న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ(బీజేపీ) మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలిగా ఛత్తీస్‌గఢ్‌కు చెందిన రూప్ కుమారి చౌదరి (50) నియమితులయ్యారు. ఆమె ప్రస్తుతం లోక్‌సభలో మహాసముంద్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2024 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తమర్‌ధ్వజ్ సాహుపై లక్షా 45 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
రూప్ కుమారి చౌదరి (Rupkumari Choudhary).. బీజేపీలో కార్యకర్త స్థాయి నుంచి మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలిగా ఎదిగారు. ఆమె గతంలో జిల్లా పంచాయతీ సభ్యత్వంతో సహా పలు క్షేత్రస్థాయి పదవులను నిర్వహించారు. 2019లో బీజేపీ మహాసముంద్ జిల్లా అధ్యక్షురాలిగా పనిచేశారు. 2013 ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలలో బస్నా నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఎన్నికల రాజకీయాల్లోకి ప్రవేశించారు. కాంగ్రెస్ అభ్యర్థి దేవేంద్ర బహదూర్ సింగ్‌ను 6,239 ఓట్ల తేడాతో ఓడించి ఆ స్థానాన్ని గెలుచుకున్నారు.
చదవండి: ధర్మేంద్ర ప్రధాన్‌కు కీలక పదవి?
తనపై ఎటువంటి క్రిమినల్ కేసులు లేవని 2024 ఎన్నికల అఫిడవిట్‌లో రూప్ కుమారి చౌదరి పేర్కొన్నారు. తనకు రూ. 5.39 కోట్ల ఆస్తులు ఉన్నాయని వెల్లడించారు. రూ. 21.1 లక్షల అప్పులు ఉన్నట్టు తెలిపారు.
వ్యక్తిగత వివరాలు
పూర్తి పేరు: రూప్ కుమారి చౌదరి
పుట్టిన తేదీ: 5 జూలై 1976
పుట్టిన ప్రదేశం: ధనపాలి, మహాసముంద్ జిల్లా, ఛత్తీస్‌గఢ్
తల్లిదండ్రులు: ఖేమ్‌రాజ్ పటేల్, తీర్థకున్వర్ పటేల్
పార్టీ: భారతీయ జనతా పార్టీ (బీజేపీ)
విద్యార్హత: ఎంఏ (రాజనీతి శాస్త్రం)
పండిట్ రవిశంకర్ శుక్లా విశ్వవిద్యాలయం, రాయ్‌పూర్
వివాహ తేదీ : 01 ఏప్రిల్ 1993
భర్త పేరు : ఓం ప్రకాష్ చౌదరి
భర్త వృత్తి: వ్యవసాయం
సంతానం: కొడుకు, ఇద్దరు కుమార్తెలు


