో తాజా పరిణామాలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఫోన్‌లో చర్చించారు. భారత్–ఇజ్రాయెల్ వ్యూహాత్మక భాగస్వామ్యంపై కూడా ఇరువురు నేతలు సమీక్షించినట్లు మోదీ తెలిపారు.
Received a phone call from Prime Minister Benjamin Netanyahu. We reviewed progress on various aspects of the India-Israel Special Strategic Partnership which continues to grow from strength-to-strength.
We also exchanged views on the current situation in West Asia.@netanyahu— Narendra Modi (@narendramodi) August 6, 2026
ప్రాంతీయ భద్రతపై సౌదీ–ఫ్రాన్స్ చర్చలు
తాజా పరిస్థితులు, ఎర్ర సముద్రంలో నౌకా రవాణా స్వేచ్ఛపై సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ చర్చించారు. హౌతీ దాడుల నేపథ్యంలో ప్రాంతీయ భద్రతపై ఇరువురు నేతలు దృష్టి సారించారు.
చమురు ధరలు మళ్లీ పైకి
పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావంతో అంతర్జాతీయ చమురు ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 82 డాలర్లకు పైగా చేరింది. అమెరికా వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) ధర కూడా 77 డాలర్లకు ఎగబాకింది. హర్ముజ్ జలసంధిలో అమెరికా, ఇజ్రాయెల్‌కు చెందిన నౌకలపై ఆంక్షలు విధించేలా ఇరాన్ పార్లమెంట్‌లో ప్రతిపాదన పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. నిబంధనలు ఉల్లంఘించే నౌకలకు భారీ జరిమానాలు విధించే ప్రతిపాదన ఉన్నట్లు తెలుస్తోంది.
ఇరాన్ తీవ్ర ఆరోపణలు.. గ్యాస్ నష్టంపై వ్యాఖ్యలు
అమెరికా గరిష్ఠ ఆర్థిక ఒత్తిడి విధానాన్ని కొనసాగిస్తోందని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ఆరోపించారు. అమెరికా–ఇజ్రాయెల్ దాడుల కారణంగా రోజుకు దాదాపు 230 మిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ నష్టపోతున్నామని పేర్కొన్నారు.
కొనసాగుతున్న ఉద్రిక్తతలు
ఇరాన్–అమెరికా యుద్ధ వాతావరణం కొనసాగుతుండగా, ప్రాంతంలోని ఇతర దేశాల్లోనూ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. యెమెన్‌లో హౌతీ దాడుల్లో కనీసం 18 మంది సైనికులు మరణించినట్లు సమాచారం. డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులతో దాడులు జరిగినట్లు హౌతీ వర్గాలు ప్రకటించాయి. లెబనాన్–ఇజ్రాయెల్ మధ్య రోమ్‌లో జరిగిన చర్చలు ముగిశాయి. చర్చలు ఫలప్రదంగా సాగాయని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయెల్ మరోసారి వైమానిక దాడులు నిర్వహించింది. కాల్పుల విరమణ చర్చలు పక్కకు జరిగిన సమయంలో ఈ దాడులు జరగడం గమనార్హం.
గాజాలో పిల్లల మరణాలపై యూనిసెఫ్ ఆందోళన
గాజాలో పరిస్థితిపై యూనిసెఫ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. 2025 అక్టోబర్ కాల్పుల విరమణ తర్వాతి 300 రోజుల్లో కనీసం 300 మంది పిల్లలు మరణించినట్లు తెలిపింది. రోజుకు సగటున ఒక చిన్నారి ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించింది.
ఇరాన్‌పై యుద్ధం ముగింపుకు చేరుకుంటోందని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు, హర్ముజ్ ఒప్పంద ప్రయత్నాలు, చమురు ధరల పెరుగుదల.. పశ్చిమాసియా సంక్షోభం కీలక మలుపులోకి ప్రవేశించిన సంకేతాలుగా కనిపిస్తున్నాయి.


