ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ ఆష్లే గార్డ్‌నర్ ఎట్టకేలకు మౌనం వీడింది. వివాహేతర సంబంధం గురించి తనపై వస్తున్న ఆరోపణలపై స్పందించింది. తన భార్య మోనికా రైట్ నుంచి విడిపోవడం పూర్తిగా వ్యక్తిగత విషయమని స్పష్టం చేసింది.
2025లో పెళ్లి
అయితే, ఆరోపణల సమయంలోనూ తనకు మద్దతుగా నిలిచినందుకు క్రికెట్ ఆస్ట్రేలియాకు ఆష్లే గార్డ్‌నర్ ధన్యవాదాలు తెలిపింది. కాగా డేటింగ్ యాప్ ద్వారా పరిచయమై.. ప్రేమలో పడ్డ తర్వాత ఆష్లే- మోనికా 2025 ఏప్రిల్‌లో పెళ్లి చేసుకున్నారు. అయితే, వివాహం జరిగిన కొన్ని నెలల వ్యవధిలోనే వీరి మధ్య విభేదాలు తలెత్తాయి.
ఆమెతో వివాహేతర సంబంధం
ఈ నేపథ్యంలో సహచర క్రికెటర్, ఆసీస్ ఓపెనర్ జార్జియా వోల్‌తో ఆష్లేకు వివాహేతర సంబంధం ఉందంటూ మోనికా రైట్ తీవ్రమైన ఆరోపణలు చేసింది. వైస్ కెప్టెన్ స్థాయిలో ఉన్న క్రికెటర్ ఇలాంటి తప్పిదాలకు పాల్పడినా క్రికెట్ ఆస్ట్రేలియా స్పందించడం లేదని ఆరోపించింది. ఆమెను వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది.
గోప్యతను గౌరవిస్తాం
ఈ క్రమంలో క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటన విడుదల చేసింది. వ్యక్తిగత విషయాల గురించి తాము పట్టించుకోమని.. వర్క్ పాలసీకి అనుగుణంగా పనిచేసే వారిపై చర్యలు తీసుకోమని స్పష్టం చేసింది. ప్రతీ క్రికెటర్ గోప్యతను గౌరవిస్తామని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆష్లే గార్డ్‌నర్ తాజాగా ఇన్‌స్టా వేదికగా స్పందించింది.
ఆష్లే స్పందన ఇదే
‘‘నా భార్య నుంచి విడిపోవడం పూర్తిగా వ్యక్తిగత విషయం. నేను క్రికెట్ ఆస్ట్రేలియా తరఫు వైస్ కెప్టెన్ అనే గొప్ప స్థానంలో ఉన్నాను. కాబట్టి నా ప్రస్తుత రిలేషన్‌షిప్ గురించి తప్పక స్పందించాల్సిందే.
ఇలాంటి సమయంలోనూ నాకు అండగా నిలుస్తూ.. నాయకత్వ బృందంలో కొనసాగిస్తున్నందుకు బోర్డుకు ధన్యవాదాలు. లీడర్‌గా నా అత్యుత్తమ ప్రదర్శన ఇస్తాను. ఏదేమైనా మోనికాతో ఉన్న క్షణాలు మర్చిపోను. ఆమెకు బాధ కలిగినందుకు చింతిస్తున్నాను.
మోనికా సంతోషంగా ఉండాలి
మోనికా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. ఆమె భవిష్యత్తు బాగుండాలి. ఇక ఈ విషయంపై బహిరంగంగా స్పందించను. ఈ వివాదంలో భాగమైన వారి గోప్యతను గౌరవించాల్సి ఉంటుంది’’ అని ఆష్టే గార్డ్‌నర్ స్పష్టం చేసింది.
చదవండి: ఓవరాక్షన్ వద్దు.. ఆట కంటే గొప్పోడివా?: స్టీవ్ స్మిత్‌పై ఫైర్


