బంగ్లాదేశ్ స్టార్ ప్లేయర్ మోమినుల్ హక్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బంగ్లాదేశ్ బ్యాటర్ల జాబితాలో మోమినుల్ దిగ్గజ ప్లేయర్ తమీమ్ ఇక్బాల్‌ను దాటి రెండో స్థానానికి చేరుకున్నాడు. డార్విన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో అతడు ఈ ఫీట్ సాధించాడు.
మోమినుల్ ఇప్పటివరకు 79 టెస్టుల్లో 5,166 పరుగులు చేశాడు. ప్రస్తుత బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చైర్మెన్‌గా ఉన్న తమీమ్ 70 టెస్టుల్లో 5,134 పరుగులు చేశాడు. ఈ జాబితాలో అగ్రస్ధానంలో వెటరన్ వికెట్ కీపర్ బ్యాటర్ ముష్ఫికర్ రహీమ్ (6,808 పరుగులు) అగ్రస్ధానంలో ఉన్నాడు.
మోమినుల్ ఇదే జోరును కొనసాగిస్తే రహీమ్‌ను అధిగమించే అవకాశముంది. అతడి టెస్ట్ కెరీర్‌లో ఇప్పటివరకు 13 సెంచరీలు ఉన్నాయి. తమీమ్, ముష్ఫికర్ తర్వాత బంగ్లాదేశ్ తరఫున 10కి పైగా టెస్టు సెంచరీలు సాధించిన మూడో బ్యాటర్ హక్‌నే కావడం గమనార్హం.
బంగ్లా తరపున అత్యధిక టెస్ట్ పరుగులు చేసిన ప్లేయర్లు వీరే
ముష్ఫికర్ రహీమ్ – 6,808 పరుగులు
మోమినుల్ హక్ – 5,166 పరుగులు
తమీమ్ ఇక్బాల్ – 5,134 పరుగులు
నజ్ముల్ హుస్సేన్ శాంటో – 2,579 పరుగులు
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి రోజు ఆటలో ఆసీస్‌కు బంగ్లాదేశ్ చుక్కలు చూపించింది. బంగ్లా బౌలర్ల ధాటికి కంగారులు తమ తొలి ఇన్నింగ్స్‌లో 198 పరుగులకే ఆలౌటైంది. బంగ్లా పేసర్ హసన్ మహమూద్ 6 వికెట్ల పడగొట్టి ఆసీస్ పతనాన్ని శాసించాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన బంగ్లాకు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది.
ఓపెనర్ షాద్మాన్ ఇస్లామ్ (20) త్వరగా ఔటైనప్పటికి.. క్రీజులోకి వచ్చిన మోమినుల్ హక్, ఓపెనర్ తాంజిద్ హసన్ తమీమ్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లా వికెట్ నష్టానికి 96 పరుగులు చేసింది.


