ఇస్తామన్నప్పుడు స్పందించలేదు
పెరిగిన చార్జీలు పెంచమంటే వెనక్కి వెళ్లారు
రాష్ట్ర ఇంధన శాఖ తీరుపై కోల్ ఇండియా ఆగ్రహం
ఇంధనశాఖ ఉన్నతాధికారులతో సీఎస్ సమావేశం
సాక్షి, హైదరాబాద్: థర్మల్ ప్లాంట్లకు స్వదేశీ బొగ్గు తెచ్చేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధిగా ప్రయత్నించడం లేదని కోల్ ఇండియాతో చర్చల తర్వాత స్పష్టమైంది. కోల్ ఇండియా బొగ్గు లింకేజ్ సమావేశం సోమవారం ఢిల్లీలో జరిగింది. ఈ సమావేశానికి జెన్‌కో సీఎండీ హరీశ్ హాజరయ్యారు. రాష్ట్రానికి బొగ్గు ఆవశ్యకతపై కోల్ ఇండియాతో అధికారులు చర్చలు జరిపారు. అయితే ఇప్పటికిప్పుడు బొగ్గు అందించలేమని కోల్ ఇండియా చెప్పినట్టు సమాచారం.
రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరుగుతోందని, థర్మల్ ప్లాంట్ల వద్ద బొగ్గు కొరత తీవ్రంగా ఉందని అధికారులు కోల్ ఇండియా దృష్టికి తెచ్చారు. మూడు వారాలకు సరిపడా నిల్వలు ఉండాల్సిన పరిస్థితిలో, కేవలం మూడు, నాలుగు రోజులకు సరిపడా నిల్వలు మాత్రమే ఉంటున్నాయని తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని మహానది కోల్‌ఫీల్డ్స్ నుంచి బొగ్గు అందించాలని కోరారు.
ఇప్పుడా అడిగేది?
జెన్‌కో ప్రతిపాదనపై కోల్ ఇండియా నిస్సహాయత వ్యక్తం చేసినట్టు అధికార వర్గాలు అంటున్నాయి. బొగ్గు తీసుకోవడంపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా ఉన్నట్టు లేదని, కేవలం లేఖలు రాయడంతోనే సరిపెడుతోందని వ్యాఖ్యానించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఎంసీఎల్ బొగ్గు వ్యవహారంలో గతంలో తాము వివరణ ఇచ్చినట్టు జెన్‌కో అధికారుల దృష్టికి తెచ్చినట్టు తెలిసింది.
రవాణా ఖర్చులు పెరగడంతో పాత ధరలకు బొగ్గు ఇవ్వలేమని, మారిన ధరలకు సరఫరా చేస్తామని ఎంసీఎల్ స్పష్టం చేసిన విషయాన్ని ప్రస్తావించినట్టు తెలిసింది. ఆరు నెలల క్రితం బొగ్గుపై వివరణ ఇచ్చినప్పుడు ఎందుకు స్పందించలేదని నిలదీసినట్టు సమాచారం. దేశవ్యాప్తంగా బొగ్గు డిమాండ్ పెరిగిందని, తెలంగాణ నుంచి సరైన సమయంలో స్పందన లేకపోవడం వల్లే ఇతర రాష్ట్రాలకు బొగ్గు సరఫరా ఒప్పందాలు చేసుకోవాల్సి వచ్చిందని కోల్ ఇండియా స్పష్టంచేసినట్లు సమాచారం. ఇప్పటికిప్పుడు బొగ్గు ఇవ్వడానికి తమ వద్ద కూడా ఉండాలి కదా? అని వ్యాఖ్యానించినట్టు తెలిసింది.
నైనీ బొగ్గుపై మల్లగుల్లాలు
సింగరేణి ధరలకే నైనీ బొగ్గు లభించే అవకాశం ఉందని జెన్‌కో అధికారులు అంటున్నారు. ఒడిశాలో ఉన్న నైనీ బొగ్గు గనుల్లో కేవలం 50 మీటర్ల లోతులోనే బొగ్గు లభ్యమవుతుంది. దీనివల్ల తక్కువ ధరకే బొగ్గు లభిస్తుంది. అయితే, యాదాద్రి వరకూ చేరవేయడానికి రవాణా ఖర్చులు పెరుగుతాయి. ఇవన్నీ కలుపుకున్నా, ప్రస్తుతం సింగరేణి అందించే బొగ్గు ఖరీదులోనే ఉంటుందని అధికారులు అంటున్నారు. దీనికి ఇంధనశాఖ వర్గాలు మోకాలడ్డుతున్నాయని తెలిసింది. నైనీ నుంచి బొగ్గు తేవడం కష్టమైన పని అని, పైగా రైల్వే నెట్‌వర్క్ సరిగా లేకపోవడం వంటి సమస్యలను ముందుకు తెస్తున్నారు.
సీఎస్‌తో సమాలోచనలు
ఢిల్లీ పరిణామాలను ఇంధన శాఖ ఉన్నతాధికారులు మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజుకు వివరించారు. థర్మల్ కేంద్రాల్లో బొగ్గు కొరత పెరుగుతోందని, సింగరేణికి రూ.24 వేల కోట్ల బకాయిలు ఉన్నాయని, దీనితోపాటు సింగరేణి విద్యుత్ బకాయిలు కూడా రూ. 15 వేల కోట్ల వరకూ ఉన్నాయని చెప్పారు. ఈ పరిస్థితుల్లో సింగరేణి వద్ద నాణ్యమైన బొగ్గు ఉన్నప్పటికీ డిమాండ్ చేసి అడిగే అవకాశం లేకుండా పోయిందని నిస్సహాయత వ్యక్తం చేశారు. మరోవైపు ఎంసీఎల్‌ను ఆరు నెలల క్రితం సీరియస్‌గా సంప్రదించి ఉంటే బొగ్గు అందేదని, ఇప్పుడు ఇవ్వడానికి కోల్ ఇండియా అనుమతించే పరిస్థితి కన్పించడం లేదని సీఎస్ దృష్టికి తెచ్చినట్టు తెలిసింది. పరిస్థితిని ముఖ్యమంత్రికి వివరించి, నిర్ణయం తీసుకోవాల్సి ఉందని సీఎస్ అన్నట్టు సమాచారం.


