సెప్టెంబర్‌లో భారత్-అఫ్గానిస్తాన్ మధ్య మధ్య జరగాల్సిన మూడు టీ20ల సిరీస్‌లో మార్పులు చోటు చేసుకునే అవకాశముంది. ఇటీవల ఖరారైన షెడ్యూల్ ప్రకారం.. ఈ మూడు మ్యాచ్‌లు వచ్చే నెల 13, 15, 17 తేదీల్లో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగాల్సి ఉంది. అయితే ఈ షెడ్యూల్‌లో స్వల్ప మార్పు చేయాలని బీసీసీఐని అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు అభ్యర్దించినట్లు తెలుస్తోంది.
సెప్టెంబర్ 14న గణేష్ చతుర్థి పండగను పురస్కరించుకుని, ఆ రోజున ఒక టీ20 మ్యాచ్ నిర్వహించాలని ఏసీబీ కోరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ రోజు పండగ సెలవు దినం కావడంతో మ్యాచ్‌ను వీక్షించడానికి స్టేడియానికి ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో వస్తారని అఫ్గాన్ క్రికెట్ బోర్డు ఆశిస్తోంది.
ఈ ప్రతిపాదనకు భారత క్రికెట్ బోర్డు అంగీకరిస్తే.. సెప్టెంబర్ 13 లేదా 15న జరగాల్సిన మ్యాచ్‌లలో ఒకదానిని సెప్టెంబర్ 14కి మార్చనుంది. కాగా ఐసీసీ ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్ (FTP) ప్రకారం ఇది అఫ్గానిస్తాన్‌కు హోమ్ సిరీస్ కావడం విశేషం.
గతంలో అఫ్గాన్ జట్టు తన హోమ్ మ్యాచ్‌లను భారత్‌లో ఆడినప్పటికి, టీమిండియాతో హోమ్ సిరీస్ ఆడడం మాత్రం ఇదే తొలిసారి. ఈ చారిత్రత్మక సిరీస్ ప్రసార హక్కులకు సంబంధించి అఫ్గాన్ క్రికెట్ బోర్డు ఇప్పటికే చర్చలు ప్రారంభించింది. సోనీ స్పోర్ట్స్, స్టార్ స్పోర్ట్స్ వంటి ప్రముఖ ఛానళ్లతో ఏసీబీ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
చదవండి: AFG vs IRE: అఫ్గానిస్తాన్ ఓపెనర్ వరల్డ్ రికార్డ్


