నేటి నుంచి తొలి టెస్టు
ఉదయం 6 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం
డార్విన్: వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ లక్ష్యంగా ఆ్రస్టేలియా తమ కొత్త సీజన్‌కు సిద్ధమైంది. 2025–27 డబ్ల్యూటీసీలో ఆసీస్ మరో 14 టెస్టులు ఆడాల్సి ఉంది. వీటిలో 5 టెస్టులు భారత గడ్డపై ఉన్నాయి. కాబట్టి దానికి ముందే మిగిలిన 9 టెస్టుల్లో సత్తా చాటి ఫైనల్ బెర్త్‌ను దాదాపుగా ఖాయం చేసుకోవాలని కంగారూలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బలహీన బంగ్లాదేశ్‌తో సొంతగడ్డపై రెండు టెస్టుల సిరీస్‌లో జట్టు తలపడుతుంది. డార్విన్ వేదికగా నేటి నుంచి తొలి టెస్టు జరుగుతుంది.
ఇక్కడి మరారా స్టేడియం 22 ఏళ్ల తర్వాత టెస్టు మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తోంది. ఆసీస్ గడ్డపై బంగ్లాదేశ్ టెస్టులు ఆడటం కూడా 2003 తర్వాత ఇదే తొలిసారి. 23 ఏళ్ల క్రితం జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను ఆసీస్ 2–0తో గెలుచుకుంది. అనంతరం బంగ్లాదేశ్‌లో 4 టెస్టులు ఆడిన ఆ్రస్టేలియా 3 గెలిచి, ఒకదాంట్లో ఓడింది. దాంతో ఓవరాల్‌గా ఆసీస్ 5–1తో పైచేయిగా ఉంది. 2017 తర్వాత ఇరు జట్లు టెస్టులో తలపడనుండటం ఇదే తొలిసారి. 2020లో సిరీస్ జరగాల్సి ఉన్నా...కోవిడ్ కారణంగా రద్దయింది.
బలాబలాలను చూస్తే బంగ్లాదేశ్‌కంటే ఆ్రస్టేలియా టెస్టు జట్టు ఎన్నో విధాలుగా పటిష్టంగా ఉంది. దాదాపు ఏడాది తర్వాత ప్రఖ్యాత బౌలింగ్ ‘చతుష్టయం’ స్టార్క్, కమిన్స్, హాజల్‌వుడ్, లయన్ కలిసి ఒకే మ్యాచ్‌లో మళ్లీ బరిలోకి దిగనున్నారు. బ్యాటింగ్‌లో ట్రావిస్ హెడ్, లబుషేన్, స్టీవ్ స్మిత్, అలెక్స్ కేరీలతో పాటు ఆల్‌రౌండర్లు కామెరాన్ గ్రీన్, వెబ్‌స్టర్‌లు ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పగలరు. భవిష్యత్తులోనూ ఆసీస్ రెగ్యులర్ ఓపెనర్‌గా తన స్థానం పటిష్టపర్చుకునేందుకు ప్రయత్నిస్తున్న జేక్ వెదరాల్డ్‌కు మాత్రం ఈ సిరీస్ కీలకం కానుంది. మరోవైపు ప్రత్యర్థికి బంగ్లాదేశ్ ఏమాత్రం పోటీనివ్వగలదనేది ఆసక్తికరం.
ప్రాక్టీస్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ జట్టు 54 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ బౌలింగ్ దళాన్ని సమర్థంగా ఎదుర్కోవాల్సిన బాధ్యత ప్రధానంగా కెప్టెన్ నజు్మల్, సీనియర్లు ముష్పికర్, మోమినుల్, లిటన్ దాస్‌లపై ఉంది. గాయంతో పేసర్ నాహిద్ రాణా టెస్టుకు దూరం కావడం బంగ్లాకు పెద్ద దెబ్బ కాగా... పేసర్లు తస్కీన్, హసన్ మహమూద్, సీనియర్ స్పిన్నర్ మెహదీ హసన్ మిరాజ్‌లు కీలకం కానున్నారు. మరో 5 వికెట్లు తీసి హాజల్‌వుడ్ 300 వికెట్ల మైలురాయిని అందుకోనుండగా... మరో 7 వికెట్లు తీస్తే 440 వికెట్లతో స్టార్క్ ఓవరాల్‌గా అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో టాప్–10లో చేరతాడు.


