దిశ మార్చుకుంటూ.. దడపుట్టిస్తున్న ఆక్వాన్‌ | Cyclone Akvan is changing its direction | Sakshi
Sakshi News home page

దిశ మార్చుకుంటూ.. దడపుట్టిస్తున్న ఆక్వాన్‌

Nov 19 2026 5:51 AM | Updated on Nov 19 2026 5:51 AM

Cyclone Akvan is changing its direction

గంటకు 8 కిలోమీటర్ల వేగంతోనే కదలిక 

దిశ మార్చుకుంటూ ఉత్తరాంధ్ర–దక్షిణ ఒడిశా సరిహద్దు వైపు తుపాను 

నెల్లూరు–తుని నుంచి నరసాపురం–పూరీకి.. తీరం దాటే ప్రాంతం 

తీరం చేరేసరికి బలహీనపడే అవకాశం 

20వ తేదీ మధ్యాహ్నానికి తీరం దాటే సూచన 

ఇప్పటికే ఉత్తరాంధ్రను కమ్ముకున్న మేఘాలు 

సాక్షి, అమరావతి: ఆక్వాన్‌ తీవ్ర తుపాను బంగాళాఖాతంలో నెమ్మదిగా కదులుతూ గుబులు రేపుతోంది. తక్కువ వేగంతో కదులుతూ దిశ మార్చుకుని ఉత్తరం వైపు మళ్లడంతో అది తీరం దాటే ప్రాంతంపై అంచనాలు మారాయి. తొలుత దక్షిణ కోస్తాను తాకుతుందనుకున్న తుపాను ఇప్పుడు ఉత్తరాంధ్ర–దక్షిణ ఒడిశా వైపు కదులుతోంది. నెల్లూరు–తుని మధ్య తీరం దాటుతుందని తొలుత అంచనా వేయగా మచిలీపట్నం–పూరీ మధ్య తీరం దాటుతుందని బుధవారం మధ్యాహ్నం వాతావరణ శాఖ తెలిపింది. సాయంత్రానికి నరసాపురం–పూరీ మధ్య తీరం దాటుతుందని పేర్కొంది. 

తుపాను గమనాన్ని బట్టి శ్రీకాకుళం–దక్షిణ ఒడిశా తీరాల మధ్యే తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు. ఎనిమిది కిలోమీటర్ల వేగంతో కదులుతున్న ఆక్వాన్‌ బుధవారం నరసాపురానికి 540 కిలోమీటర్లు, కళింగపట్నానికి 600 కిలోమీటర్లు, చెన్నైకి 570 కి.మీ.. పూరీకి 750 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. సముద్రంపైనే ఎక్కువసేపు ఉండటంతో గురువారం తుపాను అక్కడే ఎక్కువ బలపడుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. 

తీరానికి చేరే సమయానికి బాగా బలహీనపడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. అత్యంత తీవ్ర తుపానుగా తీరం దాటుతుందని మొదట వేసిన అంచనాలను సవరించి తీవ్ర తుపానుగానే తీరం దాటుతుందని వాతావరణ శాఖ తెలిపింది. తీరం దాటే సమయానికి ఇంకా బలహీనపడి సాధారణ తుపాను స్థాయికి దిగినా ఆశ్చర్యంలేదని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. 

కాకినాడ నుంచి శ్రీకాకుళం వరకు కుండపోత వర్షాలు..
ఇది శుక్రవారం మధ్యాహ్నానికి తీరం దాటే అవకాశం ఉంది. అయితే ఈలోపే దాని ప్రభావంతో ఏర్పడిన మేఘాలు విశాఖ నుంచి కటక్‌ వరకు తీరప్రాంతంలో విస్తరించాయి. కాకినాడ నుంచి శ్రీకాకుళం వరకు తీరప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తరాంధ్ర, యానాం ప్రాంతాలకు రెడ్‌ అలెర్ట్‌ జారీచేశారు. 

ఉపరితల వాతావరణంలో తుపానును ముందుకు తోసే గాలులు బలహీనపడడంతో అది నెమ్మదిగా కదులుతోంది. అదే సమయంలో ఉత్తరాది నుంచి విస్తరించిన ద్రోణి తుపానును ఉత్తరదిశ వైపు నెడుతోంది. ఫలితంగా పడమర వైపు రావాల్సిన తుపాను దిశ మార్చుకుని ఉత్తరం వైపు మళ్లింది. ఇదే పరిస్థితి కొనసాగుతుండటంతో తుపాను ఇంకా ఉత్తరానికి కదులుతూ ఏపీ–ఒడిశా సరిహద్దు ప్రాంతంలో తీరం దాటే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. 

100 కిలోమీటర్ల వేగంతో గాలులు.. 
బుధవారం అర్ధరాత్రి నుంచి తుపాను ప్రభావం కనిపించనుంది. భారీ వర్షాలతోపాటు గంటకు 100–110 కిలోమీటర్లు, గరిష్ఠంగా 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. తుపాను బలహీనపడినా వర్షాల తీవ్రత ఉండనుంది. కాకినాడ నుంచి శ్రీకాకుళం వరకు తీరానికి ఎదురుగా సముద్రంలో తుపాను వర్ష కేంద్రం కేంద్రీకతమై ఉంది. తీరప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గురువారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ జిల్లాలు, యానాంలో అక్కడక్కడ అత్యంత భారీవర్షాలు కురుస్తాయి. పార్వతీపురం మన్యం, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు పడతాయి. 

ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లోను భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. తుపాను తీరం దాటే శుక్రవారం ఉత్తరాంధ్రలో పరిస్థితి ఇంకా తీవ్రంగా ఉండనుంది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తాయి. అల్లూరి, కోనసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో భారీవర్షాలు పడతాయి. గురు, శుక్రవారాల్లో కోస్తా అంతటా గంటకు 90–100 కిలోమీటర్లు, గరిష్ఠంగా 110 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయి. శనివారం కూడా ఉత్తరాంధ్రలో భారీవర్షాలు కొనసాగుతాయి. రాయలసీమపై తుపాను ప్రభావం పెద్దగా ఉండదని వాతావరణ శాఖ తెలిపింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement