వందేమాతరం: కాంగ్రెస్‌పై అమిత్‌ షా ఆగ్రహం | Vande Mataram Row: Amit Shah Slams Congress Decision | Sakshi
Sakshi News home page

వందేమాతరం: కాంగ్రెస్‌పై అమిత్‌ షా ఆగ్రహం

Aug 20 2026 1:53 PM | Updated on Aug 20 2026 1:57 PM

Vande Mataram Row: Amit Shah Slams Congress Decision

వందేమాతరం పూర్తి గీతాన్ని ఆలపించాలన్న కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను కాంగ్రెస్‌ తిరస్కరించడంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ కార్యక్రమాల్లో వందేమాతరంలోని తొలి రెండు చరణాలను మాత్రమే ఆలపించాలని నిర్ణయించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఆ పార్టీ విధానం వల్లే దేశం రెండు ముక్కలైందంటూ మండిపడ్డారాయన. 

గురువారం ఆయన మాట్లాడుతూ.. వందేమాతరం విషయంలో కాంగ్రెస్‌ వైఖరి దేశాన్ని అవమానించడమే. రెండు చరణాలే పాడాలని సీడబ్ల్యూసీలో ఆ పార్టీ తీసుకున్న నిర్ణయం జాతికి వ్యతిరేకం. ఆ పార్టీ వైఖరికి నిరసనగా ప్రజలు ఉద్యమించాలని షా పిలుపు ఇచ్చారు. కాంగ్రెస్‌ 1937లో వందేమాతరాన్ని రెండు భాగాలుగా విభజించడం వల్లే దేశ విభజనకు బీజాలు పడ్డాయని ఆయన ఆరోపించారు. 

ముస్లిం మైనారిటీలను సంతృప్తిపరిచేందుకు అప్పటి కాంగ్రెస్‌ నాయకత్వం ఈ నిర్ణయం తీసుకుందని, ఆ తర్వాత ద్విజాతి సిద్ధాంతం బలపడి చివరకు దేశ విభజన, పాకిస్థాన్‌ ఆవిర్భావానికి దారితీసిందని ఆయన వ్యాఖ్యానించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆ చారిత్రక తప్పిదాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తోందని చెప్పారు.

స్వాతంత్య్ర సమరయోధులను అవమానించారు
వందేమాతరం ఆలపిస్తూ జైళ్లకు వెళ్లిన, ఉరికంబాలు ఎక్కిన లక్షలాది మంది స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను కాంగ్రెస్‌ అవమానిస్తోందని షా విమర్శించారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం బంకించంద్ర ఛటర్జీ రచనను కూడా అవమానిస్తున్నారని ఆరోపించారు. రాహుల్‌ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్‌ మరోసారి బుజ్జగింపు రాజకీయాలను ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. దేశ ప్రజలు దీనిపై గళమెత్తాలని పిలుపునిచ్చారు.

కాంగ్రెస్‌ కౌంటర్‌.. 1937 నిర్ణయానికే కట్టుబడి ఉంటాం
అమిత్‌ షా వ్యాఖ్యలను కాంగ్రెస్‌ తిప్పికొట్టింది. మహాత్మాగాంధీ, జవహర్‌లాల్‌ నెహ్రూ, సర్దార్‌ పటేల్‌, సుభాష్‌ చంద్రబోస్‌ తదితర అగ్రనేతల సమక్షంలో ఆనాడు తీసుకున్న నిర్ణయానికే తాము కట్టుబడి ఉంటామని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ స్పష్టం చేశారు. పార్టీ కార్యక్రమాల్లో వందేమాతరంలోని తొలి రెండు చరణాలనే ఆలపిస్తామని తెలిపారు.

ఇదంతా రాజకీయ రగడే: జైరాం రమేశ్‌
1937 అక్టోబర్‌ 28న జరిగిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశంలో వందేమాతరంపై తీర్మానం ఆమోదించారని జైరాం రమేశ్‌ గుర్తుచేశారు. రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ సూచన నేపథ్యంలో ఆ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ప్రస్తుతం వందేమాతరం అంశాన్ని బీజేపీ రాజకీయ వివాదంగా మారుస్తోందని, యువత, పరీక్షల పేపర్‌ లీకులు, చందా సేకరణ, విదేశాంగ వైఫల్యం వంటి అంశాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఈ వివాదాన్ని తెరపైకి తెచ్చిందని ఆరోపించారు.

ప్రభుత్వ కార్యక్రమాల్లో పూర్తి గీతం
మరోవైపు కేంద్ర హోంశాఖ కొత్త మార్గదర్శకాల ప్రకారం నిర్దేశిత ప్రభుత్వ కార్యక్రమాల్లో వందేమాతరం పూర్తి ఆరు చరణాల వెర్షన్‌ను ఆలపించనున్నారు. దీని వ్యవధి సుమారు 3 నిమిషాల 10 సెకన్లు కాగా, జాతీయ గీతం ‘జనగణమన’ వ్యవధి 52 సెకన్లు. దీంతో ప్రభుత్వ కార్యక్రమాల్లో వందేమాతరం పూర్తి గీతం.. కాంగ్రెస్‌ కార్యక్రమాల్లో తొలి రెండు చరణాలకే పరిమితం చేయాలన్న నిర్ణయం మధ్య రాజకీయ వివాదం మరింత ముదిరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement