ఫ్లైదుబాయ్ విమాన ఘటన మరువకమందే మరో విమాన ప్రమాదం తృటిలో తప్పింది. లండన్ నుంచి అమెరికాలోని చికాగో బయలుదేరిన బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానం (బీఏ295) గాల్లో ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా అత్యవసర పరిస్థితి తలెత్తింది. ఐర్లాండ్ గగనతలంలో ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘటన జరగడంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు.
లండన్‌లోని హీత్రూ విమానాశ్రయం టెర్మినల్ 5 నుంచి ఉదయం 11:50 గంటల ప్రాంతంలో ఈ విమానం బయలుదేరింది. సుమారు 8 గంటల 40 నిమిషాల పాటు సాగే ఈ షెడ్యూల్డ్ ప్రయాణంలో భాగంగా బోయింగ్ 777-200ఈఆర్ విమానం సుమారు 37,000 అడుగుల ఎత్తుకు చేరుకుంది.
అయితే, ప్రయాణం ప్రారంభమైన సుమారు గంట తర్వాత ఐర్లాండ్ గగనతలంలోకి రాగానే విమానంలో ఒక్కసారిగా అత్యవసర పరిస్థితి తలెత్తింది. ఫ్లైట్ ట్రాకింగ్ డేటా ప్రకారం.. విమానం ఏకంగా 37,000 అడుగుల ఎత్తు నుంచి ఒక్కసారిగా వేగంగా కిందకు దిగి.. దాదాపు 9,000 అడుగుల ఎత్తుకు పడిపోయింది.
అత్యవసర సంకేతాలు.. లండన్‌కు మళ్లింపు
విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో పైలట్లు వెంటనే అప్రమత్తమై అంతర్జాతీయ అత్యవసర ట్రాన్స్‌పాండర్ కోడ్ ‘స్పావాక్ 7700’ను జారీ చేశారు. ఈ హఠాత్పరిణామంతో చికాగో వెళ్లాల్సిన ప్రయాణాన్ని అర్ధాంతరంగా నిలిపివేశారు. విమానాన్ని వెనక్కి మళ్లించారు. ప్రస్తుతం ఈ విమానం సురక్షితంగా లండన్ హీత్రూ విమానాశ్రయానికి తిరిగి వస్తున్నట్లు యూకే మీడియా తెలిపింది.
అయితే, విమానంలో అసలు ఏ విధమైన సాంకేతిక లోపం తలెత్తిందనే దానిపై బ్రిటిష్ ఎయిర్‌వేస్ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక స్పష్టత రాలేదు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి : ఫ్లైదుబాయ్ విమానం.. ఆ చిన్నారి లేకపోతే ఎంత ఘోరం జరిగేదో?


