PC: Instagram
ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్ స్టీవ్ స్మిత్‌కు చేదు అనుభవం ఎదురైంది. ‘క్రికెట్ కంటే నువ్వేమీ గొప్పోడివి కాదు’ అంటూ ఓ అభిమాని అతడిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27లో భాగంగా ఆసీస్ సొంతగడ్డపై బంగ్లాతో రెండు మ్యాచ్‌లు ఆడుతోంది.
చెలరేగిన హసన్ మహమూద్
ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య గురువారం డార్విన్‌లో తొలి టెస్టు మొదలైంది. మరారా స్టేడియంలో టాస్ గెలిచిన ఆసీస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. బంగ్లా పేసర్ హసన్ మహమూద్ దాటికి కంగారూల బ్యాటింగ్ ఆర్డర్ కుదేలైంది. ఈ రైటార్మ్ పేసర్ ఆరు వికెట్లతో చెలరేగి ఆసీస్ పతనాన్ని శాసించాడు.
198 పరుగులకే ఆలౌట్
ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్‌లో 53 ఓవర్లలో కేవలం 198 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్ అయింది. నాలుగో నంబర్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ అర్ధ శతకం (71) బాదడంతో ఈ మేర గౌరవప్రదమైన స్కోరు సాధ్యమైంది. అయితే, మ్యాచ్ మధ్యలో స్మిత్ వ్యవహరించిన తీరు ఓ అభిమానికి చిర్రెత్తించింది.
ఆటకు అంతరాయం
సెకండ్ సెషన్ వేళ సైట్ స్క్రీన్ (బ్యాటర్ ఎదురుగా ఉండే స్క్రీన్) సరిగ్గా లేదంటూ స్మిత్ పదే పదే ఆటకు అంతరాయం కలిగించాడు. స్క్రీన్‌ను సరిచేయాల్సిందిగా గ్రౌండ్ సహాయక సిబ్బందికి చెప్పాడు. ఈ క్రమంలో ఆట ఆలస్యమైంది.
ఓవరాక్షన్ చేయకు
ఈ నేపథ్యంలో ప్రేక్షకుల మధ్యలో ఉన్న ఓ అభిమాని.. ‘‘స్మడ్జ్ (స్మిత్ ముద్దుపేరు).. నువ్వు బంతిని బాదడంపై దృష్టి పెట్టు. ప్రత్యేకంగా ఏదో కావాలన్నట్లుగా ఓవరాక్షన్ చేయకు. నువ్వేమీ ఆట కంటే గొప్పోడికి కాదు స్టీవ్. ఆడి చూపించు’’ అని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఫాక్స్ క్రికెట్ సోషల్ మీడియాలో షేర్ చేయగా.. వైరల్‌గా మారింది.
చదవండి: ఆసీస్ గడ్డ మీద చరిత్ర సృష్టించిన బంగ్లా పేసర్


