తమిళనాడు సీఎం విజయ్ వ్యాఖ్య
ధరాపురంలో భారీ రోడ్ షో
ధరాపురం: డీఎంకే పార్టీకి ఓటేస్తే మహిళలను అవమానించే వారిని సమరి్థంచినట్లే అవుతుందని టీవీకే చీఫ్, తమిళనాడు ముఖ్యమంత్రి సి.జోసెఫ్ విజయన్ వ్యాఖ్యానించారు. రేపు తిరుప్పూర్ జిల్లా ధరాపురం నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నిక ప్రచారం కోసం ఆదివారం ఆయన ధరాపురంలో 40 కిలోమీటర్ల మేర భారీ రోడ్ షో చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన ప్రతిపక్ష డీఎంకే నేత ఎంకే స్టాలిన్‌ను లక్ష్యంగా చేసుకుని పలు వ్యాఖ్యలు చేశారు.
తమ పార్టీ అభ్యర్థి సత్యభామపై ఎంకే స్టాలిన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను విజయ్ ప్రస్తావించారు. ‘‘మన సోదరి సత్యభామపై స్టాలిన్ నీచమైన వ్యాఖ్యలు చేశారు. అవి చాలా అసభ్యంగా ఉన్నాయి. వాటిని వినలేం. స్టాలిన్ ఒక్కరే కాదు డీఎంకే పారీ్టలోని వారంతా ఇలాంటి చౌకబారు ప్రసంగాలే చేస్తున్నారు. నా గురించి మీరు ఏమైనా మాట్లాడుకోండి భరిస్తాను. కానీ, మన సోదరి, మన ఇళ్లలోని తల్లులు, అకీచెల్లెళ్లు, కుమార్తెల గురించి మాట్లాడే ధైర్యం చేస్తే మాత్రం ఊరుకోను’ అని హెచ్చరించారు.
ఆదివారం ఉదయం ప్రత్యేక విమానంలో కోయంబత్తూర్ చేరుకున్న విజయ్ హెలికాప్టర్‌లో ధరాపురం వచ్చారు. ఒంటి గంట సమయంలో మొదలైన ఆయన రోడ్ షో సాయంత్రం 4 గంటలకు ముగిసింది. తన ప్రచార వాహనంతోపాటు కొద్దిసేపు ఎడ్లబండిలో కొంతదూరం కాలినడకన వెళ్లి ప్రజలతో మమేకమయ్యారు. అన్నాడీఎంకే తరఫున ధరాపురం, మధురాంతకం నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన సత్యభామ, మరగథం కుమారవేల్ అనంతరం టీవీకేలో చేరారు. దీంతో ఉప ఎన్నికల అనివార్యమైంది. వీళ్లకు టీవీకే తిరిగి అవే స్థానాల్లో టికెట్ ఇచ్చి ఉప ఎన్నికల్లో పోటీకి నిలబెట్టింది.


