source: X
డార్విన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్ తొలి రోజు పసికూన బంగ్లాదేశ్ పూర్తి ఆధిక్యత సాధించింది. తొలుత బౌలింగ్‌లో ఆసీస్‌ను 198 పరుగుల స్వల్ప స్కోర్‌కు కుప్పకూల్చి, ఆతర్వాత బ్యాటింగ్‌లోనూ సత్తా చాటింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి కేవలం వికెట్ మాత్రమే కోల్పోయి 96 పరుగులు చేసింది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు మరో 102 పరుగులు మాత్రమే వెనుకపడి ఉంది. మొత్తంగా తొలి రోజు బౌలింగ్‌లో, బ్యాటింగ్‌లో సత్తా చాటి పటిష్టమైన ఆస్ట్రేలియాను గడగడలాడించింది.
నిప్పులు చెరిగిన హసన్
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. బంగ్లా పేస్ త్రయం హసన్ మహమూద్ (6-55), తస్కిన్ అహ్మద్ (2-55), ఎబాదత్ హొసేన్ (2-39) ధాటికి 198 పరుగులకే ఆలౌటైంది. వీరిలో ముఖ్యంగా హసన్ మహమూద్ ఆకాశమే హద్దుగా చెలరేగి ఆసీస్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. అతడి ముందు ఏ ఒక్క ఆసీస్ బ్యాటర్ కూడా నిలబడలేకపోయాడు. ఆసీస్ తరఫున స్టీవ్ స్మిత్ (71) ఒంటరిపోరాటం చేశాడు.
ప్రభావం చూపని స్టార్ పేసర్లు
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్‌ను స్టార్క్ ఆదిలోనే దెబ్బకొట్టాడు. జట్టు స్కోర్ 36 పరుగుల వద్ద ఉండగా.. షద్మాన్ ఇస్లాంను (20) పెవిలియన్‌కు పంపాడు. అయితే ఆతర్వాత తంజిద్ హసన్ తమీమ్ (32 నాటౌట్), మొమినుల్ హక్ (35 నాటౌట్) ఆసీస్ స్టార్ పేసర్లను సమర్దవంతంగా ఎదుర్కొన్నారు. వీరి ముందు కమిన్స్, స్టార్క్, హాజిల్‌వుడ్ త్రయం తేలిపోయింది.
కాగా, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం బంగ్లాదేశ్ జట్టు 23 ఏళ్ల తర్వాత ఆసీస్ గడ్డపై కాలుమోపింది. ఈ సిరీస్‌లోని రెండో టెస్ట్ ఆగస్ట్ 22న మెక్‌కే వేదికగా ప్రారంభం కానుంది.


