మాధవ్ శింగరాజు
ఎండన పడి వచ్చిన వాళ్లకే కాదు, ఏ వేళన పడిలేస్తూ వచ్చిన వారికైనా ఎదురెళ్లి మంచినీళ్ల గ్లాసును చేతికి అందించటం భారతీయ సంస్కృతికే ప్రత్యేకమైన ఒక గొప్ప ఆతిథ్యం. నేను గుజరాతీని కాబట్టి, ఒకవేళ ఎవరైనా నాకు – ముఖ్యంగా ఆదివారం ఉదయం – అల్పాహారంగా తియ్యటి రసం ఊరే వేడి వేడి జిలేబీలను, వాటి అనంతరం కారం కారంగా కరకరలాడుతుండే ఫాఫ్డాను; మధ్యాహ్నం భోజనంలోకి రొట్టెలు, అన్నం లేదా పెసర పప్పు కిచిడీని; సాయంత్రపు స్వల్పాహారంగా ఆవిరిపై ఉడికించి, ఆవాలు, పచ్చిమిర్చి తాలింపుతో మెత్తటి స్పాంజీలా చేసిన ఢోక్లాను... నాకోసం సిద్ధం చేయటమన్నది కూడా ఒక గొప్ప ఆతిథ్యం కంటే తక్కువేమీ కానప్పటికీ... వాళ్లు అందించిన మంచి నీళ్ల గ్లాసుకే మొదట నేను రుణపడి ఉంటాను.
సిలిగురిలో గత మూడు రోజులూ మహానంద నది నీళ్లే నా అమృతాహారం. ఢిల్లీలో ఈ రోజు గంగా జల వరప్రసాదం. రేపు మరొక నది కావచ్చు. ఆ మరునాడు ఇంకొక నది. ప్రాంతాలు ఏవైనా ‘జల’సత్వం ఒక్కటే. గురువారం, ఐదు దక్షిణాది రాష్ట్రాల జోనల్ కౌన్సిల్ సమావేశానికి మహాబలిపురం వెళ్లినప్పుడు... బహుశా అక్కడ నేను కృష్ణ లేదా కావేరీ నీళ్లు తాగి ఉంటాను. మీటింగ్‌కి, ఆ తర్వాత లంచ్‌కి ఏర్పాటు చేసిన నీళ్ల బాటిళ్లు చెన్నైలోని కృష్ణా, కావేరీ పైపుల నుంచి పట్టితెచ్చినవై ఉండాలి. ‘‘అమిత్ జీ, మీకోసం మా తమిళ వంటకాలను ఇంట్లో చేయించి తెచ్చాను’’ అన్నారు సీఎం విజయ్, లంచ్ మీట్‌లో! నదుల మధ్య రాష్ట్రాలకు సరిహద్దులు ఉంటే ఉండొచ్చు. నదీ జలాలు వంటగదులలో ఆ హద్దులను చెరిపేస్తాయి! భోజనం బల్ల ముందు కూర్చున్నంత సేపూ నేను గుజరాతీనిగానీ, ఢిల్లీవాలానుగానీ కాకుండా పూర్తిగా తమిళ ఆహారిని అయిపోయాను.
విజయ్ తనే స్వయంగా అందరికీ వడ్డించడం మొదలు పెట్టారు! తక్కిన నలుగురు ముఖ్యమంత్రులు కూడా ఒకరికి ఒకరు పాత్రలు అందించుకుంటున్నారు. పక్కన ఉన్నవారి గాజు గ్లాసులలో ఖాళీ అయిన మేరకు నీళ్లను నింపుతున్నారు. ‘‘మరికాస్త తినండి’’ అని గిన్నెలను ముందుకు జరుపుతున్నారు. ఇది కదా సమైక్య దేశం! ఇదే కదా భిన్నత్వంలో ఏకత్వం! కానీ, భోజనానికి ముందు జరిగిన కీలకమైన సమావేశంలో ఆ ఐదుగురు ముఖ్యమంత్రులు, నీళ్లలో తమ వాటా కోసం పట్టుపట్టిన వాళ్లే! ఒకరి గొంతు ఒకరు పట్టుకున్నవారే. కావేరి నదిపై మేకేదాటు జలాశయ నిర్మాణానికి కేంద్రం వెంటనే అనుమతులు ఇవ్వాలని కర్ణాటక ముఖ్యమంత్రి. కావేరి నది నుండి న్యాయంగా తమకు రావలసిన నీటి వాటాను విడుదల చేయాలని, ఎగువన కొత్త డ్యామ్‌ల నిర్మాణాలను ఆపాలని తమిళనాడు ముఖ్యమంత్రి.
గోదావరి–కృష్ణా–పెన్నా–కావేరి నదుల అనుసంధానానికి జాతీయ ప్రాజెక్ట్ హోదా ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. కృష్ణా జలాల ట్రిబ్యునల్ పరిధిలో తమ రాష్ట్రానికి రావలసిన నీటి వాటాను చట్టబద్ధంగా త్వరగా ఖరారు చేయాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి. కేరళ ప్రజల ప్రాణాల భద్రత దృష్ట్యా ముల్లపెరియార్ వద్ద కొత్త డ్యామ్ నిర్మించ డానికి తమిళనాడు, కేంద్రం అంగీకరించాలని కేరళం ముఖ్యమంత్రి. మీటింగ్‌కి, ఆ తర్వాతి డిన్నర్ మీటింగ్‌కి మధ్య ఎంత వ్యత్యాసం! ఎంత వైరుధ్యం?!మీటింగ్‌లో ‘‘మా నీళ్లు మాక్కావాలి’’ అని అడిగినవాళ్లు... డిన్నర్ మీటింగ్‌లో ఒకరికి ఒకరు నీళ్లందించుకున్నారు! మీటింగ్ అయ్యాక, సిలిగురి బయల్దేరే ముందు – ఏళ్లుగా దక్షిణాది రాష్ట్రాల మధ్య ఉన్న నీళ్ల వివాదాలకు మహాబలిపురంలో నాకు పరిష్కారం కనిపించింది! నీళ్లు ఇస్తే తప్ప, నీళ్లు తీసుకుంటే తీరేది కాదు నీళ్ల సమస్య!


