సీఎం రమేష్‌ సంస్థకు భారీ నజరానా | AP Govt Gives BJP MP CM Ramesh a Major Contract | Sakshi
Sakshi News home page

సీఎం రమేష్‌ సంస్థకు భారీ నజరానా

Sep 29 2026 4:58 AM | Updated on Sep 29 2026 4:58 AM

AP Govt Gives BJP MP CM Ramesh a Major Contract

ఈ పనుల అంచనా వ్యయం రూ.126.25 కోట్లకు పెంపు 

తద్వారా సంస్థకు రూ.40 కోట్ల మేర ప్రయోజనమంటున్న ఇంజినీరింగ్‌ నిపుణులు 

ఈనాడు కిరణ్‌ వియ్యంకుడి సంస్థకూ పెద్ద ఎత్తున ప్రయోజనం  

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ­కు రాష్ట్ర ప్రభుత్వం భారీ నజరానా ఇచ్చింది. కుప్పం బ్రాంచి కెనాల్‌లో రమేష్ కు చెందిన రిత్విక్‌ ప్రాజెక్ట్స్‌ చేపట్టిన పనుల అంచనా వ్యయాన్ని పెంచేసి, భారీ ప్రయోజనం చేకూర్చిందని ఇంజినీరింగ్‌ నిపుణులు చెబుతున్నారు. కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌లో 0 నుంచి 66.95 కిలోమీటర్ల వరకు లైనింగ్‌ పనులను ఆర్నెల్లలో పూర్తి చేయాలనే షరతుతో 2024 డిసెంబర్‌ 14న రూ.81.43 కోట్ల అంచనాతో జలవనరుల శాఖ టెండర్లు పిలిచింది.

ఆ పనులను 85.46 కోట్ల (జీఎస్టీ, సీనరేజి వంటి పన్నులు కాకుండా)కు దక్కించుకున్న రిత్విక్‌ ప్రాజెక్ట్స్‌ సకాలంలో పూర్తి చేయలేకపోయింది. టెండర్‌ నిబంధనలను తుంగలో తొక్కుతూ ఎస్‌ఎఫ్‌ఆర్‌సీ (స్టీల్‌ ఫైబర్‌ రీయిన్‌ఫోర్స్‌డ్‌ కాంక్రీట్‌) విధానంలో లైనింగ్‌ చేశారు. అత్యంత నాసిరకంగా చేసిన ఈ లైనింగ్‌ గతేడాది కాలువలో నీటి ప్రవాహానికి ఎక్కడికక్కడ దెబ్బతింది. సకాలంలో పనులు పూర్తి చేయని రిత్విక్‌ ప్రాజెక్ట్స్‌ నుంచి లిక్విడేటెడ్‌ డ్యామేజస్‌ వసూలు చేయాలి. 

కానీ చంద్రబాబు ప్రభు­త్వం కనీసం నోటీసులు కూడా జారీ చేయలేదు. పైగా, పనుల పూర్తికి గడువును పొడిగించింది. మరోపక్క చీఫ్‌ ఇంజినీర్స్‌ కమిటీతో నివేదిక పేరుతో అదనంగా పనులు చేశారని చూపుతూ అంచనా వ్యయాన్ని రూ.99.20 కోట్ల నుంచి రూ.126.25 కోట్లకు పెంచింది. ఈ మేరకు జలవనరుల శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీనివల్ల రి త్విక్‌ ప్రాజెక్ట్స్‌ సంస్థకు రూ.40.79 కోట్ల మేర ప్రయోజనం చేకూరుతుందని చెబుతున్నారు.  

నాసిరకం పనులు చేసిన ఈనాడు కిరణ్‌ వియ్యంకుడికీ బహుమానం 
హంద్రీ–నీవా రెండో దశ ప్రధాన కాలువకు సిమెంట్‌ కాంక్రీట్‌ లైనింగ్‌ చేస్తే భూగర్బ జలాలు అడుగంటిపోతాయని, బోర్లు, బావులు ఎండిపోతాయంటూ రైతులందరూ ముక్తకంఠంతో తీవ్రంగా వ్యతిరేకించినా 216.3 కి.మీ. నుంచి 400 కి.మీ. వరకూ లైనింగ్‌ పనులకు రూ.936.70 కోట్లతో 2024 డిసెంబర్‌ 3న జలవనరుల శాఖ పరిపాలన అనుమతి ఇచ్చింది. ఇందులో రెండో ప్యాకేజీ (ప్రధాన కాలువ) 260 కి.మీ. నుంచి 300 కి.మీ. లైనింగ్‌తోపాటు 285.1 కి.మీ. నుంచి 287.1 కి.మీ. వరకు టన్నెల్‌ నిర్మాణ పనులకు రూ.158.19 కోట్లు కేటాయించింది.

గతేడాది ఈ పనులకు రూ.117.63 కోట్ల అంచనాతో పిలిచిన టెండర్లలో రూ.123.24 కోట్లకు కోట్‌ చేసిన ఈనాడు కిరణ్‌ వియ్యంకుడు రాయల రఘుకు చెందిన ఆర్వీఆర్‌ ప్రాజెక్ట్స్‌ సంస్థకు కట్టబెట్టింది. ఇక్కడ నాసి రకంగా పనులు చేయడం వల్ల ఒక సీజన్‌లో కాలువలో నీటి ప్రవాహానికే లైనింగ్‌ ఎక్కడికక్కడ దెబ్బతింది. 

కాంట్రాక్టు ఒప్పందం మేరకు ఆర్నెల్లలోగా పనులు పూర్తిచేయడంలో విఫలమైన ఆర్వీఆర్‌ ప్రాజెక్ట్స్‌ సంస్థపై చర్యలు తీసుకోవాల్సిన చంద్రబాబు సర్కారు.. పనుల పూర్తికి గడువు పొడగించడమే కాకుండా, అంచనా వ్యయా­న్ని రూ.158.19 కోట్ల నుంచి రూ.337.90 కోట్లకు పెంచేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. తద్వారా రాయల రఘు సంస్థకు పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూర్చింది. చంద్రబాబు ప్రభుత్వ డీపీటీ (దోచుకో.. పంచుకో.. తినుకో)కి ఈ రెండు ప్రాజెక్టులు మరో నిదర్శనమంటూ ఇంజినీరింగ్‌ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement