శ్రీసిటీలోని టాబ్లెట్ పరిశ్రమలో భారీ విస్పోటనం భయానక వాతావరణాన్ని సృష్టించింది. దాదాపు మూడు వందల మీటర్ల దూరంలో ఉన్న మరో ఫ్యాక్టరీ అద్దాలు ధ్వంసమయ్యాయంటే పేలుడు తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. పక్కనే ఉన్న ఇతర పరిశ్రమల రేకులు పేలుడు ధాటికి ధ్వంసమవ్వడం వళ్లు గగుర్పాటుకు గురిచేస్తోంది. ఐదుగురు మృత్యువాత పడగా.. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా చెల్లాచెదురుగా పడిపోవడం.. మాంసపు ముద్దలను తలపించడం చూపరులను భయాందోళనకు గురిచేసింది. శ్రీసిటీ పరిశ్రమలో శనివారం సంభవించిన భారీ విస్పోటనంపై ప్రత్యేక కథనం..
తిరుపతి(వరదయ్యపాళెం): శ్రీసిటీలోని టాబ్లెట్ ఇండియా(టీఐఎల్ హెల్త్‌కేర్)లో శనివారం ఉదయం భారీ విస్పోటనం సంభవించింది. ఐదుగురు మృత్యువాత పడ్డారు. ప్రమాద వార్త తెలియగానే పరిశ్రమ గేటు వద్దకు, శ్రీసిటీ ఆస్పత్రికి చేరుకుని బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు.
ఆ నిర్లక్ష్యమే కొంపముంచిందా?
పరిశ్రమలో బాయిలర్ ప్రమాదం మరోసారి ప్రభుత్వ తనిఖీ వ్యవస్థ వైఫల్యాన్ని బట్టబయలు చేసింది. బాయిలర్ల భద్రతకు బాయిలర్ ఇన్‌స్పెక్టర్‌దే ప్రధాన బాధ్యత. బాయిలర్స్ యాక్ట్–1923 ప్రకారం ప్రతి బాయిలర్‌కు ఏటా హైడ్రాలిక్ టెస్ట్, స్టీమ్ టెస్ట్ నిర్వహించి ఫిట్‌నెస్ సర్టిఫికేట్ ఇవ్వాలి. సేఫ్టీ వాల్వులు, ప్రెషర్ గేజ్‌లు, వాటర్ లెవెల్ ఇండికేటర్లు సరిగా పనిచేస్తున్నాయో లేదో క్షుణ్ణంగా పరిశీలించాలి. ఆపరేటర్లకు సర్టిఫికేట్ ఉందో లేదో చూడాలి. ఏటా కనీసం రెండు సార్లు ఆకస్మిక తనిఖీలు చేయాలి. కానీ తిరుపతి పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఇన్‌స్పెక్టర్ విస్మరించారనే ఆరోపణలున్నాయి. ఈ ఏడాది ఎప్రిల్‌లో ఫ్యాక్టరీ ఇన్‌స్పెక్టర్ తనిఖీ చేపట్టి అంతా బాగున్నట్టు సరి్టఫై చేశారు. మరి ఆరు నెలలు గడవకముందే ఇంతపెద్ద ఘోర ప్రమాదం జరగడానికి ఎవరు నిర్లక్ష్యమో తెలియడం లేదు.
ఒక్కొక్కరిదీ ఒక్కో దీన గాథ
ఇంటికి వస్తానన్నావు కద నాయనా?
సత్యవేడు మండలం, చెరివికి చెందిన చిన్నమస్తాన్ (36) మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ‘ఉదయం టిఫిన్ చేసి పనికి వెళ్లాడు.. ఇక రాడని తెలియదు’ అంటూ అతని భార్య గుండెలు పగిలేలా రోదించిన తీరు కలచివేసింది. తండ్రి మతదేహాన్ని చూసి పిల్లలు ‘నాన్నా’ అంటూ కన్నీళ్లు పెట్టుకోవడం చూపరుల గుండె తరుక్కుపోయేలా చేసింది.
తమిళనాడులోని మాదరపాకంకు చెందిన రమేష్ (40) కుటుంబాన్ని పోషించుకుందామని వచ్చి శవంగా తేలాడు.
పచ్చిమబెంగాల్‌కు చెందిన గౌరబ్‌రాయ్ (36), తడకు చెందిన వాసు (36) మృత్యువాత పడ్డారు. మహిళా కారి్మకురాలు కృష్ణవేణి గాయాలతో చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు.
తల్లి కష్టాన్ని చూసి..
తన ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు.. తండ్రి సంపాదన సరిపోక తల్లి పడుతున్న కష్టాన్ని గుర్తించిన తనయుడు మోహన్‌రాజ్ గత కొన్ని నెలలుగా తండ్రి డ్రైవర్‌గా పనిచేస్తున్న ట్యాబ్లెట్ ఇండియా పరిశ్రమలో కారి్మకుడిగా వెళ్తున్నాడు. శనివారం యథావిధిగా తమిళనాడు రాష్ట్రంకు చెందిన నాయుడు కుప్పం ఇంటి వద్ద నుంచి జనరల్ షిఫ్ట్‌కు వెళ్లాడు. వెనుక పది నిమిషాల వ్యవధిలోనే తండ్రి భాస్కర్ పరిశ్రమ వద్దకు చేరుకున్నాడు. అప్పటికే బాయిలర్ పేలుడు ప్రమాదంలో పరిశ్రమ గేటుకు సమీపంలో మోహన్‌రాజ్ విగత జీవిగా పడి ఉండడం చూసి తండ్రి తల్లడిల్లిపోయాడు. ఒక్కగానొక్క కొడుకు మృత్యువాత పడడంతో కన్నీరుమున్నీరుగా విలపించారు.
మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున పరిహారం
శ్రీసిటీలోని పరిశ్రమలో బాయిలర్ పేలి మృతి చెందిన ఐదుగురి కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.50 లక్షల చొప్పున పరిహారాన్ని రెండు రోజుల్లో అందజేస్తామని కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్ ప్రకటించారు. 2 టన్నుల సామర్థ్యం గల బాయిలర్ ఆకస్మికంగా పేలిపోవడంతో ముగ్గురు అక్కడికక్కడే మరణించగా, ఎగసిపడిన శిథిలాలు తగలడంతో మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారన్నారు. మృతుల్లో ఒక బాయిలర్ ఆపరేటర్, ఇద్దరు ఈటీపీ సిబ్బందితో పాటు మరో ఇద్దరు కారి్మకులు ఉన్నారన్నారు. మరణించిన వారిలో ఒకరు కోల్‌కత్తా, ఇద్దరు తమిళనాడు, మరో ఇద్దరు స్థానికంగా చెరివి, తడ ప్రాంతాలకు చెందినవారన్నారు. సమాచారం అందుకున్న వెంటనే ఎస్పీ ఎల్.సుబ్బారాయుడుతో కలసి ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించామన్నారు. మృతుల పిల్లల ఉన్నత చదువులతో సహా అన్ని విద్యా ఖర్చులను శ్రీసిటీ యాజమాన్యమే భరిస్తుందన్నారు. అర్హులైన కుటుంబ సభ్యులకు శ్రీసిటీ లేదా పరిసర పరిశ్రమల్లో తక్షణమే ఉద్యోగావకాశం కలి్పస్తామన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన తిరుపతి బాయిలర్ ఇ¯Œన్‌స్పెక్టర్‌ను తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశామన్నారు. ఆయన వెంట శ్రీసిటీ ఎండీ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి, సూళ్లూరుపేట ఆర్డీఓ దేవేందర్‌రెడ్డి, ఏఎస్పీలు రవిమనోహరాచారి, విమలకుమారి, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ విజయ్‌భరత్‌రెడ్డి ఉన్నారు.
విషాదకరం
శ్రీ సిటీలోని టిల్ ఫార్మన్యూటికల్ పరిశ్రమలో జరిగిన ప్రమాద ఘటనలో ఐదుగురు మృతి చెందడం విషాదకరం. పరిశ్రమ యాజమాన్యం, బాయిలర్ ఇన్‌స్పెక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే ఇంతటి ఘోరం జరిగింది. బాయిలర్ పేలుడుతో 300 మీటర్ల మేర ప్రమాద తీవ్రత ఏర్పడిందంటే ఎంతపెద్ద పేలుడు జరిగిందో అర్థమవుతుంది. మృతుల కుటుంబాలకు రూ.కోటి నష్టపరిహారం చెల్లించాలి.
– భూమన కరుణాకరరెడ్డి, వైఎస్సార్‌సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు


