2024 టి20 వరల్డ్ కప్ ఫైనల్‌పై భారత ఫీల్డింగ్ మాజీ కోచ్ దిలీప్
న్యూఢిల్లీ: రోహిత్ శర్మ నాయకత్వంలో భారత జట్టు 2024 టి20 వరల్డ్ కప్ గెలుచుకుంది. ఫైనల్ పోరులో బౌండరీ వద్ద సూర్యకుమార్ యాదవ్ పట్టిన క్యాచ్ అన్నింటికంటే హైలైట్‌గా నిలిచింది. జట్టు విజయంలో కీలకమైన ఈ ఉత్కంఠభరిత క్షణాన్ని అభిమానులెవరూ మర్చిపోలేరు. మరి అలాంటి సమయంలో భారత ఫీల్డింగ్ కోచ్‌గా ఉన్న టి.దిలీప్ పరిస్థితి ఎలా ఉండి ఉంటుంది. అతను ఆ సమయంలో ఎలా ఆలోచిస్తూ ఉంటాడు. ఈ విషయంలో తన మానసిక స్థితిని దిలీప్ గుర్తు చేసుకున్నాడు. తాను భారత జట్టుతో పని చేసిన దాదాపు ఐదేళ్ల వ్యవధిలో అదే అన్నింటికంటే గొప్ప ఘట్టమని అతను చెప్పాడు.
‘దాదాపు ఐదేళ్ల పాటు భారత జట్టుకు ఫీల్డింగ్ కోచ్‌గా పని చేశాను. వీటిలో 2024లో టి20 వరల్డ్ కప్ విజయం అత్యుత్తమ క్షణంగా భావిస్తా. ట్రోఫీ గెలవడం మాత్రమే కాదు. గెలుపు తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో వాతావరణాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. ప్లేయర్లు ఆ విజయం కోసం ఎంత కష్టపడ్డారో నాకు బాగా తెలుసు. ఇక మిల్లర్ క్యాచ్‌ను సూర్యకుమార్ అందుకున్న తీరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందే. బంతి గాల్లోకి లేచిన క్షణాన నా మనసులో ఎన్నో ఆలోచనలు వచ్చాయి.
సూర్య క్యాచ్ పడతాడా లేదా... కాలు బౌండరీ లోపల ఉంటుందా, బంతిని సరైన సమయంలోకి లోపలికి విసిరేసాడా అని దగ్గరి నుంచి చూస్తూ నా గుండె అమిత వేగంతో కొట్టుకుంది. చివరకు అది సరైందని తేలగానే నాలో భావోద్వేగాలు ఒక్కసారిగా బయటకు వచ్చాయి. ఆ క్యాచ్ నాకు చిరస్మరణీయం’ అని హైదరాబాద్‌కు చెందిన దిలీప్ అన్నాడు. మంచి ఫీల్డింగ్‌కు మెడల్ ఇవ్వాలంటూ తాను తీసుకొచ్చిన కొత్త పద్ధతి వల్ల సహచరుల్లో ఫీల్డింగ్ విషయంలో కూడా పోటీతత్వం పెరిగిందని అతను పేర్కొన్నాడు. ఇక భారత జట్టులో ఫీల్డింగ్ విషయంలో కూడా విరాట్ కోహ్లి గొప్పతనం గురించి దిలీప్ వెల్లడించాడు. కోహ్లి మైదానంలో చూపించే ఉత్సాహంతో మరో ఐదుగురు ఆటగాళ్లపై అదే తరహాలో ప్రభావం పడుతుందని, వారంతా తమ అత్యుత్తమ ప్రదర్శన ఇస్తారని దిలీల్ అభిప్రాయపడ్డాడు.
‘కోహ్లి మైదానంలో చూపించే తీవ్రత ఎవరి వల్లా సాధ్యం కాదు. బ్యాటర్‌గా అతని గురించి అందరికీ తెలుసు. కానీ మైదానంలో డైవ్ చేస్తూ చురుకైన కదలికలు ప్రదర్శించడంలో అతనికి అతనే సాటి. ఇటీవలి సిరీస్‌లో కూడా అతను ఇదే తరహాలో డైవ్‌లు చేస్తూ బంతులు ఆపాడంటే అతని అంకితభావం ఏమిటో తెలుస్తుంది. కెరీర్‌లో ఈ దశలో కూడా డెత్ ఓవర్లలో లాంగాన్ నుంచి మరో వైపు లాంగాన్‌కు వెళ్లడం, సర్కిల్ బయట ఫీల్డింగ్ చేసేందుకు ఉత్సాహం చూపించడం నిజంగా మెచ్చుకోదగ్గ అంశం. అతని ఫీల్డింగ్ ప్రభావం సహచరులపై కూడా కనిపిస్తుంది. కోహ్లిని చూసి మరో ఐదుగురు అంతే ఉత్సాహంతో ఫీల్డింగ్ చేస్తారు’ అని దిలీప్ విశ్లేషించాడు.


