గాలే వేదికగా శ్రీలంకతో తొలి టెస్ట్‌లో తలపడేందుకు టీమిండియా తమ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి శుభారంభం చేయాలని గిల్ సేన పట్టుదలతో ఉంది. అయితే ఆగస్టు 15న ప్రారంభం కానున్న ఈ మ్యాచ్‌కు ముందు భారత బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
లంకతో జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భారత జట్టుకు కేఎల్ రాహుల్ ఎక్స్ ఫ్యాక్టర్‌గా మారనున్నాడని మోర్కెల్ తెలిపాడు. కాగా ప్రస్తుత భారత జట్టు బ్యాటింగ్ యూనిట్‌లో శ్రీలంకలో టెస్ట్ క్రికెట్ ఆడిన అనుభవం రాహుల్‌కే ఒక్కడికే ఉంది. ఈ క్రమంలోనే రాహుల్ తనకు ఉన్న అనుభవంతో యువ ఆటగాళ్లను ముందుండి నడిపిస్తాడని మోర్కల్ అభిప్రాయపడ్డాడు.
"టెస్టుల్లో కేఎల్ రాహుల్ గత కొన్నేళ్లుగా భారత బ్యాటింగ్ యూనిట్‌ను నడిపిస్తున్న తీరు ఒక అద్భుతం. శ్రీలంక కండీషన్స్, పిచ్‌లపై అతడికి మంచి అనుభవం ఉంది. అతడికి ఉన్న ఈ అనుభవం యువ ఆటగాళ్లకు నెట్ ప్రాక్టీస్ సమయంలో ఎంతగానే ఉపయోగపడింది. అదేవిధంగా గత కొన్ని నెలలుగా మా బాయ్స్ వ్యక్తిగతంగా తమ ఆటను ఎంతో మెరుగుపరుచుకున్నారు.
ఈ సిరీస్‌ను సొంతం చేసుకోవడమే మా ముందున్న ప్రధాన లక్ష్యం. అందుకోసం ప్రత్యేక వ్యూహాలను సిద్దం చేసుకున్నాము. కండీషన్స్ అలవాటు పడేందుకు మేము 10 రోజుల ముందే ఇక్కడకు వచ్చాం" అని ప్రీ మ్యాచ్ కాన్ఫరెన్స్‌లో మోర్కల్ పేర్కొన్నాడు.
కాగా బ్యాటింగ్ పరంగా భారత్ పటిష్టంగా కనిపిస్తున్నప్పటికి.. బౌలింగ్‌లో మాత్రం బలహీనంగా ఉంది. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా లేకపోవడం భారత జట్టుకు ప్రధాన సమస్యగా మారింది. భారత పేస్ బౌలింగ్ యూనిట్ మహ్మద్ సిరాజ్ లీడ్ చేయనున్నాడు. అకిబ్ నబీ, గుర్నూర్ బ్రార్ వంటి వారికి తొలిసారి భారత టెస్ట్ జట్టులో చోటు దక్కింది.


