మభ్యపుచ్చేందుకే ' సుప్రీం'! | Chandrababu Naidu meets with alliance leaders on election preparations | Sakshi
Sakshi News home page

మభ్యపుచ్చేందుకే ' సుప్రీం'!

Oct 4 2026 5:57 AM | Updated on Oct 4 2026 5:57 AM

Chandrababu Naidu meets with alliance leaders on election preparations

పోరాడుతున్నట్టు నటిస్తూ బాబు ఎన్నికల ఏర్పాట్లు

ఎన్నికల సన్నద్ధతపై కూటమి నేతలతో సమావేశాలు 

జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో అధికారుల సమీక్షలు 

స్ట్రాంగ్‌ రూమ్‌లు, పోలింగ్‌ అనంతర ఏర్పాట్లపై ప్రణాళికలు 

ఈ నెల 7న కలెక్టర్లు, ఎస్పీలతో రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక భేటీ 

ఎన్నికల నోటిఫికేషన్‌పై అధికార వర్గాల్లో చర్చ

సాక్షి, అమరావతి :  ముందుగా నిర్ణయించుకున్న స్క్రిప్టు ప్రకారం బీసీలను మభ్యపెట్టేందుకు రిజర్వేషన్లపై చంద్రబాబు సర్కార్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. నిజంగా బీసీ రిజర్వేషన్లపై న్యాయపోరాటం చేస్తున్నారని అనుకోవడానికే ఇదంతా చేస్తున్నారు తప్ప చంద్రబాబుకు ఎలాంటి చిత్తశుద్ధీ లేదని బీసీ నాయకులంటున్నారు. సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పుడు కోర్టు ఏం చెబుతుందో వినాలి కదా అని వారు ప్రశ్నిస్తున్నారు.   ఒకవైపు కోర్టులో పోరాడుతున్నట్టు నటిస్తూ ఇటు అధికారులను, అటు పార్టీ నాయకులను ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. ఎలాగూ కోర్టు కొట్టేస్తుంది కాబట్టి మీరంతా మీ పనులు వేగంగా పూర్తిచేయండి అంటూ అధికారులను అదిలిస్తున్నారు. 

అదే సమయంలో పార్టీ ముఖ్యనేతలతో ఎన్నికలకు ఏర్పాట్లు చేసుకోవాలని సూచిస్తున్నారు. సుప్రీంకోర్టులో స్పష్టత రాకముందే చంద్రబాబు ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా ఎన్నికల నిర్వహణకు చేస్తున్న హడావుడి మామూలుగా లేదు. మంత్రి అచ్చెన్నాయుడు స్థానిక ఎన్నికలకు సన్నద్దతపై శనివారం విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ప్రధాన నాయకులతో సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. మరికొన్ని జిల్లాల్లోనూ కూటమి నేతల ఎన్నికల సమావేశాలు కొనసాగాయి.  

కలెక్టర్లు, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఎన్నికల హడావుడి 
శనివారం కూడా జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి అధికారుల సమావేశాలు కొనసాగాయి. పోలింగ్‌ తర్వాత చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చ జరిగిందని, స్ట్రాంగ్‌ రూమ్‌ల గుర్తింపు వంటి వాటికి కూడా ప్రణాళికలు సిద్ధం చేశారని తెలిసింది. పాత రిజర్వేషన్లకు అనుగుణంగా ఎన్నికల ఏర్పాట్లు చేసుకోవలసిందిగా పైనుంచి సూచనలందాయని అధికారుల స్థాయిలో చర్చ సాగుతోంది.   ఒకపక్క ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు మంత్రులు పార్టీ నాయకులను స్థానిక సంస్థలకు సన్నద్ధం చేస్తుండగా ఇంకోపక్క జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలోనూ ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. 

ఇదే సమయంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ సైతం ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా  స్థానిక సంస్థల ఎన్నికల హడావుడిని పెంచింది. ఈ నెల 7 (బుధవారం) అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, వివిధ నగర పోలీసు కమిషనర్లతో పాటు ఆయా జిల్లాల జెడ్పీ సీఈవోలు, డీపీవోలు, నగర, పట్టణ మున్సిపల్‌ కమిషనర్లతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పోలీసు ఉన్నతాధికారులతో పాటు ఆర్థిక, ఎక్సైజ్‌ శాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించిన రాష్ట్ర ఎన్నికల కమిషన్, జిల్లా కలెక్టర్లు, ఎస్పీల సమావేశం కూడా పూర్తి చేసిందంటే ఆ తర్వాత ఎప్పడైనా ఎన్నికల నోటిఫికేషన్‌ జారీకి అవకాశం ఉంటుందని అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement