పాక్‌ దొంగ బుద్ధి.. డబుల్ ట్యాప్ వ్యూహం! | Pak Alleged Double Tap Strikes Push Afghan Border Into Fresh Bloodshed | Sakshi
Sakshi News home page

పాక్‌ దొంగ బుద్ధి.. డబుల్ ట్యాప్ వ్యూహం!

Jun 29 2026 11:36 AM | Updated on Jun 29 2026 11:46 AM

Pak Alleged Double Tap Strikes Push Afghan Border Into Fresh Bloodshed

పాకిస్తాన్‌ కపట దాడులతో.. ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దు మరోసారి నెత్తురోడింది. అర్ధరాత్రి వేళ.. జనావాసాలు, మసీదులపై మొదటిసారి దాడులు జరగగా.. సహాయక చర్యలు కొనసాగుతున్న సమయంలోనూ.. పాక్‌ అనైతికంగా మరోసారి మెరుపు దాడులు జరిపింది. ఈ ఘటనల్లో కనీసం 35 మంది మరణించారని, వాళ్లంతా నిషేధిత సంస్థకు చెందిన వ్యక్తులని పాక్‌ ప్రకటించుకుంది. అయితే ఆఫ్ఘన్ అధికారులు మాత్రం మృతుల్లో ఎక్కువ మంది అమాయక ప్రజలే  ఉన్నారని చెబుతున్నారు.

పక్తికా, పక్తియా, కునార్ ప్రాంతాల్లో పాకిస్తాన్ వైమానిక దళం అర్ధరాత్రి 12:30 గంటల సమయంలో దాడులు ప్రారంభించినట్లు సమాచారం. 25 నిమిషాల వ్యవధిలోనే అదే ప్రాంతాల్లో రెండో దశ దాడులు జరిగినట్లు స్థానిక వర్గాలు చెబుతున్నాయి. వివాదాస్పదంగా భావించే “డబుల్ ట్యాప్” వ్యూహం ఈ దాడుల్లో అమలయ్యిందన్న ఆరోపణలు పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తున్నాయి.  

మొదటి దాడుల తర్వాత సహాయక చర్యలకు వెళ్లిన వాళ్లపైనా రెండోసారి మెరుపు దాడి జరిగింది. ఈ ఘటనలతో మరణాల సంఖ్య పెరిగిందని, గాయపడిన వారి సంఖ్య వందకు పైగా చేరిందని తెలుస్తోంది.

పాకిస్తాన్ ప్రభుత్వం ఈ చర్యలను ఉగ్రవాద స్థావరాలపై లక్ష్యంగా చేసిన “ఇంటెలిజెన్స్ బేస్డ్ ఆపరేషన్లు”గా సమర్థించుకుంటోంది. దేశంలో ఇటీవల జరిగిన దాడులకు ప్రతిస్పందనగానే ఈ సైనిక చర్యలు చేపట్టినట్లు అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా టీపీపీ అనుబంధ గ్రూపులపై చర్యల భాగంగా ఈ దాడులు జరిగినట్లు పాకిస్తాన్ వాదిస్తోంది. అయితే ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వం ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తోంది. 

పౌర ప్రాంతాలు, ఇళ్లు, మసీదులే లక్ష్యంగా మారాయని, మరణించిన వారిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారని కాబూల్ అధికారులు చెబుతున్నారు. పాకిస్తాన్ చేసిన చర్యలను “అక్రమ దాడులు”గా అభివర్ణిస్తూ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.

2021 తర్వాత ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతింటూ వస్తున్నాయి. తరచూ సరిహద్దు ఉద్రిక్తతలు, పరస్పర ఆరోపణలు కొనసాగుతుండటంతో ప్రాంతంలో అస్థిరత నెలకొంది. గతంలో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాలు కూడా పూర్తిగా నిలబడలేకపోయాయి. తాజా దాడులతో సరిహద్దు గ్రామాల్లో భయాందోళన వాతావరణం నెలకొంది. మరోవైపు అంతర్జాతీయ స్థాయిలో కూడా ఈ ఘటనలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పరిస్థితి మరింత ఉద్రిక్తతకు దారి తీసే అవకాశముందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

ఇల్లీగల్‌ కాదా?.. 
“డబుల్ ట్యాప్” అనే సైనిక వ్యూహాన్ని అంతర్జాతీయ చర్చల్లో చాలాసార్లు అత్యంత వివాదాస్పదమైన, మానవతా పరంగా తీవ్రంగా విమర్శించబడే పద్ధతిగా పేర్కొంటారు. సాధారణంగా మొదటి దాడి తర్వాత సహాయక బృందాలు, వైద్య సిబ్బంది, మీడియా ప్రతినిధులు చేరుకునే సమయంలో అదే ప్రాంతంపై రెండోసారి దాడి చేయడాన్ని డబుల్‌ ట్యాప్‌ దాడులంటారు. మానవ హక్కుల సంస్థలు ఈ విధానాన్ని తీవ్రంగా ఖండిస్తూ వస్తున్నాయి. అయితే..

ఇది అధికారిక అంతర్జాతీయ చట్టాల్లో ప్రత్యేకంగా “illegal by name”గా నిర్వచించబడకపోయినా.. పౌరుల భద్రత, యుద్ధ నిబంధనలు, జెనీవా కన్వెన్షన్ స్పిరిట్‌కు విరుద్ధమనే విమర్శలు బలంగా వినిపిస్తాయి. గతంలో కూడా ఇలాంటి వ్యూహాలపై ఆరోపణలు వివిధ యుద్ధాల సమయంలోనూ వినిపించాయి. ఇప్పుడు ఆఫ్ఘన్ సరిహద్దు ఘటనల్లో కూడా అదే తరహా “డబుల్ ట్యాప్” వ్యూహం ఉపయోగించారన్న ఆరోపణలు రావడంతో, ఇది మళ్లీ అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement