పిలుపు ఊహించాం | Aaqib Nabi and Saransh Jain on first time spot in Indian team | Sakshi
Sakshi News home page

పిలుపు ఊహించాం

Aug 14 2026 1:37 AM | Updated on Aug 14 2026 1:39 AM

Aaqib Nabi and Saransh Jain on first time spot in Indian team

సారాంశ్‌ జైన్‌ , ఆకిబ్‌ నబీ

శ్రమకు ప్రతిఫలం దక్కిందన్న జమ్మూకశ్మీర్‌ పేసర్‌ ఆకిబ్‌ నబీ

సహనమే ఈ స్థాయికి చేర్చిందన్న సారాంశ్‌ జైన్‌ 

భారత జట్టులో తొలిసారి చోటుపై మనోగతం  

గాలె:  నిలకడైన ప్రదర్శన కొనసాగిస్తే ఏదో ఒక రోజు భారత జట్టు నుంచి పిలుపు వస్తుందని ఆశించినట్లు... జమ్మూకశ్మీర్‌ పేసర్‌ ఆకిబ్‌ నబీ పేర్కొన్నాడు. దేశవాళీల్లో దుమ్మురేపిన ఆకిబ్‌ గత రెండు రంజీ సీజన్‌లలో ఏకంగా 104 వికెట్లు పడగొట్టాడు. 2025–26 సీజన్‌లో జమ్మూకశ్మీర్‌ జట్టు తొలిసారి రంజీ ట్రోఫీ టైటిల్‌ నెగ్గడంలో నబీ కీలకపాత్ర పోషించాడు. అతడి నిలకడైన పేస్‌ బౌలింగ్‌ వల్లే ఆ జట్టు సుదీర్ఘ చరిత్ర గల టోర్నమెంట్‌లో మొదటిసారి చాంపియన్‌గా అవతరించింది. దీంతో చాన్నాళ్లుగా అతడికి భారత జట్టులో చోటు దక్కుతుందని భావించగా... తాజాగా శ్రీలంకతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు అతడు ఎంపికయ్యాడు. 

ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా గాయం కారణంగా ఈ సిరీస్‌కు దూరం కావడంతో అతడి స్థానంలో ఆకిబ్‌కు జట్టులో చోటు దక్కింది. ఈ నేపథ్యంలో అతడు మాట్లాడుతూ... ‘దేశవాళీల్లో నిలకడగా రాణించడంతో ఏదో ఒక రోజు టీమిండియాకు ఎంపికవుతానని బలంగా విశ్వసించాను. నా కష్టానికి ప్రతిఫలం దక్కుతుందని నమ్మకంగా ఉన్నా. మొత్తానికి ఆ అవకాశం ఇప్పుడు వచ్చింది. సరైన స్థానంలో బంతులు వేస్తూ వికెట్లు పడగొట్టడమే నా కర్తవ్యం. జట్టు ఎంపిక అనేది నా చేతుల్లో లేని పని. తొలిసారి భారత జట్టుకు ఎంపికైనట్లు తెలియగానే చాలా సంతోషించా. కుటుంబ సభ్యులు ఎంతో గర్వించారు. దీని కన్నా గొప్పది మరొకటి ఉండదు’ అని బీసీసీఐ విడుదల చేసిన వీడియోలో ఆకిబ్‌ పేర్కొన్నాడు. 

శ్రీలంకతో పర్యటనకు తొలుత ఎంపిక చేసిన భారత జట్టులో నబీకి చోటు దక్కలేదు. దీంతో అతడు బెంగళూరులోని బీసీసీఐ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌లో ప్రత్యేక శిబిరానికి హాజరయ్యేందుకు వెళ్తున్న సమయంలో ఆకిబ్‌కు టీమ్‌ మేనేజ్‌మెంట్‌ నుంచి ఈ సమాచారం అందింది. ‘బెంగళూరు వెళ్లేందుకు ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న సమయంలో నాకు ఫోన్‌ వచ్చింది. ఎక్కడున్నావు అని అడిగారు... ప్రాక్టీస్‌ కోసం బెంగళూరు వెళ్తున్నానని సమాధానమిచ్చా... ఆ అవసరం లేదు నేరుగా శ్రీలంకకు వచ్చేయ్‌. నువ్వు భారత జట్టుకు ఎంపికయ్యావు’ అని చెప్పారు. దీంతో మొదట నమ్మలేకపోయా. కానీ బుమ్రా స్థానంలో తీసుకున్నారని ఆ తర్వాత తెలిసిందని నబీ వివరించాడు.

సుదీర్ఘ నిరీక్షణకు ఫలితం 
మరోవైపు 33 ఏళ్ల వయసులో టీమిండియాకు ఎంపికైన స్పిన్‌ ఆల్‌రౌండర్‌ సారాంశ్‌ జైన్‌ కూడా తన ప్రదర్శనకు దక్కిన ఫలితమిదని పేర్కొన్నాడు. 2021–22 సీజన్‌లో రంజీ ట్రోఫీ గెలిచిన మధ్యప్రదేశ్‌ జట్టులో సభ్యుడైన సారాంశ్‌... దశాబ్దానికి పైగా దేశవాళీల్లో రాణిస్తున్నాడు. స్పిన్‌ ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ గాయంతో శ్రీలంకతో తొలి టెస్టుకు దూరం కాగా... అతడి స్థానంలో సారాంశ్‌ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ‘టెస్టు క్రికెట్‌ ఆడాలంటే ఓపిక కావాలి. అందులోనూ భారత టెస్టు జట్టులో చోటు దక్కించుకోవాలంటే అది మరింత ఎక్కువ ఉండాలి. 

నేను 2014–15 సీజన్‌లో రంజీ ట్రోపీలో అరంగేట్రం చేశాను. ఎన్నో త్యాగాలు, మరెంతో శ్రమతో ఇన్నాళ్లుగా ఆటలో కొనసాగుతున్నా. ఏదో ఒక రోజు జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తాననే నమ్మకం మాత్రం కోల్పోలేదు. మా నాన్న కూడా రంజీ ఆటగాడే. ఓపికతో ఎదురుచూస్తే తప్పక అవకాశం వస్తుందని చెప్పారు. అదే నిజమైంది. గుడికి వెళ్తున్న సమయంలో భారత జట్టుకు ఎంపికయ్యాననే వార్త తెలిసి చాలా సంతోషించా’ అని సారాంశ్‌ చెప్పాడు. ప్రస్తుతం భారత జట్టులోని ఆటగాళ్లతో గతంలో దేశవాళీ మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉండటంతో అందరితో త్వరగానే కలిసిపోయానని సారాంశ్‌ వెల్లడించాడు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement