భారత తుది జట్టులో స్థానంపై పోటీ
గాలే: శ్రీలంకతో తొలి టెస్టులో భారత తుది జట్టు విషయంలో దాదాపుగా అన్ని పేర్లు ఖాయమైనా...ఆరో స్థానం విషయంలోనే కాస్త చర్చ సాగుతోంది. ఇప్పటి వరకు ఈ స్థానంలో ధ్రువ్ జురేల్ ఆడుతుండగా, ఇప్పుడు సర్ఫరాజ్ ఖాన్ నుంచి అతడికి పోటీ ఎదురవుతోంది. రెగ్యులర్ వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్ ఇప్పటికే టీమ్‌లో ఉండగా, జురేల్ స్పెషలిస్ట్ బ్యాటర్‌గా ఆడుతున్నాడు. అయితే ఇటీవలి తన ప్రదర్శనతో అతను తగిన న్యాయం చేయలేకపోతున్నాడు. వెస్టిండీస్‌పై సెంచరీ తర్వాత ఆడిన 7 ఇన్నింగ్స్‌లలో జురేల్ వరుసగా 44, 6 నాటౌట్, 14, 13, 0, 2, 19 పరుగులు చేశాడు. వీటిలో ఐదుసార్లు అతను స్పిన్నర్ల బౌలింగ్‌లో అవుటయ్యాడు.
మరోవైపు సర్ఫరాజ్‌కు స్పిన్‌ను అద్భుతంగా ఆడగలడనే పేరుంది. లంక గడ్డపై స్పిన్నర్లు తీవ్రంగా ప్రభావం చూపనున్న నేపథ్యంలో జురేల్ తన ఆటను మెరుగుపర్చుకోవడంపై దృష్టి పెట్టాడు. అందుకోసం అతను కేఎల్ రాహుల్ వద్ద తగిన సూచనలు తీసుకున్నాడు. రాహుల్‌తో కలిసి ప్రాక్టీస్ చేస్తూ మరింత మెరుగైన ప్రదర్శన ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. భారత బ్యాటర్లలో శ్రీలంకలో టెస్టులు ఆడిన అనుభవం ఒక్క రాహుల్‌కే ఉంది. బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ కూడా ఇదే విషయాన్ని చెప్పాడు.
‘కేఎల్ రాహుల్ ఆట గురించి అందరికీ బాగా తెలుసు. అతని అనుభవం జట్టుకు ఎంతో కీలకం. గత రెండేళ్లుగా అతను ముందుండి జట్టును నడిపిస్తున్నాడు. టీమ్‌లోని ఇతర సభ్యులకు సన్నాహకాల్లో అతను సహకరించాలనే మేం కోరుకుంటున్నాం. నెట్స్‌లో యువ ఆటగాళ్లకు మార్గనిర్దేశనం చేయడం చాలా అవసరం’ అని మోర్కెల్ అన్నాడు. జురేల్ కూడా జట్టులో తన స్థానాన్ని ఖాయం చేసుకోవాలంటే మరింత శ్రమించాల్సిందేనని అతను చెప్పాడు.
కొన్నాళ్ల క్రితం ‘ఎ’ జట్టు తరఫున జురేల్ ఇక్కడ రాణించాడు ‘పది రోజుల ముందే ఇక్కడికి వచ్చి మేం సిరీస్ కోసం సిద్ధమవుతున్నాం. గాలేలాంటి చోట ఎలా పరుగులు చేయాలనేది స్వయంగా బ్యాటర్లే గుర్తించాలి’ అని మాజీ పేసర్ అభిప్రాయ పడ్డాడు. ఇలాంటి స్థితిలో జురేల్‌కు అవకాశం దక్కుతుందా...ఒక వేళ చాన్స్ లభిస్తే దానిని అతను వాడుకోగలడా అనేది చూడాలి.


