దుబాయ్: హార్మూజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న తమ చమురు నౌకలపై ఇరాన్ దాడికి పాల్పడిందని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) శుక్రవారం ఆరోపించింది. యూఏఈ ప్రభుత్వ సంస్థ అడ్నాక్‌కు చెందిన ఈ రెండు నౌకలపై గురువారం సాయంత్రం హార్మూజ్‌లో ఉండగా దాడి జరిగిందని పేర్కొంది. ఈ దాడిలో ఎవరూ గాయపడలేదని, ఎటువంటి తీవ్రమైన నష్టం వాటిల్లలేదని పేర్కొంది.
ఈ నౌకలపై డ్రోన్ దాడి జరిగినట్లు యూకే మారిటైమ్ విభాగం ధ్రువీకరించింది. దాడులకు ఇరానే కారణమని యూఏఈ ఆరోపించింది. ఇటువంటి చర్యలు ఐక్యరాజ్యసమితి స్వేచ్ఛా నౌకాయాన సూత్రాలను బహిరంగంగా ఉల్లంఘించడమేనని పేర్కొంది. వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకొని బెదిరింపులకు పాల్పడటం సముద్రపు దొంగతనాలుగానే భావించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది. దీనిపై ఇరాన్ స్పందించలేదు.


