పతకంతో తిరిగొస్తాం! | Hockey World Cup from tomorrow | Sakshi
Sakshi News home page

పతకంతో తిరిగొస్తాం!

Aug 14 2026 1:24 AM | Updated on Aug 14 2026 1:24 AM

Hockey World Cup from tomorrow

భారత జట్టు గోల్‌కీపర్‌ సవిత ధీమా

రేపటి నుంచి హాకీ ప్రపంచకప్‌  

భారత పురుషుల హాకీ జట్టుతో పోలిస్తే ప్రపంచకప్‌లో భారత మహిళల హాకీ జట్టుకు ఘనమైన రికార్డు లేదు. ఇప్పటి వరకు జరిగిన 15 ప్రపంచకప్‌లలో భారత పురుషుల జట్టు బరిలోకి దిగగా... భారత మహిళల జట్టు మాత్రం ఎనిమిదిసార్లు మాత్రమే పోటీపడింది. ఆ ఎనిమిది పర్యాయాల్లో ఒక్కసారి మాత్రమే సెమీఫైనల్‌ దశకు చేరుకుంది. ఏడుసార్లు ఈ మెగా ఈవెంట్‌కు అర్హత కూడా సాధించలేదు. ఈ నేపథ్యంలో గత ప్రదర్శనతో సంబంధం లేకుండా ఈసారి భారత మహిళల జట్టుకు పతకంతో తిరిగి వచ్చే సత్తా ఉందని టీమిండియా సీనియర్‌ గోల్‌కీపర్, మాజీ కెప్టెన్‌ సవితా పూనియా ధీమా వ్యక్తం చేసింది.

‘ఇటీవల నేషన్స్‌ కప్‌ టైటిల్‌ సాధించాం. ఆ టోర్నీలో మేటి జట్లు పాల్గొన్నాయి. చాలా రోజుల తర్వాత విదేశీగడ్డపై భారత మహిళల జట్టు విజేతగా నిలిచింది. ఈ విజయం స్ఫూర్తితో ప్రపంచకప్‌లోనూ మెరుగైన ప్రదర్శన చేస్తాం’ అని 36 ఏళ్ల సవిత వ్యాఖ్యానించింది. ‘అంతర్జాతీయ హాకీ సమాఖ్య ప్రొ లీగ్‌లో అర్జెంటీనా, నెదర్లాండ్స్, జర్మనీ లాంటి పటిష్ట జట్లకు మేము గట్టిపోటీనిచ్చాం. ఈ లీగ్‌లో కనబరిచిన ప్రదర్శనతో మేము అత్యున్నతస్థాయిలో మేటి జట్లకు దీటుగా రాణించగలమని నిరూపించాం. ఫిట్‌నెస్‌పరంగా, ఆలోచనపరంగా ప్రస్తుత జట్టు భేషుగ్గా ఉంది’ అని సవిత వివరించింది. 

వరుసగా మూడు సీజన్‌లపాటు (2021–22, 2022–23, 2023–24) అంతర్జాతీయ ఉత్తమ గోల్‌కీపర్‌గా ఎంపికైన సవిత భారత జట్టుకు 313 మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం వహించింది. ‘గతంతో పోలిస్తే ఇప్పుడు క్రీడాకారిణుల దృక్పథం మారింది. ఒకప్పుడు కోచ్‌ చెప్పిందే చేసేవారు. ప్రస్తుతం అందరూ మరింత బాధ్యత తీసుకుంటున్నారు. ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటున్నారు. గాయాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అదనంగా ప్రాక్టీస్‌ చేస్తున్నారు. వరుసగా మూడో ప్రపంచకప్‌ ఆడనుండటం నాకెంతో గర్వకారణం. 

ప్రతి హాకీ ప్లేయర్‌ కెరీర్‌లో ప్రపంచకప్, ఒలింపిక్స్‌కు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అంతర్జాతీయ అత్యుత్తమ టోర్నీల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించాలని అందరూ కలలు కంటారు. ఈసారి మరింత అనుభవంతో ప్రపంచకప్‌లో ఆడుతున్నాను. ఒత్తిడిలో తడబడకుండా నిలకడగా రాణించి భారత జట్టు అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు కృషి చేస్తా’ అని సవిత వ్యాఖ్యానించింది.  

సవితాతోపాటు నిక్కీ ప్రధాన్, లాల్‌రెమ్‌సియామి, నవ్‌నీత్‌ కౌర్, నేహా వరుసగా మూడో ప్రపంచకప్‌ ఆడనున్నారు. సలీమా టెటె సారథ్యంలో నేషన్స్‌ కప్‌ టైటిల్‌ గెలిచిన భారత జట్టు అదే జోరును ప్రపంచకప్‌లో పునరావృతం చేయాల్సిన అవసరం ఉంది. శనివారం ప్రపంచకప్‌ మొదలుకానుండగా... భారత మహిళల జట్టు తమ తొలి మ్యాచ్‌ను ఆగస్టు 16న చైనాతో ఆడుతుంది. అనంతరం 18న దక్షిణాఫ్రికాతో, 20న ఇంగ్లండ్‌తో భారత్‌ పోటీపడుతుంది. రెండో దశకు అర్హత సాధించాలంటే భారత్‌ తమ గ్రూప్‌ ‘డి’లో టాప్‌–2లో నిలవాలి. రెండో దశకు చేరుకున్నాకే భారత జట్టు పతకం రేసులోకి వస్తుంది.

8 భారత మహిళల జట్టు ఆడిన ప్రపంచకప్‌లు (1974, 1978, 1983, 1998, 2006, 2010, 2018, 2022). ఈ మెగా ఈవెంట్‌లో టీమిండియా మొత్తం 50 మ్యాచ్‌లు ఆడింది. 11 మ్యాచ్‌ల్లో గెలిచింది. 9 మ్యాచ్‌లను ‘డ్రా’ చేసుకుంది. 30 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. 62 గోల్స్‌ సాధించి, ప్రత్యర్థి జట్లకు 98 గోల్స్‌ సమర్పించుకుంది.  

4 ఇప్పటి వరకు ఆసియా నుంచి నాలుగు దేశాలు (భారత్, చైనా, దక్షిణ కొరియా, జపాన్‌) మాత్రమే మహిళల ప్రపంచకప్‌ హాకీ టోర్నీలో పాల్గొన్నాయి. చైనా, జపాన్‌ జట్లు తొమ్మిదిసార్లు  చొప్పున, భారత్, కొరియా ఎనిమిదిసార్లు చొప్పున బరిలోకి దిగాయి. చైనా (2002లో), కొరియా (1990లో) జట్లు మూడో స్థానాన్ని సంపాదించి ఆసియా నుంచి అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేశాయి. భారత్‌ 1974లో నాలుగో స్థానం పొందింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement