సాక్షి, తాడేపల్లి: ఏపీపీఎస్సీ గ్రూప్-1లో ఎలాంటి అవకతవకలు జరగలేదని చంద్రబాబు వేసిన సిట్ చెప్పిందని.. అయినా దుష్ప్రచారం ఆపడం లేదని కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఈ క్రమంలో ఆయన సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేశ్‌కు ఓపెన్ చాలెంజ్ విసిరారు.
గురువారం తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్‌జగన్ మీడియాతో మాట్లాడుతూ.. ఏపీపీఎస్సీ గ్రూప్-1 చంద్రబాబు హయాంలో రిలీజ్ అయిన నోటిఫికేషన్. ఎన్నికల ముందు హడావిడిగా ఆయన దానిని రిలీజ్ చేశారు. మేం అధికారం చేపట్టక ముందే ప్రిలిమ్స్ జరిగాయి. ప్రిలిమ్స్‌లో పాసైన వాళ్లకే మేం మెయిన్స్, ఇంటర్వ్యూలు నిర్వహించాం.
ఎలాంటి అవకతవకలు జరగలేదని.. చంద్రబాబు వేసిన సిట్ చెప్పింది. వాల్యూయేషన్‌లో ఎలాంటి తప్పులు జరగలేదని తేల్చి చెప్పింది. అయినా కూడా పదే పదే తప్పుడు ప్రచారాలు చేశారు. అసలు ఏపీపీఎస్సీలో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చిన ఘనత మాది. మరి బాబు హయాంలో జరిగిన ఏపీపీఎస్సీ ఫలితాలను బయటపెట్టగలరా? అని సవాల్ విసిరారు.
బాబు హయాంలో ఏపీపీఎస్సీలో జరిగిన ఫలితాలను బయటపెట్టగలరా?.. రిటన్ టెస్ట్‌లో ఎన్ని మార్కులు, ఇంటర్వ్యూలో ఎన్ని మార్కులు చెప్పగలరా? అని ప్రశ్నించారు. గ్రామ సచివాలయాల్లో లక్షా 30 వేల ఉద్యోగాలిచ్చాం. మా హయాంలో 78 నోటిఫికేషన్లతో 6,296 ఉద్యోగాలిచ్చాం. ఒక్క ఆరోపణ అయినా వచ్చిందా? అని ప్రశ్నించారు. మా హయాంలో నిర్వహించిన 2018 గ్రూప్-1పై సీబీఐ దర్యాప్తునకు నేను రెడీ.. మీ హయాంలో జరిగిన 2025 డీఎస్సీపై సీబీఐ దర్యాప్తునకు మీరు సిద్ధమా? అని చంద్రబాబుకి వైఎస్ జగన్ ఓపెన్ చాలెంజ్ విసిరారు.
తప్పు చేయలేదు కాబట్టే తల ఎత్తుకుని అడుగుతున్నాం. ఫస్ట్ ర్యాంకర్ నవీన్‌కు ఎందుకు ఉద్యోగం రాలేదు?. విద్యాశాఖ మంత్రి ఆదేశాలు లేకుండా జీవోలు ఇవ్వగలరా?. బేరసారాల ఆడియో, వీడియో టేపులపై చర్యలేవీ?. సీబీఐ విచారణ జరిపించాలని ప్రధాని మోదీకి లేఖ రాశాం. కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు విజ్ఞప్తి చేశాం. సీబీఐ విచారణ చేయించాలని కోర్టును కూడా ఆశ్రయించాం. సవాల్‌కు సిద్ధమైతే.. విచారణకు సిద్ధమైతే దర్యాప్తు సంస్థకు లేఖ రాయండి అని వైఎస్ జగన్ అన్నారు.


