ఫోన్ ట్యాపింగ్ కేసులో తుది చార్జిషీట్ సిద్ధం.. నిందితుల జాబితాలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు
ప్రధాన నిందితుడిగా కొనసాగనున్న ప్రభాకర్‌రావు.. త్వరలో సీఎం రేవంత్‌రెడ్డి నుంచి వాంగ్మూలం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్‌ఐబీ) కేంద్రంగా సాగిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తును స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) పూర్తి చేసింది. ప్రస్తుతం న్యాయ నిపుణులు, ముఖ్యమంత్రి కార్యాలయం పరిశీలనలో ఉన్న తుది అభియోగపత్రాలను అక్టోబర్ 6 లేదా 9న నాంపల్లి కోర్టులో దాఖలు చేయనున్నట్లు తెలిసింది. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కీలక నేత హరీశ్‌రావుతోపాటు ఎమ్మెల్సీ నవీన్‌రావులను నిందితుల జాబితాలో చేర్చారు. ఇప్పటికే ఓ మాజీ డీజీపీ, ప్రస్తుత డీజీ స్థాయి అధికారుల నుంచి వాంగ్మూలాలు నమోదు చేసిన సిట్ అధికారులు త్వరలో సీఎం రేవంత్‌రెడ్డి నుంచి సాక్షిగా వాంగ్మూలం నమోదు చేయనున్నారని సమాచారం. రేవంత్‌రెడ్డి ఎంపీగా, పీసీసీ చీఫ్‌గా ఉన్నప్పుడు పలుమార్లు ఫోన్ ట్యాపింగ్‌పై వ్యాఖ్యలు చేశారు. తన ఫోన్‌ను ప్రభుత్వం ట్యాప్ చేసిందని అనేక బహిరంగ సభల్లో ఆరోపించారు. సిట్ దర్యాప్తులోనూ దీనికి సంబంధించి కీలక ఆధారాలు లభించాయి. ఈ నేపథ్యంలోనే ఆయన నుంచి వాంగ్మూలం నమోదు చేయడం అనివార్యమని సిట్ నిర్ణయించింది.
4,013 మందిపై నిఘా
గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు 2023 నవంబర్ 15 నుంచి 30 మధ్య జరిగిన ట్యాపింగ్‌పైనే అ«ధికారులు ప్రధానంగా దృష్టి పెట్టారు. ఈ కాలంలో మొత్తం 4,013 మందిపై ఎస్‌ఐబీ నిఘా ఉంచినట్లు సిట్ దర్యాప్తులో తేలింది. వీరిలో 618 మంది సంభాషణల్ని రికార్డు చేసినట్లు దర్యాప్తు అధికారులు ఆధారాలు సేకరించారు. వీటి ఆధారంగానే ఎస్‌ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావును ప్రశ్నించారు. తాను అప్పటి డీజీపీ, నిఘా విభాగం అధిపతి ఆదేశాల మేరకు పని చేశానని చెప్పారు. ఈ నేపథ్యంలోనే నాటి అదనపు డీజీ వాంగ్మూలాలనూ సేకరించారు. గతంలో సీఎంఓ, హోంశాఖల్లో పని చేసిన వారి నుంచి వివరాలు సేకరించారు. దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన అంశాల ఆధారంగా వందల మంది సాక్షుల నుంచి వాంగ్మూలాలు నమోదు చేశారు. ఇవన్నీ క్రోడీకరించి నిందితుల తుది జాబితాను రూపొందించారు.
ఆ సమయంలో ఐజీ ర్యాంకులో అనేక మంది అధికారులు అందుబాటులో ఉన్నా ప్రభాకర్‌రావును కీలక పోస్టులో కొనసాగించడం, ఆయనకు పదేపదే ఎక్స్‌టెన్షన్ ఇవ్వడాన్ని క్విడ్ ప్రొకోగా సిట్ పరిగణిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ ఎక్స్‌టెన్షన్‌కు బాధ్యుడిగా నాటి సీఎం కేసీఆర్‌ను నిందితుల జాబితాలో చేర్చింది. మరోపక్క 2018 డిసెంబర్ నుంచి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న కేటీఆర్ ట్యాపింగ్ ద్వారా ఎలక్టోరల్ బాండ్లు ఖరీదు చేయించారని ఆరోపిస్తున్న సిట్.. ఆయన్ను నిందితుడిగా చేర్చింది. సిద్ధిపేట, ఇతర ఎన్నికలకు సంబంధించి కొన్ని ఫోన్ నంబర్లను ట్యాపింగ్‌కు సిఫార్సు చేశారనే ఆరోపణలపై హరీశ్‌రావు, నవీన్‌రావులను నిందితులుగా పేర్కొంది.
జాబితాలో జాగ్రత్తలు...
ఈ కేసులో ఆది నుంచి ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్‌రావును అలాగే కొనసాగించనున్నారు. ప్రణీత్‌రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్‌రావు సైతం నిందితులుగా ఉంటారు. తుది చార్జిషీట్ దాఖలైన తర్వాత ట్యాపింగ్ కేసులో డిశ్చార్జ్ పిటిషన్లు, క్వాష్ పిటిషన్లు దాఖలయ్యే అవకాశం ఉందని, ఈ వ్యవహారం సుప్రీం కోర్టు వరకు వెళ్తుందని అంచనా వేస్తున్న సిట్.. చార్జిషీట్, నిందితుల జాబితాల విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటోంది. వాస్తవానికి గత జూలై 27 నాటికే తుది చార్జిషీట్ దాఖలు చేయాలని భావించినప్పటికీ ఫోరెన్సిక్ నివేదికల్లో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలతో మరింత దర్యాప్తు సాగించాల్సి రావడంతో ఆలస్యమైంది. ఈ కేసు నమోదైన తొలినాళ్లల్లో సినీ రంగం, వ్యాపార రంగాలకు సంబంధించి అనేక ఆరోపణలు వచ్చినప్పటికీ వాటికి ఆధారాలు లభించలేదని తెలిసింది.


