పెళ్లి బాజాలు ఇక లంకలో.. | Sri Lanka Is Emerging as a Favourite for Indian Destination Weddings | Sakshi
Sakshi News home page

పెళ్లి బాజాలు ఇక లంకలో..

Aug 15 2026 6:07 AM | Updated on Aug 15 2026 12:33 PM

Sri Lanka Is Emerging as a Favourite for Indian Destination Weddings

భారతీయుల కొత్త వెడ్డింగ్‌ హాట్‌స్పాట్‌ శ్రీలంక 

పశ్చిమాసియా ఉద్రిక్తతలతో దుబాయ్‌కి బ్రేక్‌ 

డెస్టినేషన్‌  వెడ్డింగ్స్‌కు శ్రీలంక, థాయ్‌లాండ్, వియత్నాం, బాలి వైపు మొగ్గు 

విదేశాల్లో పెళ్లి బడ్జెట్‌ రూ.1.5 కోట్లు

భారతీయుల డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ మార్కెట్‌లో కొత్త ట్రెండ్‌ మొదలైంది. ఒకప్పుడు దుబాయ్, ఒమన్, టర్కీ వంటి పశ్చిమాసియా దేశాలు సంపన్న భారతీయ కుటుంబాల పెళ్లిళ్లకు ప్రధాన వేదికలుగా ఉండగా. ఇప్పుడు ఆ స్థానాన్ని శ్రీలంక, వియత్నాం,థాయ్‌లాండ్, ఇండోనేషియా దేశాలు వేగంగా ఆక్రమిస్తున్నాయి.

 భారత్‌కు దగ్గరగా ఉండడం, ప్రయాణ సౌలభ్యం, విలాసవంతమైన హోటళ్లు, తక్కువ ఖర్చుతో అంతర్జాతీయ అనుభూతి లభించడం వంటి కారణాలతో 2025లో భారతీయుల పెళ్లిళ్లకు ఆగ్నేయాసియా దేశాలు అత్యంత వేగంగా ఎదుగుతున్న విదేశీ వెడ్డింగ్‌ డెస్టినేషన్ల గమ్య స్థానంగా మారినట్లు వెడ్డింగ్‌ ప్లానింగ్‌ సంస్థ ’వెడ్‌ మి గుడ్‌’ నివేదిక వెల్లడించింది. 

2025లో ఒక్క శ్రీలంకలో భారతీయ డెస్టినేషన్‌ వెడ్డింగ్స్‌కు డిమాండ్‌ 25% పెరిగిందని వచ్చే కొన్నేళ్ల పాటు ప్రతి ఏడాది 20–25% వృద్ధి కొనసాగుతుందని అంచనా వేసింది. మరోవైపు పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధవాతావరణం కారణంగా అక్కడి వెడ్డింగ్‌ మార్కెట్‌పై కొంత ప్రభావం కనిపించినప్పటికి విదేశాల్లో పెళ్లి చేసుకోవాలనే భారతీయుల ఆసక్తి ఏమాత్రం తగ్గడం లేదని పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. డెస్టినేషన్‌ వెడ్డింగ్స్‌కి శ్రీలంక, ఇతర దేశాలు వేగంగా ఎదుగుతున్నప్పటికీ పర్యాటకంగా భారతీయుల తొలి ఎంపిక మాత్రం థాయ్‌లాండే. 2025లో దాదాపు 25 లక్షల మంది భారతీయులు థాయ్‌లాండ్‌ను సందర్శించారు. ఏడాది ప్రాతిపదికన 16% పెరుగుదల నమోదైంది.  

పెళ్లితోపాటు అనుభవం కూడా ముఖ్యం. 
ఇప్పటి తరం జంటలు పెళ్లి కేవలం వేడుక కోసం కాకుండా కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి మరుపురాని అనుభవాన్ని సృష్టించేందుకు డెస్టినేషన్‌ వెడ్డింగ్స్‌కు ప్రాధాన్యమిస్తున్నాయి. అందుకే పెళ్లి వేడుకులు కూడా గతంతో పోలిస్తే ఎక్కువ రోజులు కొనసాగుతున్నాయి. కరోనాకు ముందు సగటున 1–2 రోజులు జరిగే డెస్టినేషన్‌ వెడ్డింగ్స్‌ ఇప్పుడు మూడు, నాలుగు రోజుల పాటు నిర్వహిస్తున్నారు. 

భారీగా పెరిగిన బడ్జెట్‌ 
డెస్టినేషన్‌ వెడ్డింగ్స్‌కు భారతీయులు చేసే ఖర్చు కూడా గణనీయంగా పెరిగింది. దేశీ డెస్టినేషన్‌ వెడ్డింగ్స్‌కు సగటు బడ్జెట్‌ రూ.58 లక్షలు అయితే విదేశీ డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ సగటు బడ్జెట్‌ రూ.1.5 కోట్లు పైమాటే. అయినా లగ్జరీ పెళ్లిళ్ల మార్కెట్‌ మరింత విస్తరిస్తోందని ముందు ముందు ఇది మరింత పెరుగుతుందని పరిశ్రమ 
అంచనా వేస్తోంది.

సంక్షోభంతో మారుతున్న ఎంపిక 
పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా నెలకొన్న భద్రతా పరిస్థితులు, విమాన చార్జీలు పెరుగుదల, హోటళ్ల టారిఫ్‌లు అమాంతం పెరిగిపోవడం కూడా భారతీయుల పెళ్ళి ప్రణాళికలను ప్రభావితం చేశాయి. అయితే విదేశాల్లో పెళ్లి చేసుకోవాలనే నిర్ణయాన్ని మాత్రం భారతీయ సంపన్న కుటుంబాలు మార్చుకోవడం లేదని కేవలం దేశాన్నే మార్చుకుంటున్నాయి. భద్రత, ప్రయాణ సౌలభ్యం, అతి«థులకు కూడా సులభమైన వీసా విధానం ఉన్న శ్రీలంక, ఇండోనేíÙయా దేశాలపై ఇప్పుడు ఎక్కువ మంది దృష్టి పెడుతున్నాయి.

టాప్‌ విదేశీ వెడ్డింగ్‌ గమ్యస్థానాలు 
థాయ్‌లాండ్, బాలి (ఇండోనేషియా) వియత్నాం, మలేషియా ఇటలీ, ఫ్రాన్స్, గ్రీస్, స్పెయిన్, పోర్చుగల్‌ 

భారత్‌లో ఇవీ... 
దేశీ డెస్టినేషన్‌ వెడ్డింగ్స్‌లో డెహ్రాడూన్, ముస్సోరీ, రిషికేశ్, సిమ్లా, జిమ్‌ కార్బెట్‌ తొలి ఐదు స్థానాల్లో ఉండగా, ఉదయ్‌పూర్,జైపూర్,జైసల్మేర్,జో«ద్‌పూర్, గోవా కూడా  ప్రజాదరణ పొందుతున్నాయి.  

శ్రీలంకకు భారతీయుల వెల్లువ 
శ్రీలంక టూరిజం డెవలప్‌మెంట్‌ అథారిటీ గణాంకాల ప్రకారం 2023లో 3 లక్షల మంది భారతీయ పర్యాటకులు ఆదేశాన్ని సందర్శించగా 2024లో 4.17 లక్షలు, 2025లో అది 5.30 లక్షలు దాటింది. భారత్‌ ప్రస్తుతం శ్రీలంకకు అతిపెద్ద విదేశీ పర్యాటక మార్కెట్‌. ఈ పెరుగుతున్న పర్యాటక ప్రవాహమే డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ రంగానికి ఊతమిస్తోంది. ఇది  లగ్జరీ హోటళ్లు, విమానయాన సంస్థలు, ట్రావెల్‌ కంపెనీలు, డెకరేషన్, ఫొటోగ్రఫీ, ఫ్యాషన్, క్యాటరింగ్, టూరిజం రంగాలకు కూడా కోట్లాది వ్యాపారాన్ని సృష్టిస్తున్న భారీ పరిశ్రమగా మారుతోంది.

 – సాక్షి, బిజినెస్‌ డెస్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement