ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్‌కు కీల‌క ప‌ద‌వి? | Nitin Nabin new team: Names of Dharmendra Pradhan, Smriti Irani doing the rounds | Sakshi
Sakshi News home page

ప్ర‌ధాన్‌కు బీజేపీలో కీల‌క ప‌ద‌వి?

Aug 17 2026 3:07 PM | Updated on Aug 17 2026 3:15 PM

Nitin Nabin new team: Names of Dharmendra Pradhan, Smriti Irani doing the rounds

నితిన్ నబిన్ టీమ్‌పై ఉత్కంఠ 

సీనియ‌ర్ల‌కు కీలక పదవులు

భారీ మార్పులపై ఊహాగానాలు

న్యూఢిల్లీ: జెన్ జీ పోరాటంతో కేంద్ర మంత్రి ప‌ద‌వి కోల్పోయిన‌ ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్‌కు బీజేపీలో కీల‌క ప‌ద‌వి ద‌క్క‌నుందని వార్త‌లు వ‌స్తున్నాయి. జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఆయ‌న‌ను నియమించే అవకాశం ఉందని జాతీయ మీడియాలో ఊహాగానాలు వెలుడుతున్నాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఆధ్వర్యంలో ఏర్పడబోయే కొత్త టీమ్‌పై పెద్ద ఎత్తున చర్చలు జ‌రుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ప‌లువురు సీనియ‌ర్ నాయ‌కుల‌కు పార్టీలో కీల‌క ప‌ద‌వులు ద‌క్కనున్నాయ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

బీజేపీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. సీనియర్ నేతలు సతీష్ పూనియా, ధర్మేంద్ర ప్రధాన్, అనురాగ్ ఠాకూర్, స్మృతి ఇరానీలకు పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. మధ్యప్రదేశ్ మాజీ బీజేపీ అధ్యక్షుడు వీడీ శర్మకు కూడా పెద్ద బాధ్యత దక్కవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అది బీజేపీ సంస్థాగత వ్యవస్థలో కావొచ్చు లేదా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంత్రివర్గంలో కావొచ్చని సమాచారం. త్రిపుర మాజీ ముఖ్యమంత్రి బిప్లబ్ దేవ్ పేరు కూడా కీలక పదవి కోసం పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఆ జాబితాపైనే ప్రధాన దృష్టి!
నితిన్ నబిన్ కొత్త టీమ్‌లో అత్యంత కీలకమైన మార్పులు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శుల విషయంలో ఉండే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం బీజేపీకి ఏడుగురు జాతీయ ప్రధాన కార్యదర్శులు ఉన్నారు. వీరిలో అరుణ్ సింగ్, దుష్యంత్ గౌతమ్, వినోద్ తావ్డే, తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, రాధామోహన్ దాస్ అగర్వాల్, బీఎల్ సంతోష్ ఉన్నారు.

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత)గా ఉన్న బీఎల్ సంతోష్ మాత్రం కొనసాగడం దాదాపు ఖాయమని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ పదవిని సాధారణంగా ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన నేతకే కేటాయిస్తారు. అయితే ఆయనకు కొత్త డిప్యూటీలను నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది. దుష్యంత్ గౌతమ్, రాధామోహన్ దాస్ అగర్వాల్‌లకు విశ్రాంతి ఇవ్వడం దాదాపు ఖాయమనే ప్రచారం జరుగుతోంది.

వారిద్ద‌రికి కీలక బాధ్యతలు?
ఇదే విభాగంలో కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్, సతీష్ పూనియాలను తీసుకురావచ్చని బీజేపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. యువత, అనుభవజ్ఞుల కలయికతో టీమ్‌ను ఏర్పాటు చేయాలన్న నితిన్ నబిన్ ఆలోచనలో భాగంగా ధర్మేంద్ర ప్రధాన్‌ను కూడా జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించే అవకాశం ఉందని సమాచారం. అయితే ఈ పేర్లపై బీజేపీ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఉత్తరాది నుంచి భాటియా పేరు!
ఉత్తర భారతదేశం నుంచి హర్యానాలోని కర్నాల్‌కు చెందిన రాజ్యసభ ఎంపీ సంజయ్ భాటియా (Sanjay Bhatia) పేరు కూడా బీజేపీ కొత్త టీమ్‌లో కీలక బాధ్యత కోసం వినిపిస్తోంది. ఆయనకు పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో ఏదైనా ముఖ్యమైన పదవి దక్కవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

చ‌ద‌వండి: ఇలా అయితే నేనే నిర‌స‌న‌కు దిగుతా.. బాబా రామ్‌దేవ్‌

మొత్తంగా చూస్తే, నితిన్ నబిన్ ఆధ్వర్యంలో బీజేపీ జాతీయ సంస్థాగత వ్యవస్థలో గణనీయమైన మార్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం వినిపిస్తున్న పేర్లు, పదవులపై ఊహాగానాలే తప్ప, తుది నిర్ణయాలు ఇంకా అధికారికంగా వెల్లడికాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement