source: X
డార్విన్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియాకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 198 పరుగులకే ఆలౌటైంది. బంగ్లాదేశ్ పేసర్ హసన్ మహమూద్ అద్భుత బౌలింగ్‌తో ఆస్ట్రేలియా బ్యాటింగ్ లైనప్‌ను కుప్పకూల్చాడు.
ఆట ప్రారంభం నుంచే అనుకూలంగా ఉన్న పరిస్థితులను బంగ్లాదేశ్ పేసర్లు పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు. ఆస్ట్రేలియా ఒక దశలో వికెట్ నష్టపోకుండా 45 పరుగులు చేసినప్పటికీ.. ఆ తర్వాత వరుస వికెట్లు కోల్పోయింది.
హసన్ మహమూద్ ఆస్ట్రేలియా బ్యాటర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. 55 పరుగులు ఇచ్చి ఏకంగా 6 వికెట్లు పడగొట్టి కెరీర్‌లో గుర్తుండిపోయే స్పెల్ నమోదు చేశాడు. అతడి బౌలింగ్‌కు తోడు మిగతా బంగ్లా పేసర్లు కూడా క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో ఆస్ట్రేలియా భారీ స్కోరు సాధించలేకపోయింది. తస్కిన్ అహ్మద్ (16-2-55-2), ఎబాదత్ హొసేన్ (11-2-39-2) కూడా ఆసీస్ పతనంలో తమవంతు పాత్ర పోషించారు.
స్టీవ్ స్మిత్ ఒంటరిపోరాటం
ఓ పక్క క్రమం తప్పకుండా వికెట్లు పడుతున్నా స్టీవ్ స్మిత్ ఒంటరిపోరాటం చేశాడు. 109 బంతుల్లో 71 పరుగులు చేసి తొమ్మిదో వికెట్‌గా వెనుదిరిగాడు. అతడికి జతగా ఒక్క బ్యాటర్ కూడా క్రీజ్‌లో నిలువలేకపోయాడు. మొత్తం ఆసీస్ ఇన్నింగ్స్‌లో స్టీవ్‌తో పాటు ట్రవిస్ హెడ్ (22), జేక్ వెదరాల్డ్ (23) మాత్రమే 20కి పైగా స్కోర్లు చేశారు.
మిగతా బ్యాటర్లలో గ్రీన్ (13), అలెక్స్ క్యారీ (19), వెబ్‌స్టర్ (12) రెండంకెల స్కోర్లు చేయగా.. లబూషేన్ (1), కమిన్స్ (9), స్టార్క్ (1), లియోన్ (7) సింగిల్ డిజిట్ స్కోర్లకు పరిమితమయ్యారు. 4 పరుగులతో హాజిల్‌వుడ్ అజేయంగా నిలిచాడు.
కాగా, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం బంగ్లాదేశ్ జట్టు 23 ఏళ్ల తర్వాత ఆసీస్ గడ్డపై కాలుమోపింది. ఈ సిరీస్‌లోని రెండో టెస్ట్ ఆగస్ట్ 22న మెక్‌కే వేదికగా ప్రారంభం కానుంది.


