కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయం
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలో కీలక సమావేశం
సిలిగురి: పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ కొండలు, పరిసర ప్రాంతాల్లోని గూర్ఖా గుర్తింపు సమస్యకు రాజ్యాంగం పరిధిలో శాశ్వత రాజకీయ పరిష్కారం చూపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఒక ఒప్పందాన్ని రూపొందించి, విధివిధానాలను ఖరారు చేయడానికి కేంద్రం ఒక కమిటీని ఏర్పాటు చేయనుందని అధికారులు తెలిపారు.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలో గూర్ఖా నాయకులు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి, వివిధ రాజకీయ పార్టిల ప్రతినిధులతో శనివారం డార్జిలింగ్‌లో కీలక త్రైపాక్షిక సమావేశం జరిగింది. బెంగాల్‌లోని కొండ ప్రాంతాల ప్రజలకు సంబంధించిన సమస్యలతోపాటు కమిటీ ఏర్పాటుపై ఈ భేటీలో విస్తృతంగా చర్చించారు. డార్జిలింగ్ ప్రాంతంలో గూర్ఖా వర్గం ప్రజల అధిక సంఖ్యలో ఉన్నారు.
వారికి ప్రత్యేకమైన భాషా, సంస్కృతి, సంప్రదాయాలు ఉన్నాయి. తమ జాతికి రాజకీయ గుర్తింపు, స్వయంప్రతిపత్తి, రక్షణ కల్పించాలని గూర్ఖాలు సుదీర్ఘకాలంగా పోరాటం సాగిస్తున్నారు. గూర్ఖాలకు ప్రత్యేక గుర్తింపు అంశానికి శాశ్వత రాజకీయ పరిష్కారం చూపడంతోపాటు వారి డిమాండ్లను అమిత్ షా పరిగణనలోకి తీసుకున్నారని కేంద్ర హోంశాఖ శాఖ ఒక ప్రకటనలో స్పష్టంచేసింది.
తుది ఒప్పందానికి సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయడానికి మాజీ ఉప జాతీయ భద్రతా సలహాదారు, ప్రస్తుత మధ్యవర్తి అయిన పంకజ్‌కుమార్ సింగ్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు స్పష్టంచేసింది. గూర్ఖాల ఇతర డిమాండ్లన్నింటినీ సానుభూతితో పరిశీలిస్తానని అమిత్ షా హామీ ఇచ్చారని తెలియజేసింది. 2023 నుంచి 2025 వరకు డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారుగా పనిచేసిన విశ్రాంత ఐపీఎస్ అధికారి, మాజీ బీఎస్‌ఎఫ్ డైరెక్టర్ జనరల్ పంకజ్ కుమార్ సింగ్‌ను 2025 అక్టోబర్‌లో డార్జిలింగ్ కొండ ప్రాంతాల ప్రజల సమస్యల సమస్యల కోసం కేంద్ర హోంశాఖ శాఖ మధ్యవర్తిగా నియమించింది.


