మోదీపై రాహుల్ వ్యాఖ్యలను ఖండించిన విదేశాంగ శాఖ
న్యూఢిల్లీ: ఇటలీతో భారత్‌కు బలమైన సంబంధాలు ఉన్నాయని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణదీర్ జైస్వాల్ శుక్రవారం స్పష్టంచేశారు. ఎవరైనా సరే బహిరంగ కార్యక్రమాల్లో మాట్లాడేటప్పుడు గౌరవంగా వ్యవహరించాలని సూచించారు. ఇతరులను గౌరవించడం నేర్చుకోవాలని చెప్పారు. గౌరవం అనేది పరస్పరం ఇచ్చిపుచ్చుకోవాలని అన్నారు.
విదేశీ నేతలను ఆలింగనం చేసుకోవడమే ప్రధాని నరేంద్ర మోదీ విదేశాంగ విధానంగా మారిందంటూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన విమర్శలపై రణ«దీర్ జైస్వాల్ పరోక్షంగా స్పందించారు. ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీని ప్రధాని మోదీ ఆలింగనం చేసుకోవడం పెద్ద తప్పు అన్నట్టుగా రాహుల్ ఎద్దేవా చేయడాన్ని ఖండించారు. ఇటీవలి కాలంలో భారత్, ఇటలీ మధ్య సంబంధాలు మరింత విస్తరించాయని చెప్పారు. పరస్పర గౌరవాన్ని దృష్టిలో పెట్టుకొని ఇతర దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకోవడం దౌత్యపరమైన విధానంలో కీలకమైన అంశమని తెలిపారు.


