సీఈసీ ఏకపక్ష నిర్ణయాలా.. సుప్రీం సీరియస్‌ | Supreme Court Refuses to Pass Interim Order to Suspend CEC Gyanesh Kumar | Sakshi
Sakshi News home page

సీఈసీ ఏకపక్ష నిర్ణయాలా.. సుప్రీం సీరియస్‌

Oct 5 2026 1:22 PM | Updated on Oct 5 2026 1:45 PM

Supreme Court Refuses to Pass Interim Order to Suspend CEC Gyanesh Kumar

న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌ను తాత్కాలికంగా సస్పెండ్ చేయాలన్న పిటిషన్లపై సుప్రీంకోర్టు సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు నిరాకరించింది. అయితే ఎన్నికల సంఘం నిర్ణయాలు ఏకగ్రీవంగానే తీసుకున్నారా? లేక సీఈసీ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారా? అనే అంశంపై ఈసీతో పాటు సీఈసీ, ఇతర ఇద్దరు ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషీలకు నోటీసులు జారీ చేసింది.

ఏకాభిప్రాయంతోనే నిర్ణయాలా?
ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, న్యాయమూర్తులు జోయ్‌మాల్య బాగ్చీ, వి. మోహనలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లను విచారించింది. ఎన్నికల సంఘం నిర్ణయాలు సాధారణంగా ఏకాభిప్రాయంతో ఉండాలని సీజేఐ స్పష్టం చేశారు. ఏకాభిప్రాయం కుదరకపోతే మెజారిటీ ఆధారంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

సీఈసీపై ఆరోపణలేమిటి?
ప్రస్తుతం కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియలో జ్ఞానేశ్ కుమార్ ఇతర ఇద్దరు ఎన్నికల కమిషనర్ల సమ్మతి లేకుండానే కొన్ని నిర్ణయాలు తీసుకున్నారని పిటిషనర్ల ఆరోపణ. ఈ నేపథ్యంలో సీఈసీని సస్పెండ్ చేయడంతో పాటు ఆయనపై చర్యలు తీసుకోవాలని వారు సుప్రీంకోర్టును కోరారు.

14 సార్లు అభ్యంతరాలు?
‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌’లో వచ్చిన కథనాన్ని పిటిషనర్లు ప్రస్తావించారు. 2025 అక్టోబర్ నుంచి 2026 ఆగస్టు మధ్య ఎస్‌ఐఆర్‌కు సంబంధించిన పలు చర్యల విషయంలో ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషీ కనీసం 14 సందర్భాల్లో అభ్యంతరాలు నమోదు చేసినప్పటికీ, ఎన్నికల సంఘం పేరుతో నిర్ణయాలు తీసుకున్నట్లు ఆ కథనం పేర్కొంది.

రికార్డులను పరిశీలిస్తాం
కేసు విచారణ సందర్భంగా న్యాయమూర్తి జోయ్‌మాల్య బాగ్చీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సంఘం రికార్డుల్లో కొన్ని నిర్ణయాలు ఏకగ్రీవంగా తీసుకోలేదని తేలితే, వాటి అమలును నిలిపివేసి అవి చట్టపరంగా చెల్లుబాటు కావని ప్రకటించే అవకాశం ఉందని తెలిపారు. ఈ అంశంపై ఎన్నికల సంఘం సభ్యుల నుంచి వివరణ కోరారు.

సస్పెన్షన్‌కు నో.. నోటీసులతో విచారణ
అయితే ప్రస్తుత దశలో జ్ఞానేశ్ కుమార్‌ను సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి ధర్మాసనం నిరాకరించింది. ఎన్నికల సంఘం, సీఈసీ, ఇతర ఇద్దరు కమిషనర్లకు నోటీసులు జారీ చేసి వారి వివరణ కోరింది. కేసు విచారణ కొనసాగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement