మాదే పైచేయి: టీమిండియాకు శ్రీలంక కెప్టెన్‌ వార్నింగ్‌ | We Have Upper Hand: Sri Lanka Captain Warns Team India Ahead Galle Test | Sakshi
Sakshi News home page

మాదే పైచేయి: టీమిండియాకు శ్రీలంక కెప్టెన్‌ వార్నింగ్‌

Aug 13 2026 1:51 PM | Updated on Aug 13 2026 2:04 PM

We Have Upper Hand: Sri Lanka Captain Warns Team India Ahead Galle Test

ధనంజయ డి సిల్వ- శుబ్‌మన్‌ గిల్‌ PC: SLC/BCCI

టెస్టు సిరీస్‌ నేపథ్యంలో శ్రీలంక కెప్టెన్‌ ధనంజయ డి సిల్వ టీమిండియాకు హెచ్చరికలు జారీ చేశాడు. సాధారణంగా లంకలో స్పిన్నింగ్‌ వికెట్లు ఉంటాయని.. కానీ ఈసారి వర్షాల వల్ల పరిస్థితిలో కాస్త మార్పు ఉంటుందని పేర్కొన్నాడు. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ 2025-27 సీజన్‌లో భాగంగా భారత్‌- శ్రీలంక మధ్య రెండు టెస్టులకు షెడ్యూల్‌ ఖరారైంది.

పిచ్‌లు అంత పొడిగా ఉండవు
గాలె వేదికగా ఆగష్టు 15 నుంచి తొలి టెస్టు మొదలుకానున్న నేపథ్యంలో లంక సారథి ధనంజయ డి సిల్వ మీడియాతో మాట్లాడాడు. ‘‘సాధారణంగా శ్రీలంకలో టర్నింగ్‌ వికెట్లు ఉంటాయి. అయితే, ప్రస్తుతం వాతావరణం వేరుగా ఉంది. వర్షాలు పడుతున్నాయి కాబట్టి పిచ్‌లు అంత పొడిగా ఉండవు.

ఆట స్వరూపాన్నే మార్చివేయగలరు
ఇక మా బ్యాటింగ్‌ లైనప్‌ చాలా బలంగా ఉంది. పిచ్‌లు కాస్త అనుకూలంగా ఉన్నా.. ఆట మొదలైన 2-3 రోజులు ఉపయోగకరంగా ఉంటాయి. ఆతర్వాత పిచ్‌ టర్న్‌ కావడం మొదలవుతుంది. స్పిన్నర్లే మా ప్రధాన ఆయుధం అయినప్పటికీ.. మా జట్టులో కొంతమంది నైపుణ్యాలున్న సీమర్లు కూడా ఉన్నారు.

కివీస్‌, సౌతాఫ్రికా చేతిలో వైట్‌వాష్‌లు
ఆట స్వరూపాన్నే వారు మార్చివేయగలరు’’ అని ధనంజయ డి సిల్వ గిల్‌ సేనకు హెచ్చరికలు జారీ చేశాడు. అదే విధంగా.. ‘‘ఇండియాలోనూ టర్నింగ్‌ వికెట్లు ఉంటాయి. అయితే, స్వదేశంలో టీమిండియా న్యూజిలాండ్‌, సౌతాఫ్రికా జట్ల చేతుల్లో వైట్‌వాష్‌ అయింది.

మాదే పైచేయి.. అతడే మా బలం
ఈ సిరీస్‌లలో వాళ్లు విఫలమైనప్పటికీ పూర్తిగా టర్నింగ్‌ వికెట్ల మీద పట్టు కోల్పోయారని కాదు. తిరిగి పుంజుకునేందుకు వాళ్లు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, గణాంకాల పరంగా చూస్తే మాదే పైచేయి. ముఖ్యంగా ఇరుజట్లలోనూ గాలెలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్‌గా ప్రభాత్‌ జయసూర్య ఉన్నాడు.

అతడి అనుభవం మాకు తప్పక ఉపయోగపడుతుంది. శ్రీలంకలో పర్యటిస్తున్న జట్ల బ్యాటర్లపై చాలా ఏళ్లుగా అతడు ఆధిపత్యం కనబరుస్తున్నాడు. ఈ స్పిన్‌ బౌలర్‌ మా ప్రధానం బలం.

బుమ్రా లేకున్నా..
ఇక టీమిండియా తమ ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా సేవలు కోల్పోయింది. వారికి అది అతిపెద్ద లోటు. అయితే, మిగతా బౌలర్లను ఎదుర్కొనేందుకు కూడా మేము బాగా హోంవర్క్‌ చేసి.. పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యాము.

ఏదేమైనా అంతర్జాతీయ మ్యాచ్‌లలో ఆడటం అంత తేలిక కాదు. నాలుగు, ఐదో రోజు కూడా ఆట పూర్తిగా మారిపోతుంది. టీమిండియాను ఓడించడానికి గొప్ప అవకాశం మా ముందుంది. మేము ఇది సాధిస్తామనే నమ్మకం నాకు ఉంది’’ అని ధనంజయ డి సిల్వ పేర్కొన్నాడు. కాగా 2017 తర్వాత టీమిండియా తొలిసారి శ్రీలంక గడ్డ మీద టెస్టు సిరీస్‌ ఆడుతోంది. 

కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ సహా జట్టులోని మెజారిటీ మంది ఆటగాళ్లకు లంకలో టెస్టులు ఆడటం ఇదే తొలిసారి. ఇదిలా ఉంటే.. తొలి టెస్టుకు ముందు శ్రీలంక క్రికెట్‌ ఎలెవన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ గెలుపొందిన సంగతి తెలిసిందే. ఆరంభంలో పేసర్లు వికెట్లు తీసేందుకు ఇబ్బంది పడ్డా ఆ తర్వాత ప్రభావం చూపగలిగారు. కొలంబో వికెట్‌ పాతబడే కొద్ది బ్యాటర్లకు కాస్త అనుకూలించింది. 

చదవండి: ఆసీస్‌ గడ్డ మీద చరిత్ర సృష్టించిన బంగ్లా పేసర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement