ఇస్లామాబాద్: పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో మరోసారి తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. రావాలాకోట్లోని న్యూ బస్ టెర్మినల్ సమీపంలో సాధారణ ప్రజలపై అక్కడి భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో అక్కడ మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్తితులు నెలకొన్నాయి. ఇస్లామాబాద్ (పాకిస్తాన్ ప్రభుత్వం)పై స్థానికుల్లో ఉన్న అసంతృప్తి, వ్యతిరేకత ఒక్కసారిగా పెరిగాయి. పీవోకే ప్రజలు పాక్‌కు వ్యతిరేకంగా తీవ్రస్థాయిలో నిరసనలు చేపట్టారు.
వైట్‌హౌస్ ఎదుట నిరసన
కాగా ఇటీవలే అమెరికాలో ఉన్న పీవోకే ప్రజలు వాషింగ్టన్‌లో ఉన్న వైట్ హౌస్ వెలుపల నిరసన కార్యక్రమం చేపట్టారు. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లో పెద్దఎత్తున హింసచేలరేగుతందని పాకిస్థాన్ ఆ ప్రాంతంలో మానవహక్కులని కాల రాస్తుందని ఆరోపించారు. అంతర్జాతీయ సమాజం పీవోకేలో జరుగుతున్న మానవతా సంక్షోభంపై దృష్టి పెట్టాలని వారు డిమాండ్ చేశారు. PoK లోని పౌర నివాస ప్రాంతాల నుండి పాకిస్తాన్ సైన్యాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, నిరాయుధులైన పౌరులపై ప్రాణాంతక బలగాలను ప్రయోగించడాన్ని అంతర్జాతీయ సమాజం అడ్డుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఇంతలోనే మరోసారి ప్రాంతంలోకాల్పులు జరగడం తీవ్ర కలకలం రేపుతోంది.
భారత్ సహాయం చేయాలి
దాదాపు 40 లక్షల మంది ప్రజలను బాహ్య ప్రపంచానికి దూరం చేస్తూ పాక్ ప్రభుత్వం అక్కడ సుదీర్ఘకాలంగా ఇంటర్నెట్‌ను నిలిపివేసిందని నిరసనకారులు ఆరోపించారు. స్థానిక ప్రజల ప్రాణాలను కాపాడటానికి, మానవతా సహాయాన్ని అందించడానికి భారతదేశం జోక్యం చేసుకోవాలని వారు ఒక అసాధారణ విజ్ఞప్తి చేశారు. బాధితులకు అవసరమైన సాయం అందేలా పూంచ్, డోడా సెక్టార్ల ద్వారా నియంత్రణ రేఖను తెరవాలని డిమాండ్ చేశారు.
పేదరికంతో సతమతమవుతున్న ప్రజలు
తాజా ఘర్షణల పక్కన పెడితే, అక్కడి ప్రజలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు పలు నివేదికలు తెలిపాయి.'నేచర్'జర్నల్ 2025 నాటి అధ్యయనం ప్రకారం, ఇక్కడి జనాభాలో 66% మంది వ్యవసాయం, పశుపోషణపైనే ఆధారపడి జీవిస్తున్నారు. అయినప్పటికీ 57% కంటే ఎక్కువ కుటుంబాలు ఆహార భద్రత లేకుండా నివసిస్తున్నాయి. దాదాపు 29% మంది ప్రజలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు (పాకిస్తాన్ జాతీయ సగటు 19.9% కంటే ఇది చాలా ఎక్కువ). పర్వత ప్రాంతాలలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది, అక్కడ 90% కుటుంబాలు ఆహార కొరతను ఎదుర్కొంటున్నాయి.


