ముగ్గురు స్పిన్నర్లతో..! | India preparing for first Test against srilanka | Sakshi
Sakshi News home page

ముగ్గురు స్పిన్నర్లతో..!

Aug 14 2026 1:13 AM | Updated on Aug 14 2026 1:13 AM

India preparing for first Test against srilanka

తొలి టెస్టుకు సిద్ధమవుతున్న భారత్‌  

గాలే: శ్రీలంకతో జరిగే తొలి టెస్టులో భారత జట్టు ముగ్గురు స్పిన్‌ బౌలర్లతో బరిలోకి దిగడం దాదాపుగా ఖాయమైనట్లే. టీమ్‌ బౌలింగ్‌ కోచ్‌ మోర్నీ మోర్కెల్‌ గురువారం ఈ విషయాన్ని పరోక్షంగా వెల్లడించాడు. మనకు ముగ్గురు వైవిధ్యభరితమైన స్పిన్నర్లు అందుబాటులో ఉన్నారని, వారిని ఎంత సమర్థంగా వాడుకోవాలనేది ముఖ్యమని అతను వ్యాఖ్యానించాడు. సీనియర్‌ లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ రవీంద్ర జడేజాతో పాటు మణికట్టు స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్, మరో యువ లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ మానవ్‌ సుతార్‌ ఆడే అవకాశం ఉంది. 

అఫ్గానిస్తాన్‌తో టెస్టులో అరంగేట్రం చేసిన సుతార్‌ 7 వికెట్లు తీసి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచాడు. ‘మా ముగ్గురు స్పిన్నర్లది భిన్నమైన శైలి. కుల్దీప్‌ ప్రధానంగా అటాకింగ్‌ బౌలర్‌. అతని అనుభవం, బౌలింగ్‌ బలం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సుతార్‌ బంతిని ఎక్కువగా టర్న్‌ చేస్తే కచ్చితత్వంలో జడేజాను మించినవాడు లేడు. ముగ్గురూ ఎడంచేతి వాటం బౌలర్లే కావడంతో ఎలాంటి సమస్యా లేదు. 20 వికెట్లు తీయగల సామర్థ్యం వీరికి ఉంది. కెప్టెన్‌ గిల్‌ మ్యాచ్‌లో ఎలాంటి సమయాల్లో వీరిని ఎలా వాడుకుంటాడనేది మనం చూడాలి.

మ్యాచ్‌ వేదిక గాలేలో గత రికార్డు చూసినా ముగ్గురు స్పిన్నర్లు ఉండటం సరైన నిర్ణయమే అవుతుంది. ఆట సాగుతున్నకొద్దీ పిచ్‌ మారే అవకాశం ఉంది’ అని మోర్కెల్‌ అభిప్రాయపడ్డాడు. మరోవైపు ఈ టెస్టులో పేస్‌ బౌలర్లకు కూడా తగిన ప్రాధాన్యత ఉందని అతను అన్నాడు. అయితే ఆరంభంలోనే వారు ప్రభావం చూపించడం అవసరమని మోర్కెల్‌ పేర్కొన్నాడు. ప్రధాన పేసర్‌గా సిరాజ్‌ బరిలోకి దిగనుండగా, రెండో పేసర్‌గా ప్రసిధ్‌ లేదా గుర్నూర్‌కు చాన్స్‌ లభించవచ్చు. 

‘మన దగ్గర పేస్‌ బౌలింగ్‌లో కూడా మంచి పదును ఉంది. ప్రణాళికలు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడి వాతావరణంలో కూకాబుర్రా బంతి తొందరగా 25–30 ఓవర్లకే మెత్తబడుతుంది. ఆ విషయం అందరికీ తెలుసు. ఆ తర్వాత బంతిని ఎలా వాడాలనేది పేసర్ల మానసిక దృఢత్వానికి పరీక్ష. చిన్న చిన్న స్పెల్స్‌ వేస్తూ పూర్తి స్థాయిలో తమ శక్తి సామర్థ్యాలను వాడుతూ అదే తీవ్రతను కొనసాగించడం ముఖ్యం. క్రీజ్‌ను, లెంగ్త్‌ను సమర్థంగా వాడుకుంటూ ప్రభావం చూపించాల్సి ఉంటుంది’ అని మోర్కెల్‌ విశ్లేషించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement