మెడికల్‌ పీజీ సీట్లకు లైన్‌ క్లియర్‌! | NMC releases latest seat matrix | Sakshi
Sakshi News home page

మెడికల్‌ పీజీ సీట్లకు లైన్‌ క్లియర్‌!

Sep 30 2026 5:40 AM | Updated on Sep 30 2026 5:40 AM

NMC releases latest seat matrix

ఎన్‌ఎంసీ తాజా సీట్‌ మ్యాట్రిక్స్‌ విడుదల

సాక్షి, హైదరాబాద్‌: నీట్‌ పీజీ–2026 కౌన్సెలింగ్‌లో కీలక ముందడుగు పడింది. 2026–27 విద్యా సంవత్సరానికి పీజీ మెడికల్‌ కోర్సుల్లో ఆమోదించిన సీట్లతో తాజా సీట్‌ మ్యాట్రిక్స్‌ను నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ)లోని మెడికల్‌ అసెస్‌మెంట్‌ అండ్‌ రేటింగ్‌ బోర్డు (ఎంఏఆర్‌బీ) మంగళవారం విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఎన్‌ఎంసీ, నేషన ల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ఇన్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎన్‌బీఈఎంఎస్‌) పరిధిలో కలిపి 86,360 పీజీ మెడికల్‌ సీట్లు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ఇప్పటికే వెల్లడించింది. రాష్ట్రాల వారీగా చూస్తే తెలంగాణలో మొత్తం 5,248 పీజీ సీట్లు ఉన్నాయి. ఇందులో 1,790 ప్రభుత్వ, 3,458 ప్రైవేటు సీట్లు ఉన్నాయి. 

కర్ణాటకలో 10,092, మహారాష్ట్రలో 9,216, తమిళనాడులో 8,023, ఉత్తరప్రదేశ్‌లో 7,437 పీజీ సీట్లు ఉన్నాయి. తెలంగాణ ఈ రాష్ట్రాల తర్వాతి స్థానంలో ఉంది. ప్రస్తుత సీట్‌ మ్యాట్రిక్స్‌లో ఇప్పటికే ఆమోదించిన పీజీ కోర్సు లు, సీట్లనే పొందుపరిచినట్లు ఎన్‌ఎంసీ స్పష్టం చేసింది. ఇప్పటికే ఉన్న కోర్సుల్లో సీట్ల పెంపు, కొత్త పీజీ కోర్సుల ప్రారంభానికి వచ్చిన దరఖాస్తులను ఈ మ్యాట్రిక్స్‌లో చేర్చలేదు. వాటికి తర్వాత అనుమతులు లభిస్తే సవరించిన సీట్‌ మ్యాట్రిక్స్‌లో పొందుపరుస్తారు. 

అప్పీల్‌ కమిటీ లేదా ఇతర సమ ర్థ సంస్థల నిర్ణయాల మేరకు కూడా మ్యాట్రిక్స్‌లో మార్పులు చేసే అవకాశం ఉంది. ఎంఏఆర్‌బీ ఆమోదించిన సీట్ల సంఖ్యకు మించి విద్యార్థులను చేర్చుకోవద్దని ఎన్‌ఎంసీ మెడికల్‌ కాలేజీలను ఆదేశించింది. సీట్‌ మ్యాట్రిక్స్‌లో ఏవైనా తప్పులు లేదా వ్యత్యాసాలు కనిపిస్తే కౌన్సెలింగ్‌ ప్రారంభానికి ముందే ఎంఏఆర్‌బీ దృష్టికి తీసుకెళ్లాలని కాలేజీలు, కౌన్సెలింగ్‌ కమిటీలకు సూచించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement