‘మరీ ఇలా ఉన్నారేంటి!’.. ఇజ్రాయెల్‌ సెటిలర్ల దుశ్చర్య | They Took the Water Filled the Pool: West Banks New Flashpoint | Sakshi
Sakshi News home page

‘మరీ ఇలా ఉన్నారేంటి!’.. ఇజ్రాయెల్‌ సెటిలర్ల దుశ్చర్య

Aug 15 2026 12:11 PM | Updated on Aug 15 2026 12:24 PM

They Took the Water Filled the Pool: West Banks New Flashpoint

ఇజ్రాయెల్‌–పాలస్తీనా వివాదం కేవలం భూమి, సరిహద్దులకే పరిమితం కావడం లేదు. ఇప్పుడు నీటి వనరులపై ఆధిపత్య పోరు కూడా తీవ్ర చర్చకు దారితీస్తోంది. సహజ ఊటలను ఇజ్రాయెలీ సెటిలర్లు తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారని పాలస్తీనియన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటి సరఫరా నిలిచిపోవడంతో తమ వ్యవసాయం, జీవనాధారం దెబ్బతింటోందని కన్నీరు పెడుతున్నారు. అయితే మరో వాదనతో ఇజ్రాయెలీ వర్గాలు తమ చర్యలను సమర్థించుకుంటున్నాయి.

జోర్డాన్‌ లోయలోని ఫసాయిల్‌ గ్రామం ఈ వివాదానికి కేంద్రంగా మారింది. తరతరాలుగా స్థానిక రైతులకు ఆధారంగా ఉన్న ఓ సహజ ఊట నీటిని ఇజ్రాయెల్‌ సెటిలర్లు మళ్లించుకున్నారు. ఆ సమీపంలోని ఓ పురాతన కొలనును నింపి.. ఈతలు కొడుతూ వినోదం పొందుతున్నారు. అదే సమయంలో కొందరు.. ఉత్త పుణ్యానికే ట్యాంకర్లలో ఊట నీటిని నింపి దారి పొడవునా పారబోసుకుంటూ పోవడం, నిర్జన ప్రదేశంలో వదిలేయడం లాంటి దృశ్యాలు వెలుగులోకి వస్తున్నాయి.  దీంతో పాలస్తీనా రైతులు ఆందోళనకు గురవుతున్నారు.

ఈ నీటితో గతంలో తమ పొలాల్లో వంకాయలు, సొరకాయలు, పుచ్చకాయలు వంటి పంటలు పండించేవారమని.. ఇప్పుడు సాగు నిలిచిపోయిందని వాపోతున్నారు. “నీరు లేకపోవడంతో మా పొలాలు ఎండిపోయాయి. కుటుంబాల జీవనోపాధి దెబ్బతింది” అని ఫసాయిల్‌కు చెందిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాగునీటి పైపులను స్వాధీనం చేసుకున్నారని, ఊట వైపు వెళ్లేందుకు కూడా భయపడే పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు.

కొలనుగా మారిన ఊట.. పర్యాటక ప్రాంతమా?
స్థానికులు చెబుతోంది ఏంటంటే.. ఊట నీటిని మళ్లించి పురాతన కొలనును నీటితో నింపారు. అనంతరం దానిని పర్యాటక ఆకర్షణగా ప్రచారం చేశారు. అయితే ఇజ్రాయెల్‌కు చెందిన కొందరు సెటిలర్లు మాత్రం మరోలా వాదిస్తున్నారు. ఈ ప్రాంతం తమ చారిత్రక వారసత్వంలో భాగమని చెబుతున్నారు. కానీ ఇందులో నిజమెంత? అనేదానిపై పురావస్తు నిపుణులు మరోలా స్పందించారు.

ఈ ప్రాంత చరిత్రపై పూర్తి స్పష్టత లేదని అంటున్నారు. దీంతో చరిత్ర, పురావస్తు అంశాలను ఉపయోగించి వెస్ట్‌ బ్యాంక్‌పై ఆధిపత్య భావనను పెంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

‘ఇది నీటి యుద్ధం’.. పాలస్తీనా ఆరోపణ
పాలస్తీనా అధికారులు మాత్రం నీటి వనరుల నియంత్రణను పెద్ద సమస్యగా చూస్తున్నారు. నీటిని నిలిపివేయడం ద్వారా ప్రజల జీవన విధానాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. “ఇది శబ్దం లేని బుల్లెట్‌లాంటి నీటి యుద్ధం” అని పాలస్తీనా వాటర్‌ అథారిటీ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఐక్యరాజ్యసమితి గణాంకాల ప్రకారం.. వెస్ట్‌ బ్యాంక్‌లోని పలు నీటి, పారిశుద్ధ్య వనరులపై ఈ ఏడాది దాడులు జరిగినట్లు నమోదైంది. ముఖ్యంగా జోర్డాన్‌ లోయ ప్రాంతాల్లో నీటి వనరులపై నియంత్రణ కోసం ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. అతిత్వరలో ఇది తాగునీటికి విస్తరించవచ్చనే ఆందోళన సైతం వ్యక్తమవుతోంది అక్కడ. 

గ్రామాలపై పెరుగుతున్న ఒత్తిడి
నీటి సమస్యతో పాటు సెటిలర్ల దాడులు, బెదిరింపులు పెరుగుతున్నాయని పాలస్తీనియన్లు చెబుతున్నారు. కొన్ని గ్రామాల్లో నీరు, విద్యుత్‌ సరఫరాలను నిలిపివేసిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయని చెప్పారు. మరోవైపు.. ఇజ్రాయెల్‌ సెటిలర్లు మాత్రం అవంతా ఆరోపణలనే అంటున్నారు. ఈ ప్రాంతాలు తమ చారిత్రక, మతపరమైన వారసత్వంతో ముడిపడి ఉన్నాయని చెబుతున్నారు. పురాతన ప్రదేశాల అభివృద్ధి, పర్యాటక ప్రోత్సాహంలో భాగంగానే చర్యలు తీసుకుంటున్నట్లు సమర్థించుకుంటున్నారు.

భవిష్యత్‌లో మరింత ఉద్రిక్తత?
వెస్ట్‌ బ్యాంక్‌లో భూమి తర్వాత నీరు మరో ప్రధాన వివాద అంశంగా మారుతోంది. వ్యవసాయం, తాగునీరు, జీవనోపాధికి ఆధారమైన సహజ వనరులపై నియంత్రణ కోసం జరుగుతున్న పోరు భవిష్యత్‌లో మరింత ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement