ఘోర ప్రమాదం.. కుప్పకూలిన రష్యా అణు బాంబర్‌ విమానం! | Russian nuclear capable strategic bomber crashed | Sakshi
Sakshi News home page

ఘోర ప్రమాదం.. కుప్పకూలిన రష్యా అణు బాంబర్‌ విమానం!

Sep 30 2026 2:15 PM | Updated on Sep 30 2026 2:23 PM

Russian nuclear capable strategic bomber crashed

మాస్కో: రష్యాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. అణ్వాయుధాలను మోసుకెళ్లే సత్తా ఉన్న రష్యన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన శక్తివంతమైన వ్యూహాత్మక బాంబర్ విమానం అమూర్ ప్రాంతంలో కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు సిబ్బంది మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

రష్యాలోని అమూర్  ప్రాంతంలో రష్యన్ సైన్యానికి చెందిన ప్రసిద్ధ టుపోలెవ్‌ టీయూ-95ఎంఎస్‌ (Tupolev Tu-95MS) బాంబర్ విమానం సాధారణ శిక్షణ నిమిత్తం టేకాఫ్ అయింది. ఉక్రెయిన్‌తో ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ, ఈ విమానం ఎలాంటి ఆయుధాలను లేదా అణ్వాయుధాలను మోసుకెళ్లట్లేదని రష్యా రక్షణ శాఖ స్పష్టం చేసింది.

అమూర్ ప్రాంతంలోని ఉక్రైంకా వైమానిక స్థావురం నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే ఈ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. క్రాస్నోయారోవో గ్రామం సమీపంలో జనావాసాలకు దూరంగా ఉన్న నిర్మానుష్య ప్రాంతంలో ఇది కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న ఆరుగురు సిబ్బంది ప్రాణాలు కోల్పోగా, మరో వ్యక్తి తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. అతన్ని వెంటనే రక్షించి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

విమానం జనావాసాల మధ్య కాకుండా నిర్మానుష్య ప్రాంతంలో కూలడంతో పెను ప్రమాదం తప్పిందని, నేలపై ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరగలేదని స్థానిక అధికారులు తెలిపారు. పైలట్లు చివరి నిమిషం వరకు విమానాన్ని నియంత్రించేందుకు శ్రమించినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదానికి ఖచ్చితమైన కారణాలపై రక్షణ శాఖాధికారులు హై లెవల్ విచారణకు ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement