అంకుల్‌.. అంకుల్‌ .. నాన్నే అమ్మని కొట్టాడు | Woman Beaten to Death by Husband in Vaishali | Sakshi
Sakshi News home page

అంకుల్‌.. అంకుల్‌ .. నాన్నే అమ్మని కొట్టాడు

Oct 5 2026 9:23 PM | Updated on Oct 5 2026 9:30 PM

Woman Beaten to Death by Husband in Vaishali

పాట్నా: అమ్మానాన్నల ముద్దుల గారాల పట్టి ఆ చిన్నారి. కానీ ఆ పసిపాపను చూసి ఆ దేవుడికి కన్ను కుట్టిందేమో! మహాలక్ష్మిలా వెలుగులు నింపాల్సిన ఆ ఇంట ఇప్పుడు తీరని విషాదాన్ని మిగిల్చింది. పుట్టినప్పుడే తండ్రిని కోల్పోయిన ఆ చిన్నారి, ఇప్పుడు కన్నతల్లిని కూడా దూరం చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ కసాయి భర్త తన భార్యను కర్రతో దారుణంగా కొట్టి చంపాడు.

అయితే ఆ రాక్షస కాండ కళ్ల ముందే జరిగినా, ఆ చిన్నారికి తన కన్నతల్లి ఇకలేదనే నిజం క్షణంలో అర్థం కాలేదు. ప్రాణం కోల్పోయి రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉన్న తల్లి శవం చుట్టూ ‘అమ్మా.. అమ్మా’ అంటూ తచ్చాడింది. ఒంటరిగా భయంతో గుక్కబెట్టి ఏడ్చింది. చివరికి ఏడుపు ఆపలేక అలసిపోయింది. ఆకలిని మరిచిపోవాలని బొమ్మలతో ఆడుకుంది.

తల్లి భౌతికకాయం వద్ద ఏమీ ఎరుగని అమాయకత్వంతో ఆ పాప బొమ్మలతో ఆడుకుంటూ కూర్చున్న దృశ్యం చూసే ప్రతి ఒక్కరి గుండెనూ పిండేస్తోంది. గుండెలను కదిలించే ఈ విషాద ఘటన బీహార్‌లోని వైశాలి జిల్లాలో వెలుగు చూసింది.

అసలేం జరిగిందంటే 
వైశాలి జిల్లా బిదుపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మధురాపూర్ ఆరవ వార్డులో ఈ దారుణం జరిగింది. సుజిత్ పాశ్వాన్ అనే వ్యక్తి తన 22 ఏళ్ల భార్య ఆశా దేవిని కర్రతో దారుణంగా కొట్టి ప్రాణాలు తీశాడు. హత్య తర్వాత నిందితుడు, అతని కుటుంబ సభ్యులంతా పరారయ్యారు. ఆ సమయంలో ఇంట్లో ఐదేళ్ల చిన్నారి అన్షిక మాత్రమే ఉంది.నాన్న అమ్మను ఎందుకు కొట్టాడో ఆ పసిదానికి తెలియలేదు. నిద్ర పుచ్చాల్సిన అమ్మ ఎంత తడుతున్నా ఎందుకు లేవడం లేదో అర్థం కాలేదు. ఇంట్లో అర్ధరాత్రి ఒక్కతే బిక్కు బిక్కుమంటూ గడిపింది. ఆకలేసింది, లేపుతుంటే అమ్మ నిద్రలేవడం లేదు. ఆకలిని తట్టుకోలేక గుక్కపెట్టి ఏడ్చింది. ఆకలి మరచిపోయేందుకు తల్లి శవం చుట్టూ బొమ్మలతో ఆడుకుంటూ అలాగే నిద్రపోయింది.

రెండో పెళ్లి.. పిల్లల కలహాలే కారణం 
మృతురాలు ఆశా దేవి, నిందితుడు సుజిత్ పాశ్వాన్‌లది రెండో వివాహం. సుజిత్ మొదటి భార్య అనారోగ్యంతో చనిపోగా.. ఆమె ద్వారా ఇద్దరు పిల్లలు ఉన్నారు. అలాగే ఆశా దేవి మొదటి భర్త కూడా చనిపోవడంతో ఆమెకు ఐదేళ్ల కూతురు అన్షిక ఉంది. పెళ్లి సమయంలోనే ఇరు కుటుంబాలకు పిల్లల విషయం తెలుసని, అయితే కొన్నాళ్ల తర్వాత పిల్లల పెంపకం విషయంలో తరచూ గొడవలు జరిగేవని కుటుంబసభ్యులు తెలిపారు.

నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్లండి 
ఆశా దేవి తల్లి తన కుమార్తె మరణాన్ని తలుచుకుంటూ గుండెలవిసేలా రోదించింది. పెళ్లయిన ఆరు నెలల వరకు అంతా బాగానే ఉంది. ఆ తర్వాత అల్లుడి ప్రవర్తన మారిపోయింది. రోజూ నా కూతురిని చిత్రహింసలకు గురిచేసేవాడు. కనీసం ఐదు రోజుల నుంచి ఆ పసి దానికి సరిగా తిండి కూడా పెట్టలేదు. నిన్న రాత్రి 9 గంటలకు ఆశా ఫోన్‌ చేసి..‘అమ్మా, నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్లండి.. లేదంటే వీళ్లు నన్ను ప్రాణాలతో ఉంచరు’ అని కన్నీరు మున్నీరుగా ఏడ్చింది. ఉదయం వస్తామని చెప్పాం. కానీ, ఇంతలోనే ఈ దారుణం జరుగుతుందని అనుకోలేదు అంటూ తల్లడిల్లింది.  

సమాచారం అందుకున్న బిదుపూర్ ఎస్‌హెచ్‌ఓ రవిప్రకాష్ తన సిబ్బందితో కలిసి వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు దర్యాప్తు ప్రారంభించారు. అన్షిక నుంచి కేసు వివరాల్ని రాబట్టేందుకు ప్రయత్నించారు. ఇందులో భాగంగా అన్షిక తన తండ్రి.. తల్లిని కర్రతో కొట్టాడని చెప్పింది. 

అంకుల్‌.. అంకుల్‌. రాత్రి మేం అన్నం తిన్నాం. తిన్న తర్వాత.. అమ్మని.. నాన్న (కర్ర వైపు చూపిస్తూ )దానితో కొట్టాడు. వెళ్లిపోయాడు. రాత్రి నాకు ఆకలేసింది. అమ్మని నిద్ర లేపుతుంటే లేవలేదు. ఈ బొమ్మలతో ఆడుకున్నాంటూ చెప్పిన అమాయక మాటలు చూపరులను కంటతడి పెట్టించాయి. క్లూస్ టీమ్ సహాయంతో సేకరించిన కీలక ఆధారాలను బట్టి దర్యాప్తు వేగవంతం చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హాజీపూర్ సదర్ ఆసుపత్రికి తరలించారు. 

ఇదీ చదవండి : ఒక్కసారిగా 9వేల అడుగుల కిందకు దిగిన మరో విమానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement