ఇంగ్లండ్‌ క్రికెట్‌ జట్టుపై ఆంక్షలు ఎత్తివేత | England cricket team ban lifted | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్‌ క్రికెట్‌ జట్టుపై ఆంక్షలు ఎత్తివేత

Aug 14 2026 1:11 AM | Updated on Aug 14 2026 1:11 AM

England cricket team ban lifted

అర్ధరాత్రి వేళల్లో బయటకు వెళ్లేందుకు అనుమతి

కొత్త కెప్టెన్‌ జో రూట్‌ నిర్ణయం

లండన్‌: ఇంగ్లండ్‌ పురుషుల క్రికెట్‌ జట్టుపై విధించిన అర్ధరాత్రి కర్ఫ్యూను కొత్త సారథి జో రూట్‌ ఎత్తివేశాడు. దీనివల్ల పెద్దగా ఫలితం ఉండదనే ఉద్దేశంతో రూట్‌ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇటీవలి కాలంలో ఇంగ్లండ్‌ క్రికెటర్లు మ్యాచ్‌ల సమయాల్లో తప్పతాగి వార్తల్లోకి ఎక్కుతుండటంతో... ఇంగ్లండ్‌ క్రికెట్‌ జట్టు మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాబ్‌ కీ ఈ ఆంక్షలు విధించారు. న్యూజిలాండ్‌తో సిరీస్‌ సందర్భంగా ఆ జట్టు మాజీ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ కర్ఫ్యూ సమయం దాటి నైట్‌ క్లబ్‌లో గడపడం వల్ల ఒక మ్యాచ్‌ సస్పెన్షన్‌కు గురయ్యాడు. 

ఆ తర్వాత స్టోక్స్‌ రిటైర్మెంట్‌ ప్రకటించగా... అతడి స్థానంలో తిరిగి స్టార్‌ బ్యాటర్‌ జో రూట్‌ మరోసారి జట్టు పగ్గాలు అందుకున్నాడు. అతడి కెప్టెన్సీలో ఇంగ్లండ్‌ జట్టు పాకిస్తాన్‌తో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో రూట్‌ మాట్లాడుతూ... ‘ఇకపై ఆటగాళ్లపై ఎలాంటి కర్ఫ్యూ ఉండదు. నిజంగా చెప్పాలంటే దీన్ని పెద్ద విషయంగా భావించాల్సిన అవసరమే లేదు. మైదానంలో ప్లేయర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలంటే... మైదానం బయట కూడా పరిణతి చెందని వ్యక్తులుగా సరైన నిర్ణయాలు తీసుకోగలమనే భావన వారికి కలగాలి. అంతే కానీ ఇలాంటి కర్ఫ్యూలతో ఫలితం ఉండదు. 

జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్లేయర్‌గా స్వీయ నియంత్రణ పాటించడం ప్రతీ ఒక్కరి బాధ్యత. ఈ అంశంపై కోచ్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్, నేను ఏకాభిప్రాయంతో ఉన్నాం. ఇంగ్లండ్‌ తరఫున ఆడుతున్నప్పుడు ఎలా వ్యవహరించాలో ప్లేయర్లకు తెలుసు. మైదానం బయట ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా చూసుకోవాలి. విజయాలను ఆస్వాదించడం తప్పనిసరి. అయితే దానికి అనువైన సమయం అంటూఉంటుందని గుర్తించాలి’ అని రూట్‌ చెప్పాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement