వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025-27 సైకిల్‌లో టీమిండియా మరో కీలక పోరుకు సిద్దమైంది. శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని భారత జట్టు శ్రీలంకతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడనుంది.
ఇందులో భాగంగా తొలి మ్యాచ్ ఆగస్టు 15 నుంచి గాలే వేదికగా ప్రారంభం కానుంది. ఈ క్రమంలో శ్రీలంక క్రికెట్ బోర్డు పర్యాటక జట్టు హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్‌తో మైండ్ గేమ్స్ ఆడటం ప్రారంభించింది.
ఏమి జరిగిందంటే?
తొలి టెస్టు కోసం శ్రీలంక జట్టు గాలేలో గత రెండు రోజులగా క్లోజ్డ్ డోర్ ప్రాక్టీస్ సెషన్స్ నిర్వహిస్తోంది. అయితే బుధవారం లంక ప్రాక్టీస్ సెషన్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది.
భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్.. బ్యాటింగ్ కోచ్ సితాంషు కోటక్‌తో కలిసి సడన్‌గా గాలే మైదానంలోకి ఎంట్రీ ఇచ్చాడు. వీరిద్దరూ నేరుగా తొలి టెస్టు కోసం తాయారు చేసిన ప్రధాన పిచ్ వద్దకు పరిశీలించారు.
గంభీర్, కోటక్ అక్కడికి చేరుకోగానే గ్రౌండ్ సిబ్బంది పిచ్‌పై ఉన్న కవర్లను కొద్దిసేపు పక్కకు తొలగించారు. కాసేపు పిచ్‌ను పరిశీలించి వారిద్దరూ వెళ్లిపోయారు. ఆ సమయంలో పక్కనే ఉన్న నెట్స్‌లో శ్రీలంక ప్రాక్టీస్ చేస్తున్నారు.
అయితే గంభీర్-కోటక్ ద్వయం వెళ్లిపోయిన వెంటనే గాలే స్టేడియం సిబ్బంది పిచ్‌లో కొన్ని మార్పులు చేశారు. కవర్లను పూర్తిగా తొలగించి, గ్రాస్ మోవర్‌తో పిచ్‌పై ఉన్న పచ్చికను కట్ చేశారు. ఆ తర్వాత సాఫ్ట్ రోలర్‌ను ఉపయోగించి చదును చేశారు.
కాగా తుది జట్టును ఖరారు చేసేటప్పుడు పిచ్‌కు అధిక ప్రాధాన్యత ఉంటుంది. వికెట్ కండీషన్ బట్టి తుది జట్టును ఎంపిక చేస్తారు. కానీ ఇప్పుడు శ్రీలంక క్రికెట్ గంభీర్‌తో మైండ్ గేమ్స్ ఆడి కాస్త కన్ఫ్యూజ్ చేసింది. గంభీర్ అండ్ కో ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగాలా? ముగ్గురు స్పిన్నర్లతో వెళ్లాలా అన్న సందిగ్ధంలో పడినట్లు తెలుస్తోంది.
చదవండి: 30 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ క్రికెటర్


