ఫ్లై దుబాయ్ విమానం ఘటనలో పైలెట్ స్మిత్ మచ్చర్‌కు తీవ్ర గాయాలు
స్పృహ కోల్పోయే స్థితిలో అతను కాక్‌పిట్ డోర్ తెరవడం ఓ అద్భుతం
మజిల్ మెమరీ వల్లే అలా చేయడం సాధ్యమైందంటున్న వైద్య నిపుణులు
ఆ శక్తితోనే 174 మంది విమాన ప్రయాణికులను కాపాడిన స్మిత్
సర్వత్రా చర్చనీయాంశమైన మజిల్ మెమరీ అంశం
లబ్బీపేట (విజయవాడ తూర్పు): ఫ్లై దుబాయ్ విమానంలో కో పైలెట్ దాడిలో తీవ్రంగా గాయపడినప్పటికీ పైలెట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ కాక్‌పిట్ డోర్ తెరవడం ద్వారా విమానంలో ఉన్న 174 మంది ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలను కాపాడారు. ఆయన కాక్‌పిట్ డోర్ తెరవకపోయి ఉంటే విమా నాన్ని హైజాక్ చేయాలన్న కో పైలెట్ ప్రయత్నాన్ని నిలువరించగలిగి ఉండే వారు కాదు. విమానంలో ఉన్న ఇతర పైలెట్లు లోపలికి ప్రవేశించి, విమానాన్ని క్షేమంగా రన్‌వేపై దింపగలిగి ఉండే వారు కాదు. కో పైలెట్ క్రాష్ గొడ్డలితో పైలెట్ స్మిత్‌పై శరీరమంతా రక్తమోడేలా తీవ్రమైన గాయాలు చేశాడు.
స్పృహ కోల్పోయే స్థితిలో కూడా స్మిత్ కాక్‌పిట్ డోర్ తెరి చాడు. ఆ వెంటనే ఇతర ప్రయాణికులు లోపలికి ప్రవేశించి కో పైలెట్‌ను కట్టిపడేశారు. మరో ఇద్దరు పైలెట్లు విమానాన్ని నియంత్రించి, విమానాశ్రయంలో సేఫ్ ల్యాండింగ్ చేశారు. అంత తీవ్రమైన గాయాలై, స్పృహ కోల్పోయే దశలోనూ పైలెట్ స్మిత్ కాక్‌పిట్ డోర్ ఎలా తెరిచారు? ఇక్కడే శరీరంలో జరిగే ఓ అద్భుత ప్రక్రియ స్మిత్ మచ్చర్‌కు తోడ్పడింది. అదే మజిల్ మెమరీ. అంటే కండరాల జ్ఞాపక శక్తి. ప్రాణాపాయంలో ఉన్నప్పటికీ స్మిత్‌కు మెదడు నుంచి ఆదేశాలు లేకపోయినా మజిల్ మెమరీ ఆ పని చేసింది. పెను విపత్తును నివారించింది. మనిషి స్పృహలో లేకున్నా కండరాల్లో జ్ఞాపక శక్తి ఎలా ఉంటుంది అన్న అంశం ఇప్పుడు చర్చకు దారి తీసింది. అదెలా సాధ్యమో వైద్య నిపుణులు వివరిస్తున్నారు.
ఆలోచన అవసరం లేనిది..
కండరాల జ్ఞాపకశక్తి ఆలోచించాల్సిన అవసరం లేని ఒక స్వయంచాలక కదలిక. ఒక పనిని పదే పదే చేయడం ద్వారా కండరాలకు ఆ జ్ఞాపక శక్తి వస్తుంది. సంగీత వాయిద్య పరికరాన్ని వాయించడం, నృత్యం చేయడం, ఫోన్‌లో స్క్రోల్ చేయడం వంటివి ఉదాహరణగా చెప్పవచ్చు. కొందరు ఏదో ఆలోచిస్తూ సైకిల్ తొక్కేస్తుంటారు. మరి కొందరు కారు నడిపేస్తుంటారు. ఇంకొందరు యథాలా పంగా కీ బోర్డుపై టైప్ చేసేస్తుంటారు. నిత్యం బూట్లు తొడుక్కోవడం కూడా ఇటువంటిదే. ఇలా నిత్యం చాలా పనులను మొదడుతో సంబంధం లేకుండానే చేసేస్తాం. ఇవి కండరాలు చేసే పనులు.
జ్ఞాపకాలు నిలుపుకొనే సామర్థ్యం
వాస్తవానికి ఏ విషయమైనా మెదడులో నిల్వ ఉంటుంది. మెదడు నుంచి వచ్చే సంకేతాలను అనుసరించి పనులు చేస్తుంటాం. కానీ, కండరాల్లో ఆ జ్ఞాపకం మెదడు ప్రమేయం లేకుండానే ఓ క్రియగా బయటకు వస్తుంది. ఈ జ్ఞాపకాలు ఎంతకాలం నిలిచి ఉంటాయనే దానిపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. మెదడులాగా జ్ఞాపకాలను నిలుపుకొనే సామర్థ్యం కండరాలకు ఉండదు కాబట్టి, వాటికి శిక్షణ అవసరం. శిక్షణ పొందిన కండర కణాలలో కండర తంతు కేంద్రకాల (మయోన్యూక్లియై) సంఖ్య పెరుగుతుంది. ఒక పని అలవాటై పోయేంతవరకు మీరు దానిని శారీరకంగా చాలాసార్లు చేయాలి. ఉదాహరణకు నృత్య నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి ఒకే పాటను చాలా సార్లు ప్లే చేసి, నృత్యాన్ని మొదటి నుంచి చివరి వరకు సాధన చేస్తారు. ఇలా ఎంత ఎక్కువగా చేస్తే, అది అంత సులభం అవుతుంది. పైలట్ స్మిత్ నిత్యం అలవాటైన కాక్‌పిట్ డోర్ తెరవడం ఓ మజిల్ మెమరీగా మారి, అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో అతనికి సహాయ పడిందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
చిన్న మెదడులో నిక్షిప్తం
మనం ప్రతి రోజూ చేసే పని అలవాటుగా మారు తుంది. దీంతో ఎప్పుడు ఏమి చేయాలనేది చిన్న మెదడులో నిక్షిప్తం అవుతుంది. దీంతో అవసరమైన సమయంలో కండరాల కదలికలుంటాయి. అంటే పదే పదే ఒక పనిని చేయడం ద్వారా మెదడుతో పని లేకుండానే ఆ పని చేసేస్తుంటాం. దానినే మజిల్ మెమరీ అంటారు. పైలెట్ కూడా నిత్యం కాక్‌పిట్ డోర్ తెరుస్తూ ఉంటారు. ఆ క్రమంలో కోమాలో ఉన్నప్పటికీ మొదటిగా అతని చేయి డోర్ వద్దకు వెళ్లింది. వారికి అలాంటి శిక్షణ కూడా ఉంటుంది.
– డాక్టర్ డి.అనిల్‌కుమార్, న్యూరాలజిస్ట్


