పోలీస్‌ చర్యపై దర్యాప్తుకు హైపవర్‌ కమిటీ | Supreme Court key decision on violent incidents at Chalo Sansad rally | Sakshi
Sakshi News home page

పోలీస్‌ చర్యపై దర్యాప్తుకు హైపవర్‌ కమిటీ

Aug 19 2026 4:42 AM | Updated on Aug 19 2026 4:43 AM

Supreme Court key decision on violent incidents at Chalo Sansad rally

చలో సంసద్‌ ర్యాలీలో  హింసాత్మక ఘటనలపై  సుప్రీంకోర్టు కీలక నిర్ణయం 

సుప్రీంకోర్టు, హైకోర్టుల మాజీ జడ్జీలు, మాజీ డీజీపీ, మాజీ సీబీఐ డైరెక్టర్‌లతో కమిటీ ఏర్పాటు 

మహిళా ఉద్యమకారులపై  లైంగిక వేధింపులకు గురైన అంశం సైతం పరిశీలన

సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక నీట్‌ ప్రశ్నపత్రాల లీకేజీ ఉదంతంలో పార్లమెంట్‌ ఎదుట నిరసన వ్యక్తం చేసేందుకు చలో సంసద్‌ ర్యాలీగా దూసుకొచ్చిన విద్యార్థులను పోలీసులు బాష్పవాయుగోళాలతో అడ్డుకుని లాఠీచార్జ్‌ చేసి విచక్షణారహితంగా చితకబాదారన్న ఆరోపణలపై సర్వోన్నత న్యాయస్థానం స్పందించింది. పార్లమెంట్‌ సాక్షిగా ఉద్యమకారులపై ఢిల్లీ పోలీసుల అతి బలప్రయోగం ఆరోపణల్లో నిజానిజాలను నిగ్గుతేల్చేందుకు అత్యున్నతస్థాయి(హైపవర్‌) కమిటీని ఏర్పాటుచేస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ సారథ్యంలోని ధర్మాసనం మంగళవారం ప్రకటించింది.

 పోలీసుల అత్యుత్సాహంతో వందలాది మంది గాయాలపాలయ్యారని, ఈ ఘటనలో పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన పలు పిటిషన్లను సీజేఐ సూర్యకాంత్, జస్టిస్‌ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్‌ వి మోహనల బెంచ్‌ విచారించి పై విధంగా ఆదేశాలిచ్చింది. సుప్రీంకోర్టులో, హైకోర్టులో పదవీవిరమణ చేసిన న్యాయమూర్తులు, మాజీ డీజీపీ, మాజీ సీబీఐ డైరెక్టర్లను సభ్యులుగా ఎంపికచేస్తూ హైపవర్‌ కమిటీని ఏర్పాటుచేస్తున్నట్లు బెంచ్‌ తెలిపింది. ర్యాలీలో బాధితులుగా మారిన ఉద్యమకారులు నేరుగా ఈ కమిటీని సంప్రదించి తమ ఫిర్యాదులు, ఆరోపణలు తెలియజేయవచ్చు. కమిటీ ఇచ్చే సిఫార్సులను కోర్టు పరిశీలిస్తుంది. తగు చట్టబద్ధమైన నిర్ణయాలను మేం తీసుకుంటాం’’అని ధర్మాసనం తెలిపింది.

 ‘‘ఉద్యమిస్తున్న మహిళలతో పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని, లైంగికంగా వేధించారని వస్తున్న ఆరోపణలపైనా కమిటీ దర్యాప్తు చేయనుంది. ఉద్యమకారిణులను ఆన్‌లైన్‌లో వేధించిన ఉదంతాలు, సోషల్‌మీడియా ద్వారా బెదిరించిన ఘటనలనూ, మహిళా కార్యకర్తలు చేసిన ఫిర్యాదులనూ హైపవర్‌ కమిటీ పరిశీలిస్తుంది. పరీక్షార్థుల ఉద్యమంతో సంబంధం ఉన్న ప్రతి కోణంలోనూ కమిటీ దర్యాప్తు కొనసాగుతుంది. ఈ ఉదంతంలో నేరస్తులుగా తేలిన వారిపై కఠిన శిక్షలుంటాయి. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన వారిని గుర్తించేందుకు జూలై 20వ తేదీనాటి ఘటనాస్థలి ఫొటోలు, వీడియోలు, సీసీటీవీ ఫుటేజీలను హైపవర్‌ కమిటీకి ఢిల్లీపోలీసులు అందజేయాలి’’అని ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాను సీజేఐ సూర్యకాంత్‌ ఆదేశించారు.  

వాళ్లకెంతో భవిష్యత్‌ ఉంది.. 
ఈ సందర్భంగా విద్యార్థులపై మోపిన కేసులను ధర్మాసనం ప్రస్తావించింది. ‘‘ఇది విద్యార్థుల జీవితాలకు సంబంధించిన విషయం. అక్రమ ఎఫ్‌ఐఆర్‌లను తొలగించాల్సిన సమయమిది. రాజ్యాంగంలోని 19వ అధికరణం ప్రకారం నిరసన తెలిపే హక్కు విద్యార్థులు, పరీక్షార్థులకు ఉంది. అనవసరంగా విద్యార్థులపై మోపిన ఎఫ్‌ఐఆర్‌లను తొలగించే హక్కు రాజ్యాంగంలోని 142వ అధికరణం ప్రకారం సుప్రీంకోర్టుకు ఉంది’’అని ధర్మాసనం గుర్తుచేసింది.

కేసుల మాఫీపై సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ అభ్యంతరం వ్యక్తంచేశారు. ‘‘ఆ రోజు ఆందోళనల్లో 2,800 మంది అసాంఘీక శక్తుల పాత్ర ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. వాళ్లకు నేర చరిత్ర ఉంది. జూలై 20న సంసద్‌ ర్యాలీ ఉద్రిక్తతకు దారితీయానికి వీళ్లే కారణం. వీళ్లను గుర్తించేందుకు ఫేíషియల్‌ రికగ్నిషన్‌ టెక్నాలజీ, నిఘా సాధనాలను ఉపయోగించాల్సి వచ్చింది’’అని తెలిపారు. దీనిపై కోర్టు స్పష్టతనిచ్చింది. ఫేíషియల్‌ రికగ్నిషన్‌ టెక్నాలజీ, నిఘా, ప్రైవసీ అనే అంశాలు ఈ కేసులో ఉల్లంఘనకు గురయ్యాయా లేదా అనేవి కమిటీ నిర్ణయించదు. కోర్టు నిర్ణయిస్తుంది’’అని ధర్మాసనం స్పష్టంచేసింది.

సమర్ధించుకున్న ఢిల్లీ పోలీసులు  
విద్యార్థుల నిరసనల సందర్భంగా పోలీసులు అతిగా బలప్రయోగం చేశారన్న ఆరోపణలను ఢిల్లీ పోలీసులు తోసిపుచ్చారు. ఈ మేరకు సుప్రీంకోర్టుకు డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ సచిన్‌ శర్మ కౌంటర్‌ అఫిడవిట్‌ సమరి్పంచారు. ‘‘ఆరోజు జంతర్‌మంతర్‌ వద్ద 30,000 మందికిపైగా నిరసనకారులు గుమిగూడారు. సంసద్‌ ర్యాలీకి అనుమతి లేదు. విద్యార్థులను నియంత్రించేందుకు సుమారు 5 వేల మంది పోలీసు సిబ్బంది విధుల్లో ఉన్నారు. బారికేడ్లు తోసేసి పార్లమెంట్‌ దిశగా దూసుకొస్తున్న నిరసనకారులను నిలువరించగా తోపులాట జరిగింది.

ఈ ఘటనలో 240 మందికిపైగా పోలీసులు గాయపడ్డారు. 200 మంది పౌరులు, నిరసనకారులు సైతం గాయపడ్డారు. ఉద్యమంలో సంఘవిద్రోహ శక్తులు, నేరచరితులు చొరబడ్డారు. వీరిలో 2,873 మందిపై గతంలోనే క్రిమినల్‌ కేసులు ఉన్నాయి’’అని పోలీసులు తెలిపారు. నిరసనల సమయంలో సాధారణ దుస్తుల్లో లాఠీలతో కనిపించిన పోలీసు సిబ్బందికి సంబంధించిన వీడియోలపై కూడా ఢిల్లీ పోలీసులు వివరణ ఇచ్చారు.

ఇలా సాధారణ దుస్తుల్లో పోలీసులను గుంపుల్లో కలిపి విధులు నిర్వహించడం చట్టవిరుద్ధం కాదని, అసాధారణమైన చర్య కూడా కాదని పేర్కొన్నారు. పార్లమెంట్, రాష్ట్రపతిభవన్, సేవా తీర్థ్, కర్తవ్యభవన్, ఇతర కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, కేంద్ర మంత్రుల అధికారిక నివాసాలున్న ఆ ప్రాంతంలో అవాంఛనీయ ఘటన జరక్కుండా తాము సరైన నిర్ణయమే తీసుకున్నట్లు పోలీసులు తమ చర్యను 
సమర్ధించుకున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement