యూనిఫాం తీసేసి రాజకీయాల్లోకి రండి.. అసిమ్ మునీర్‌కు రెహమాన్ సవాల్ | Maulana Fazlur Rehman Demands Resignation of Army Chief Field Marshal Asim Munir | Sakshi
Sakshi News home page

యూనిఫాం తీసేసి రాజకీయాల్లోకి రండి.. అసిమ్ మునీర్‌కు రెహమాన్ సవాల్

Jul 16 2026 8:26 PM | Updated on Jul 16 2026 8:26 PM

Maulana Fazlur Rehman Demands Resignation of Army Chief Field Marshal Asim Munir

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్ ఆర్మీ చీఫ్, ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్‌పై ఆ దేశ ప్రముఖ రాజకీయ నాయకుడు, జమియత్ ఉలేమా-ఎ-ఇస్లాం (ఫజల్) అధినేత మౌలానా ఫజలుర్ రెహమాన్ తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయాల్లో పాత్ర పోషించాలనుకుంటే సైన్యానికి రాజీనామా చేసి రాజకీయ పార్టీని స్థాపించి ఎన్నికల్లో పోటీ చేయాలని ఆయన సవాల్ విసిరారు.

జూలై 12న జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన రెహమాన్.. రాజకీయ వ్యవహారాల్లో సైన్యం జోక్యం పెరుగుతోందని ఆరోపించారు. రక్షణ, భద్రతా అంశాలకు మాత్రమే పరిమితం కావాల్సిన సైన్యం, ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం సరికాదని అన్నారు. రాజకీయాలు చేయాలనుకుంటే యూనిఫాం తీసేసి రాజకీయాల్లోకి రండి. ఎన్నికల్లో పోటీ చేయండి. అప్పుడు ప్రజలు యూనిఫాంలో ఉన్న వ్యక్తికి ఎన్ని ఓట్లు ఇస్తారో తెలుస్తుంది అని ఆయన వ్యాఖ్యానించారు.

దేశంలో ఎవరు అధికారంలోకి రావాలి, ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేయాలి లేదా ఎవరు పదవి నుంచి దిగిపోవాలి అనేది నిర్ణయించడం సైన్యం పని కాదని రెహమాన్ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అలాంటి నిర్ణయాలు ప్రజలే తీసుకోవాలని ఆయన అన్నారు.

పాకిస్థాన్‌లో సైన్యం ప్రభావం క్రమంగా పెరుగుతోందని, ముఖ్యంగా అంతర్జాతీయ వేదికలపై కూడా ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ కంటే ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ కీలక పాత్ర పోషిస్తున్నారని ఆయన విమర్శించారు.

దేశంలో జనాభా పెరుగుదల సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీలో అసిమ్ మునీర్‌ను చేర్చిన ప్రభుత్వ నిర్ణయాన్ని కూడా రెహమాన్ తప్పుబట్టారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి సాధారణ పౌరులు మిలీషియాలను ఏర్పాటు చేసుకోవాలని లేదా ఆయుధాలు చేపట్టాలని వస్తున్న సూచనలను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. దేశ భద్రతను కాపాడడం పూర్తిగా ప్రభుత్వం, సాయుధ దళాల బాధ్యతేనని, ఆ పని కోసమే వారికి వేతనాలు చెల్లిస్తున్నారని పేర్కొన్నారు.

దేశ రక్షణ కోసం సైనికులు విధులు నిర్వర్తిస్తారు. అందుకు వారికి జీతాలు ఇస్తున్నారు. ప్రజలను ఆయుధాలు పట్టమని చెప్పడం సరైన విధానం కాదు. నేను ఎలాంటి మిలీషియాను ఏర్పాటు చేయను’అని ఆయన స్పష్టం చేశారు. పౌరులకు ఆయుధాలు ఇవ్వడం వల్ల భవిష్యత్తులో వ్యక్తిగత కక్షలు, హింస, రక్తపాతం పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించిన రెహమాన్, అలాంటి చర్యలు దేశ భద్రతకు మరింత ముప్పు తెస్తాయని అన్నారు.

ఈ సందర్భంగా బలూచిస్థాన్‌లోని భద్రతా పరిస్థితిపై కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బలూచ్ మెజారిటీ ప్రాంతాల్లో పాకిస్థాన్ ప్రభుత్వ నియంత్రణ బలహీనపడిందని, ఇప్పుడు హింస పష్తూన్ ప్రాంతాలకు కూడా విస్తరిస్తోందని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement