పాలనపై నిత్యం వీడియోలు, కంటెంట్‌తో వివరణలు
అధికారుల పర్యటనల నుంచి చెత్త వేరు చేయడం వరకు పోస్టులు
ఏఐ షార్ట్‌ఫిలిమ్స్‌తో అవగాహన
ఎప్పటికప్పుడు ప్రజలకు చేరువయ్యేలా ప్రణాళిక
సిటిజన్ కమ్యూనికేషన్‌లో సీఎంసీ, ఎంఎంసీ కొత్త ఒరవడి
జీహెచ్‌ఎంసీ మాత్రం వెనుకే?
సాక్షి, హైదరాబాద్: నగర పాలనలో మార్పు..సోషల్ మీడియాలోనూ కనిపిస్తోంది. కొత్తగా ఏర్పడిన సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ), మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ)లు ఆధునిక ప్రచార పద్ధతులకు ప్రాధాన్యమిస్తూ తమ కార్యకలాపాలను ప్రజల్లోకి ఆసక్తిగా తీసుకెళ్తున్నాయి. అధికారుల క్షేత్రస్థాయి పర్యటనలు, పారిశుద్ధ్య కార్యక్రమాలు, చెత్త వేరు చేయడం, దోమల నివారణ, స్వచ్ఛత కార్యక్రమాలు, పౌర స్పృహ కలిగించే అంశాలు, తదితరమైన వాటిని సోషల్ మీడియా వేదికల ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేస్తున్నాయి.
సైబరాబాద్ కార్పొరేషన్‌లో ‘వన్‌వార్డ్ ఎవ్రీ డే’ కార్యక్రమం ద్వారా కమిషనర్ నేరుగా వార్డుల్లో పర్యటించడం, ప్రజల సమస్యలను తెలుసుకోవడం వంటి అంశాలను కూడా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.
రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు, పారిశుద్ధ్యం, పార్కులు, నీటి సరఫరా వంటి సమస్యలపై ప్రజలతో జరిగిన చర్చలను సీఎంసీ పోస్టుల రూపంలో అందుబాటులో ఉంచుతోంది.
గణేశ్ నిమజ్జన సమయంలో వివిధ ప్రాంతాల్లో ఏర్పాట్లు, పూల వ్యర్థాల ప్రత్యేక సేకరణ, వాటిని అగర్‌బత్తీలు, ధూపాల తయారీకి వినియోగించే విధానంపైనా ప్రచారం చేసింది. దీనికి పౌరుల నుంచి మంచి స్పందన లభించింది. వీటిని చాలామంది ఆసక్తిగా తిలకించి ప్రశంసలు..సూచనలు, సలహాలు అందచేశారు.
మల్కాజిగిరి కార్పొరేషన్‌న్‌కూడా ఇదే బాటలో ముందుకు సాగుతోంది. చెత్తను నాలుగు రకాలుగా వేరు చేయడం, రీసైక్లింగ్, స్వచ్ఛత వంటి అంశాలను ఆకట్టుకునే గ్రాఫిక్స్, వీడియోలతో వివరిస్తోంది. కొన్ని అవగాహన కార్యక్రమాలపై ఏఐతో వీడియోలు రూపొందించి పోస్టు చేస్తోంది.
‘పోస్ట్’ నుంచి ‘ప్రజలతో సంభాషణ’ వరకు!
నగర పాలనలో సోషల్ మీడియా కేవలం అధికారుల పర్యటనల ఫొటోలు పెట్టే వేదిక మాత్రమే కాదనే సంకేతాలూ కనిపిస్తున్నాయి. సమస్య ఏంటి? ప్రజలు ఏం చేయాలి? కార్పొరేషన్ ఏం చేస్తోంది? అనే మూడు ప్రశ్నలకు ఒక చిన్న వీడియోలోనే సమాధానం చెప్పే ప్రయత్నం జరుగుతోంది. కొత్తగా ఏర్పడిన సీఎంసీ, ఎంఎంసీలు కాలానికి తగ్గట్టుగా ఈ మార్పును అందిపుచ్చుకుంటున్నాయి.
సోషల్ నియామకాలు సైతం..
సోషల్ మీడియా నిర్వహణను మరింత ప్రొఫెషనల్‌గా చేయడానికి సోషల్ మీడియా మేనేజర్, కెమెరామెన్, వీడియో ఎడిటర్, తెలుగు కంటెంట్ రైటర్, గ్రాఫిక్ డిజైనర్, వాయిస్‌ఓవర్ ఆరి్టస్టులను సైతం ఈ కార్పొరేషన్లు నియమించుకుంటున్నాయంటే వీటికి ఎంత ప్రాధాన్యం ఇస్తున్నాయో అంచనా వేసుకోవచ్చు. పెద్ద కార్పొరేషన్ అయిన జీహెచ్‌ఎంసీ ఇప్పటికే ఉన్న విస్తృత డిజిటల్ రీచ్‌కు తోడు, త్వరితంగా..సృజనాత్మకతతో కూడిన ప్రజలకు చేరువయ్యే కంటెంట్ పెంచితే నగర పాలన–ప్రజల మధ్య డిజిటల్ దూరం తగ్గే అవకాశం ఉంది.
డిజిటల్ ఫాలోయింగ్ ఉన్నా..
మూడు కార్పొరేషన్లలో అతిపెద్దదైన జీహెచ్‌ఎంసీకి భారీ డిజిటల్ ఫాలోయింగ్ ఉంది. దాని అధికారిక ఎక్స్ ఖాతాకు దాదాపు 4 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. పారిశుద్ధ్యం, మాన్‌సూన్ డ్రైవ్, ప్రజారోగ్యం, వ్యర్థాల నిర్వహణ వంటి అంశాలపై జీహెచ్‌ఎంసీ కూడా క్రమం తప్పకుండా పోస్టులు పెడుతోంది. కానీ, కొత్త కార్పొరేషన్లలో కనిపిస్తున్న ప్రత్యేకత..కార్యక్రమం జరిగిందని చెప్పడానికే కాకుండా, దాన్ని చిన్న వీడియోగా మార్చి ప్రజలకు అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం..ముఖ్యంగా ఏఐ ఆధారిత షార్ట్‌ఫిలిమ్స్, ఆకట్టుకునే విజువల్స్, చిన్న సందేశాలు యువతను లక్ష్యంగా చేసుకున్న పోస్టులు వంటివి జీహెచ్‌ఎంసీలో కనిపించడం లేదు. సాధారణ ప్రకటనలు సైతం సకాలంలో అందించడంలో వెనుకబడుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదీ చదవండి: మెడికల్ పీజీ సీట్లకు లైన్ క్లియర్!


