30 ఏళ్లలో 436 తీవ్ర విపత్తులు
78 వేల మందికి పైగా మృతి
120 కోట్ల మందిపై ప్రభావం
రూ.14 లక్షల కోట్లకు పైగా ఆర్థిక నష్టం
క్లైమేట్ రిస్క్ ఇండెక్స్–2027లో వెల్లడి
విపత్తుల వల్ల ప్రపంచంలో అత్యధికంగా ప్రభావితమైన దేశాల్లో భారత్
సాక్షి, అమరావతి: ప్రకృతి విపత్తులు భారత్‌పై దాడి చేస్తున్నాయి. భారీ వర్షాలు, వరదలు, తుపాన్లు, వడగాలులు, కరువు వంటి ప్రకృతి విపత్తులు దేశాన్ని తరచూ అతలాకుతలం చేస్తున్నాయి. గడచిన 30 ఏళ్లలో (1996–2025) భారత్‌లో 436 తీవ్ర వాతావరణ విపత్తులు సంభవించాయి. వీటివల్ల 120 కోట్ల మందికి పైగా ప్రజలు ప్రభావితమయ్యారు. 78 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ విపత్తుల వల్ల భారత కరెన్సీలో సుమారు రూ.14 లక్షల కోట్లకు పైగా నష్టపోయినట్టు జర్మనీకి చెందిన పర్యావరణ సంస్థ ‘జర్మన్ వాచ్’ విడుదల చేసిన క్లైమేట్ రిస్క్ ఇండెక్స్–2027 నివేదిక వెల్లడించింది.
ఐక్యరాజ్యసమితి తుర్కియే (టర్కీ)లోని అంటాల్యాలో నిర్వహించిన వాతావరణ మార్పుల సదస్సు 31వ సమావేశం (కాప్–31) సందర్భంగా జర్మన్ వాచ్ ఈ నివేదికను విడుదల చేసింది. 1996 నుంచి 2025 వరకు ప్రపంచవ్యాప్తంగా సంభవించిన తీవ్ర వాతావరణ ఘటనలను విశ్లేషించి ఈ సూచీని రూపొందించింది. ప్రకృతి విపత్తుల కారణంగా సంభవించిన మరణాలు, ప్రభావితమైన ప్రజల సంఖ్య, ఆర్థిక నష్టాలను ప్రధాన ప్రాతిపదికగా తీసుకోవడంతో పాటు ఇంటర్నేషనల్ డిజాస్టర్ డేటాబేస్, అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్), ప్రపంచ బ్యాంకు గణాంకాలను ఉపయోగించి నివేదిక రూపొందించినట్టు పేర్కొంది.
టాప్–10లో భారత్
గత మూడు దశాబ్దాల వాతావరణ విపత్తుల ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకున్నప్పుడు అత్యధికంగా నష్టపోయిన దేశాల్లో భారత్ తొలి పది స్థానాల్లో ఒకటిగా నిలిచిందని జపాన్ వాచ్ వెల్లడించింది. 2025 సంవత్సరానికి సంబంధించిన ప్రత్యేక ర్యాంకింగ్‌లో భారత్ 12వ స్థానంలో ఉందని తెలిపింది.
హుద్‌హుద్ నుంచి అంఫాన్ వరకు..
మూడు దశాబ్దాల్లో భారత్ అనేక భారీ ప్రకృతి విపత్తులను ఎదుర్కొందని వెల్లడించింది. 1998లో గుజరాత్ తుపాను, 1999లో ఒడిశా సూపర్ సైక్లోన్, 2013లో ఉత్తరాఖండ్ వరదలు, 2014లో హుద్‌హుద్ తుపాను, 2020లో అంఫాన్ తుపాను తీవ్ర నష్టాన్ని కలిగించాయని పేర్కొంది. ముఖ్యంగా తీర ప్రాంతాలు తుపాన్ల ధాటికి తీవ్రంగా దెబ్బతిన్నాయని తెలిపింది.
వ్యవసాయ రంగానికి కోలుకోలేని దెబ్బ
2019లో దేశంలోని 13 రాష్ట్రాల్లో సంభవించిన భారీ వరదలు లక్షలాది మందిని ప్రభావితం చేయడంతో పాటు వ్యవసాయ రంగానికి తీవ్ర నష్టం కలిగించాయని వివరించింది. మరోవైపు 1998, 2002, 2003, 2015 సంవత్సరాల్లో నమోదైన తీవ్ర వడగాలులు, దాదాపు 50 డిగ్రీల సెల్సియస్ వరకు చేరిన ఉష్ణోగ్రతలు అనేక మంది ప్రాణాలను బలిగొన్నాయని తెలిపింది.
జనజీవనం అస్తవ్యస్తం
భారత్‌లో రుతుపవనాల సమయంలో కురిసే భారీ వర్షాలు, వరదలు కొండ చరియలు విరిగిపడటానికి కారణమవుతున్నాయని వెల్లడించింది. దీంతో ప్రజలు నిరాశ్రయులవుతుండగా, పంటలు, పశుసంపద, ఇళ్లు, రహదారులు దెబ్బతింటున్నాయని పేర్కొంది. తీర ప్రాంతాల్లో తుపాన్లు తీవ్ర విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయని తెలిపింది. దేశంలోని భిన్నమైన భౌగోళిక, వాతావరణ పరిస్థితుల కారణంగా వివిధ ప్రాంతాలు వివిధ రకాల ప్రకృతి ముప్పులను ఎదుర్కొంటున్నాయని నివేదిక వెల్లడించింది.
ముందస్తు చర్యలే పరిష్కారం
వాతావరణ మార్పులు కేవలం పర్యావరణ సమస్యగా మిగలడం లేదని జర్మన్ వాచ్ ఆందోళన వ్యక్తం చేసింది. వ్యవసాయం, ఆహార భద్రత, నీటి వనరులు, ప్రజారోగ్యం, దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రత్యక్ష ప్రభావం చూపుతున్నాయని పేర్కొంది. ప్రకృతి విపత్తులు సంభవించిన తర్వాత సహాయక చర్యలు చేపట్టడమే కాకుండా ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను బలోపేతం చేయడంతోపాటు వరద నియంత్రణ చర్యలు చేపట్టాలని సూచించింది. తుపాన్లను తట్టుకునే మౌలిక సదుపాయాలను నిర్మించి పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొంది. వాతావరణ మార్పులను ఎదుర్కొనేలా అభివృద్ధి ప్రణాళికలు రూపొందించకపోతే భవిష్యత్తులో ప్రాణ, ఆస్తి నష్టాలు మరింత పెరిగే ప్రమాదం ఉందని ఈ నివేదిక హెచ్చరించింది.


