పెద చెరువులో నిర్మాణాలు వద్దని మేం ఆదేశిస్తే.. ఎలా కొనసాగిస్తారు?
ఇందుకు ఎవరు అనుమతి ఇచ్చారు?
ప్రభుత్వాన్ని నిలదీసిన హైకోర్టు
ఆదేశాలను తూచా తప్పకుండా అమలు చేసి తీరాల్సిందేనని స్పష్టీకరణ
స్పీకర్ అయ్యన్నపాత్రుడు, పలువురు అధికారులకు కోర్టు ధిక్కార నోటీసులు
సాక్షి, అమరావతి: అనకాపల్లి జిల్లా, నర్సీపట్నం మునిసిపాలిటీ పరిధిలోని పెద చెరువులో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని గతంలో తాము ఆదేశాలు జారీ చేసినప్పటికీ, అక్కడ ఇంకా నిర్మాణాలు కొనసాగుతుండటంపై హైకోర్టు బుధవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పనులన్నీ ఆపేయాలని తాము ఆదేశిస్తే, తిరిగి పనులు ఎలా కొనసాగిస్తున్నారని, ఇందుకు ఎవరు అనుమతులు ఇచ్చారని అధికారులను నిలదీసింది.
నిర్మాణాలు ఆపాలంటూ గతంలో తామిచ్చిన ఆదేశాలను కఠినంగా అమలు చేసి తీరాల్సిందేనని తేల్చి చెప్పింది. కోర్టు ఆదేశాలున్నా నిర్మాణ పనులు కొనసాగిస్తుండటంపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)లో ప్రతివాదిగా ఉన్న స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడితో పాటు పలువురు అధికారులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ల దాఖలుకు ఆదేశాలిచ్చిన ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ లీసా గిల్, న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్‌లతో కూడిన ధర్మాసనం తదుపరి విచారణను వాయిదా వేసింది.
ప్రకృతి తనను తాను రక్షించుకోగలదు...
చెరువు పరిరక్షణ కోసమే నిర్మాణాలు చేస్తున్నామంటూ అయ్యన్న తరఫు న్యాయవాది చెప్పగా హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ‘ప్రకృతిని, నీటి వనరులను ఎవరూ ప్రత్యేకంగా పరిరక్షించాల్సిన అవసరం లేదు. ప్రకృతే తనను తాను రక్షించుకోగలదు. మీరు దాని జోలికి వెళ్లకుంటే చాలు. ప్రకృతి వనరులను ఎవరూ సుందరీకరించాల్సిన అవసరం లేదు. తనను తాను ఎలా సుందరీకరించుకోవాలో ప్రకృతికి తెలిసినంతగా ఎవరికీ తెలియదు. ప్రకృతిని అలా వదిలేస్తే అది తనను తాను సుందరీకరించుకుంటుంది’ అని ధర్మాసనం స్పష్టంచేసింది.
అయ్యన్న ప్రోద్బలంతోనే నిర్మాణాలు
రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడు ప్రోద్బలంతో పెద చెరువును ఆక్రమించి ‘సృష్టిక్షేత్రం’ పేరుతో చేస్తున్న నిర్మాణాలను సవాలు చేస్తూ మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర గణేష్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ఈ ఏడాది ఏప్రిల్ 1న విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం, పెద చెరువులో ఎలాంటి నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదని ఆదేశించింది. పెద చెరువు కట్ట బలోపేతం, సుందరీకరణను కొనసాగించవచ్చంది. అయితే సుందరీకరణ చేసే ముందు అందుకు సంబంధించి కార్యాచరణను తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
కోర్టు ఆదేశాలు ఇచ్చినా అయ్యన్న ప్రోద్భలంతో అధికారులు నిర్మాణ పనులు కొనసాగిసూ్తనే ఉన్నారు. దీంతో ఉమా శంకర్ గణేష్ తాజాగా కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా అటు పిల్‌తో పాటు, ఇటు కోర్టు ధిక్కార వ్యాజ్యంపై సీజే ధర్మాసనం విచారణ జరిపింది. గణేష్ తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, మారెక్కగారి బాలకృష్ణ వాదనలు వినిపిస్తూ ధర్మాసనం గతంలో ఇచ్చిన ఆదేశాలను అధికారులు బేఖాతరు చేశారని తెలిపారు. స్పీకర్ ఆధ్వర్యంలో విగ్రహాలు ఏర్పాటు అవుతుండటంతో అధికారులు కోర్టు ఆదేశాల కన్నా అధికార పార్టీ నేతలకే ప్రాధాన్యమిస్తున్నారని సుధాకర్‌రెడ్డి వివరించారు. నిర్మాణాలు కొనసాగిస్తున్న విషయానికి సంబంధించిన ఫొటోలను ఆయన ధర్మాసనం ముందుంచారు.


