సీఎం ప్రజావాణిలో బాధిత కుటుంబ సభ్యుల వినతి
విజయలక్ష్మికి వినతి పత్రం అందజేస్తున్న బాధిత కుటుంబ సభ్యులు
హైదరాబాద్: రష్యా యుద్ధభూమిలో చిక్కుకున్న ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన నలుగురిని సురక్షితంగా రప్పించాలని బాధిత కుటుంబసభ్యులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మంగళవారం ప్రజాభవన్‌లో సీఎం ప్రజావాణి రాష్ట్ర ఇన్‌చార్జ్ గద్వాల్ విజయలక్ష‍్మీకి కుటుంబ సభ్యులు వినతిపత్రం అందజేశారు.
భుక్యా రవీందర్, సిర్షు అశోక్, మెగావత్ ప్రకాష్, మహమ్మద్ అఫ్జల్ ఖాన్ సుమారు ఏడు నెలల క్రితం ఉపాధి కోసం రష్యా వెళ్లారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఏజెంట్ల చేతిలో మోసపోయి రష్యా సైన్యంలో చేరాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. రాయబార కార్యాలయం అధికారులతో మాట్లాడి సురక్షితంగా రప్పిస్తామని విజయలక్ష్మి వారికి భరోసా కల్పించారు.
కాగా, ప్రజాభవన్‌లో మంగళవారం నిర్వహించిన సీఎం ప్రజావాణికి 16 గ్రూపులు, 196 మంది ద్వారా 160 దరఖాస్తులు అందాయి. ప్రధానంగా రెవెన్యూ శాఖకు 40, బీసీ సంక్షేమ శాఖ 27, మున్సిపల్ శాఖ 19, ఇతర శాఖలకు 74 దరఖాస్తులు అందాయి. కార్యక్రమంలో స్టేట్ నోడల్ అధికారి విద్యాసాగర్, డిప్యూటీ కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఏసీపీ ఉమేందర్, ఎన్.ఆర్.ఐ. సలహామండలి వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి, సభ్యులు స్వదేశ్ పరికిపండ్ల, అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: సోషల్ మీడియాలో కొత్త కార్పొరేషన్ల సందడి..


