‘చాంపియన్‌ మనస్తత్వం ముఖ్యం’ | Indian mens hockey team mental conditioning coach Paddy Upton comments | Sakshi
Sakshi News home page

‘చాంపియన్‌ మనస్తత్వం ముఖ్యం’

Aug 14 2026 1:17 AM | Updated on Aug 14 2026 1:17 AM

Indian mens hockey team mental conditioning coach Paddy Upton comments

భారత పురుషుల హాకీ జట్టు మెంటల్‌ కండిషనింగ్‌ కోచ్‌ ప్యాడీ ఆప్టన్‌ వ్యాఖ్య  

అమ్‌స్టర్‌డామ్‌: హాకీ ప్రపంచకప్‌ ప్రారంభానికి ముందే భారత జట్టు చాంపియన్‌ల మనస్తత్వాన్ని అలవర్చుకోవాలని ప్రముఖ మానసిక శిక్షకుడు ప్యాడీ ఆప్టన్‌ అభిప్రాయపడ్డాడు. 2011లో భారత క్రికెట్‌ జట్టు ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ గెలుచుకున్న సమయంలో జట్టు మెంటల్‌ కండీషనింగ్‌ కోచ్‌గా వ్యవహరించిన ఆప్టన్‌ ఇప్పుడు భారత హాకీ జట్టుకు అదే సేవలు అందిస్తున్నాడు. 2024 పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు కాంస్యం గెలుచుకున్న సమయంలోనూ ఆప్టన్‌ జట్టుతో పాటే ఉన్నాడు. బెల్జియం, నెదర్లాండ్స్‌ వేదికగా శనివారం పురుషుల హాకీ ప్రపంచకప్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆప్టన్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు.

‘చాంపియన్‌ జట్టు తాము విజేతలమని నిరూపించుకోడానికి ఫైనల్‌ వరకు వేచి ఉండదు. టోర్నీలో అడుగుపెట్టేటప్పుడే విజేతగా వస్తుంది. మనం ఇతర జట్ల స్థాయిలో శారీరక దృఢత్వాన్ని కలిగి ఉండేలా చూసుకోవాలి. అలాగే ప్రధాన టోర్నమెంట్‌ల సమయంలో శరీరానికి తగినంత విశ్రాంతి, నిద్ర కూడా అవసరం. క్రికెట్, హాకీలో కాస్త తేడా ఉంటుంది. క్రికెట్‌లో వ్యక్తిగత ప్రదర్శనపై ఎక్కువ దృష్టి ఉంటుంది. అదే హాకీలో జట్టు ప్రదర్శనకే ప్రాధాన్యత దక్కుతుంది. 

ఒక వ్యక్తి మానసిక స్థితి తన చుట్టూ ఉన్నవారిపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది చాలా ముఖ్యం. క్రికెట్‌లో ఇద్దరు ఆటగాళ్లే క్రీజులో జట్టు భారాన్ని మోస్తూ ఉంటారు. కానీ హాకీలో అలాకాదు. జట్టు సభ్యులంతా సమూహంగా మైదానంలో చెమటోడుస్తారు’ అని ఆప్టన్‌ వెల్లడించాడు. క్రికెట్‌లో ఒక సమయంలో కేవలం బంతి వేస్తున్న బౌలర్‌ ప్రదర్శనపైనే జట్టు భవితవ్యం ఆధారపడి ఉంటుందని... అలాంటి పద్ధతి హాకీలో ఉండదని అతడు పేర్కొన్నాడు.  

సవాళ్లకు సిద్ధంగా ఉండాలి... 
ప్రపంచకప్‌ ప్రారంభానికి ముందే ఫైనల్‌ గెలవడంపై దృష్టి పెట్టడం లేదని ఆప్టన్‌ అన్నాడు. పారిస్‌ ఒలింపిక్స్‌ సమయంలో భారత హాకీ జట్టు అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపిందని ఆప్టన్‌ గుర్తు చేశాడు. ‘తుది పోరుకు చేరేందుకు సహకరించే ప్రతి అంశంపై దృష్టి పెడుతున్నాం. ఈ క్రమంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. 2024 పారిస్‌ ఒలింపిక్స్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో భారత్‌ అద్భుతం చేసింది. మరే జట్టు విజయం సాధించలేని స్థితిలో టీమిండియా గెలుపొందింది. ఒక ప్లేయర్‌ తక్కువ ఉన్నప్పటికీ మనవాళ్ల పోరాటం మాత్రం జట్టును విజయ తీరాలకు చేర్చింది’ అని ఆప్టన్‌ గుర్తుచేశాడు. 

స్విట్జర్లాండ్‌లోని ఆల్ఫŠస్‌ పర్వత శ్రేణుల్లో నిర్వహించిన ప్రత్యేక శిక్షణ శిబిరం... ప్రతికూల పరిస్థితుల్లో ఆటగాళ్ల సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుందని అతడు పేర్కొన్నాడు. ‘ఆటగాళ్లలో ఐక్యత, దృక్పథాన్ని పెంపొందిచడమే దీని ఉద్దేశం. సాధారణంగా అన్నీ జట్లు ప్రపంచకప్‌ గెలవడానికి మైదానంలో ప్రాక్టీస్‌ చేస్తాయి. కానీ మేము మాత్రం భిన్నమైన పరిస్థితులను ఎంపిక చేసుకున్నాం. 

ఎత్తైన ప్రదేశాల్లో అలిసిపోయినప్పుడు మరో మార్గం అంటూ ఉండదు... ముందుకు సాగాల్సిందే. అలాంటి విపత్కర పరిస్థితుల్లో కలిసికట్టుగా సాగకుంటే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. అచ్చం అలాగే మైదానంలో అందరూ కలిసి పనిచేయకపోతే ఓటమి భయం పొంచి ఉంటుంది. ఏ ఆటలో అయినా నాకౌట్‌ మ్యాచ్‌ల్లో ఒత్తిడి అత్యధికంగా ఉంటుంది. అలాంటి సమయంలోనూ గేమ్‌ ప్లాన్‌కు కట్టుబడి ఉన్నప్పుడే విజయం సాధ్యమవుతుంది’ అని ఆప్టన్‌ వివరించాడు.  

ఓవరాల్‌ చాంపియన్‌ భారత్‌ 
న్యూఢిల్లీ: కామన్వెల్త్‌ ఫెన్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌ ఓవరాల్‌ చాంపియన్‌గా నిలిచింది. నైజీరియా వేదికగా జరిగిన ఈ టోర్నమెంట్‌లో భారత ఫెన్సర్లు మొత్తం 35 పతకాలు సాధించారు. అందులో 13 స్వర్ణాలు, 8 రజతాలు, 14 కాంస్యాలు ఉన్నాయి. సీనియర్‌ విభాగంతో పాటు అండర్‌–23 విభాగంలోనూ మనవాళ్లు సత్తాచాటారు. పోటీల చివరి రోజు భారత ఫెన్సర్లు 5 పసిడి పతకాలు సొంతం చేసుకున్నారు. 

పురుషుల సాబ్రే, మహిళల సాబ్రే, పురుషుల ఇపీ, మహిళల ఇపీ, మహిళల ఫాయిల్‌ విభాగాల్లో బంగారు పతకాలు సాధించారు. ఈ ప్రదర్శనతో కామన్వెల్త్‌ ఫెన్సింగ్‌ సమాఖ్య భారత్‌కు విల్కిన్సన్‌ ట్రోఫీ అందించింది. ‘కామన్వెల్త్‌ ఫెన్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. ఇది మన ఫెన్సర్ల నిరంతర కృషి, క్రమశిక్షణ, పట్టుదలకు నిదర్శనం’ అని భారత ఫెన్సింగ్‌ సంఘం కార్యదర్శి రాజీవ్‌ మెహతా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement